పేరూరుకు నీళ్లిస్తాం ! | Sakshi
Sakshi News home page

పేరూరుకు నీళ్లిస్తాం !

Published Sat, Apr 22 2017 11:48 PM

పేరూరుకు నీళ్లిస్తాం !

– అధికారంలోకి వస్తే ఒక్కో గాలిమర కింద 10 మందికి ఉద్యోగాలు
– పరిటాల సునీత వల్ల రాప్తాడు నియోజకవర్గంలో 74వేల ఎకరాల ఆయకట్టు కోల్పోతున్నాం
– ఆర్నెళ్లలో పట్టిసీమను పూర్తిచేశాననే ముఖ్యమంత్రి.. దమ్ముంటే పేరూరుకు నీళ్లివ్వాలి
– తాగునీళ్లు కూడా ఇవ్వలేని మంత్రి పదవి ఉంటే ఎంత? లేకుంటే ఎంత?
– రాప్తాడు నియోజకవర్గంలో అరాచక పాలన సాగుతోంది : తోపుదుర్తి ప్రకాశ్‌
– కరువుపై చంద్రబాబు మొండిగా వ్యవహరిస్తున్నారు : ఎమ్మెల్యే విశ్వ, ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి
– చంద్రబాబు చర్యలతో ‘అనంత’కు తీరని నష్టం వాటిల్లుతోంది : మాజీ ఎంపీ అనంత


(సాక్షిప్రతినిధి, అనంతపురం): ‘కర్నూలు జిల్లా మల్యాల నుంచి జీడిపల్లికి నీళ్లు తెచ్చేందుకు రూ.వెయ్యికోట్లు కేటాయించారు. జీడిపల్లి నుంచి పేరూరుకు నీళ్లిచ్చేందుకు రూ.1300కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దోపిడీ చేయడం మినహా నీళ్లిచ్చే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు. మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ పరిధిలో లిఫ్ట్‌ల సామర్థ్యం పెంచితే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా తురకాలాపట్నం నుంచి నీళ్లు ఇస్తా!’ అని వైఎస్సార్‌సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. ‘రైతు పోరుబాట’ పేరుతో శనివారం చెన్నేకొత్తపల్లిలో భారీ బహిరంగసభ నిర్వహించారు. టీడీపీ నేతలు ఇటీవల వైఎస్‌ విగ్రహాన్ని కూల్చేయడం, ప్రత్యేకించి రాప్తాడు నియోజకవర్గంలో తరచూ ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంతో నిరసన తెలిపేందుకు నియోజకవర్గం నుంచి పార్టీ కార్యకర్తలు, వైఎస్‌ అభిమానులు భారీగా తరలివచ్చారు.

మొదటగా ఇటీవల వైఎస్‌ విగ్రహాన్ని తొలగించిన స్థానంలో నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రోజా, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, నాయకులు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, చందులు విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బహిరంగసభలో ప్రకాశ్‌రెడ్డి మాట్లాడారు. ‘రాప్తాడు నియోజకవర్గంలో ఓట్లు బడుగు, బలహీనవర్గాలవి. పెత్తనం దొరలది. మండలానికో పెత్తందారిని నియమించి రాచరిక పాలన సాగిస్తున్నారు. చెన్నేకొత్తపల్లి మండలంలో ఏదైనా పనికోసం పేదలు పోలీస్‌స్టేషన్, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలకు వెళితే ò‘‘పెద్దయ్యతో ఫోన్‌ చేయించు!’’ అంటారు. ఎవరు పెద్దయ్య? ఎవరికి పెద్దయ్య? చెన్నేకొత్తపల్లిలో ఎన్నో గ్రామాలకు తాగునీళ్లు లేవు. తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వలేని మంత్రి పదవి సునీతకు అవసరమా? ఇలాంటి పరిస్థితి ఉంటే సిగ్గు, ఎగ్గూ లేకుండా వైఎస్‌ విగ్రహాలు కూల్చేస్తున్నారు. మా మంచితనాన్ని చేతకానితనంగా భావించొద్దు. గాలిమరల కంపెనీలతో డబ్బులు దండుకుని నియోజకవర్గంలోని నిరుద్యోగుల కడుపుకొడుతున్నారు. మేం అధికారంలోకి వస్తే ఒక్కో గాలిమర పరిధిలో 10మందికి ఉద్యోగాలు ఇస్తాం. నియోజకవర్గంలో అరాచక పాలన సాగుతోంది. బోయ ఓబులేసును కొట్టినా, కురబ రాజేంద్ర ఎంపీపీ కాకుండా రాజకీయం చేసినా చర్యలు లేవు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని గ్రహించాలి’ అని అన్నారు.

ధనార్జనే లక్ష్యంగా బినామీలతో పని చేస్తున్నారు
‘గొల్లపల్లి రిజర్వాయర్‌ పనులను పాతకాంట్రాక్టర్‌కు రద్దు చేయించి, నామినేషన్‌ కింద రూ.53కోట్లతో సునీత తన బినామీ కాంట్రాక్టర్‌కు పనులు కట్టబెట్టింది. ఇందులో రూ.6.73కోట్లు మేర ఎక్కువ చెల్లింపులు జరిగాయని కాగ్‌ పేర్కొంది. అయినా ఎలాంటి చర్యలు లేవు. 2, 3 ప్యాకేజీల్లో కూడా చంద్రబాబు, సునీత బినామీ కంపెనీలైన సీఎం రమేశ్, ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు పనులు కట్టబెట్టారు. సునీత పాత కాంట్రాక్టు రద్దు చేయడం వల్ల రాప్తాడు నియోజకవర్గంలో 74వేల ఎకరాల ఆయకట్టును కోల్పోయాం. హంద్రీ–నీవా వెడల్పు చేస్తామని చంద్రబాబు అంటున్నారు. వైఎస్‌ డిజైన్‌ చేసింది 100 క్యూబిక్‌ మీటర్లు. మీరు చెబుతోంది అంతే! ఎకరా ఆయకట్టుకు కూడా నీళ్లు ఇవ్వలేనపుడు పనులు ఎందుకు చేయాలి. మట్టిపనులు తవ్వి నిధులు స్వాహా చేయడం మినహా ఇందులో మరో ఉద్దేశ్యం లేదు. పట్టిసీమను 6నెలల్లో పూర్తి చేశామని చంద్రబాబు గొప్పలు చెబుతున్నారు. 90రోజుల్లో హంద్రీ–నీవాను పూర్తి చేస్తామంటున్నారు. అదే చిత్తశుద్ధి పేరూరుపై ఉంటే ఆర్నెళ్లలో నీళ్లు ఇస్తామని చంద్రబాబు చెప్పగలడా?’ అని ప్రకాశ్‌రెడ్డి నిలదీశారు.

వైఎస్‌ విగ్రహం కూల్చడంపై క్షమాపణ చెప్పాలి:  ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి.
‘ప్రజల గుండెల్లో నుంచి వైఎస్‌ను చెరిపివేయాలనుకోవడం కాదు.. చేతనైతే వైఎస్‌ కంటే మంచిపాలన అందించండి. అంతేకానీ విగ్రహాలు కూల్చేయడం కాదు. వెంటనే విగ్రహం కూల్చివేతపై ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి. 130 ఏళ్లలో భయంకర కరువు ఇది. బతకలేక ప్రజలు వలసెళ్లారు. మూడేళ్లలో 200మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయినా ‘అనంత’పై చంద్రబాబుకు కనికరం లేదు. కరువుపోగొడతా అని రెయిన్‌గన్‌లకు రూ.160కోట్లు ఖర్చు చేశారు. ఖర్చుల పేరుతో మరో రూ.100 కోట్లు కాజేసేందుకు స్కెచ్చేశారు. ‘సాక్షి’లో కథనం రాగానే ఆగారు. పంటకుంటలు తవ్వాలని చంద్రబాబు చెబుతున్నారు. పంట కుంటల్లో కాంక్రీట్‌ వేస్తారు. ఆ నీరు భూమిలోకి ఇంకదు. జిల్లాలో ఆవిరి నష్టం ఎక్కువ. నీరు వృథా అవుతుంది. ఇదే జరిగితే భూగర్భజలాలు తగ్గి లక్షల బోర్లు ఎండిపోతాయి. చంద్రబాబు లెక్కప్రకారం 1.10కోట్ల ఖాతాల్లో రూ.87 వేలకోట్ల రుణాలను మాఫీ చేయాలి. మాఫీ జరగకపోవడంతో 40లక్షల ఖాతాలు డిఫాల్డ్‌ అయ్యాయి. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఓ జోకర్‌లా మారిపోయాడు. చంద్రబాబుపై పొగడ్తలు కురిపించే జేసీ.. 9ఏళ్లు సీఎంగా ఉన్నపుడు ఎందుకు హంద్రీ–నీవా చేపట్టలేదో చంద్రబాబును ప్రశ్నించాలి’.

బాబు చర్యలతో రైతులకు తీరని నష్టం: అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపీ
‘రూ.1070కోట్లతో ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపితే అందులో 50 శాతం రూ.535కోట్లు కేంద్రం విడుదల చేసింది. రాష్ట్రవాటా 535కోట్లు కలిపి 1070కోట్లు ఇన్‌పుట్‌సబ్సిడీ రావాలి. మరో 450కోట్లు ఇన్సూరెన్స్‌ రావాలి. కానీ ఇన్సూరెన్స్‌ను తమ వాటాగా రాష్ట్ర ప్రభుత్వం భావించి ఇన్సూరెన్స్, ఇన్‌పుట్‌సబ్సిడీ అన్నీ కలిపి రూ.1030 కోట్లు ఇస్తామంటోంది. ఇలా చేయడం ‘అంనత’ రైతులకు తీరని మోసం చేయడమే! చంద్రబాబు తన జేబు కంపెనీ అయిన బజాజ్‌కు ప్రీమియం చెల్లించేలా చేశారు. వారికున్న లావాదేవీలతో ఇన్సూరెన్స్‌పై నిలదీయలేకపోతున్నారు. రైతులు ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోద్దు. ప్రభుత్వం మెడలు వంచైనా మన హక్కులు సాధించుకుందాం’.  
    కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, ట్రేడ్‌యూనియన్‌ జిల్లా అధ్యక్షులు ఆదినారాయణరెడ్డి, రైతు విభాగం రాయలసీమ అధ్యక్షులు శరత్‌ చంద్రారెడ్డి, నాయకులు ఆలమూరు శ్రీనివాసరెడ్డి, మీసాల రంగన్న, శ్రీదేవి, రంగంపేట గోపాల్‌రెడ్డి, మహానందిరెడ్డి, కృష్ణవేణి, దేవి, నాగేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డి, రామాంజనేయులు, బాలకృష్ణారెడ్డి , సాధిక్‌వలి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement