వంగవీటి రంగా, రాధా హత్యోదంతాలపై సినిమా


కాపు ఐక్య గర్జనకు ముమ్మర ఏర్పాట్లు

 31న తునిలో ముద్రగడ ఆధ్వర్యంలో భారీ సభ




 సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈనెల 31న తూర్పు గోదావరి జిల్లా తునిలో తలపెట్టిన కాపు ఐక్య గర్జన మహాసభను విజయవంతం చేసేందుకు కాపు రిజర్వేషన్ల పోరాట సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. వారం రోజులుగా రాష్ట్రానికి చెందిన వివిధ కాపు సంఘాలు హైదరాబాద్‌లో వరుస భేటీలు నిర్వహిస్తున్నాయి. కులాలు, మతాలతో సంబంధం లేకుండా రిజర్వేషన్లపై అవగాహన ఉన్న ప్రముఖులు, మేధావులతో సంప్రదింపులు జరుపుతున్నాయి. రిజర్వేషన్లు ఎందుకు అవసరమో, అవెందుకు పోయాయో ప్రముఖ యూనివర్సిటీలు, న్యాయకోవిదులు, మాజీ ఐఏఎస్‌లతో తమ సభ్యులకు తరగతులు చెప్పిస్తున్నాయి. అలాగే 150కి పైగా కాపు సంఘాలు సామాజిక మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాయి. ప్రతి జిల్లా నుంచి కనీసం 50 వేల మంది రావాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.



 పాలకులను హడలెత్తిస్తాం: తునిలో జరిగే గర్జనతో పాలకులను హడలెత్తిస్తామని, తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని రాష్ట్ర కాపు రిజర్వేషన్ నాయకుడు ఆరేటీ ప్రకాశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.  ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు, వాగ్ధానాలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.



 వంగవీటి రంగా, రాధా హత్యోదంతాలపై సినిమా

 తాడేపల్లిగూడెం: ‘కాపు కుల సంక్షేమం కోసం పోరు సలుపుతున్న వంగవీటి రాధా, రంగాలను వేరే సామాజిక వర్గానికి చెందిన వారు కుట్రలు, కుతంత్రాలతో ఎలా మట్టుపెట్టారు. ఆ ఇద్దరినీ ఎలా పావులుగా వాడుకున్నారు. పని అయ్యాక పథకం ప్రకారం ఎలా అంతమొందించారు’ అనే కథాంశంతో కాపులను బీసీలలో చేర్చాలని పోరు ఊపందుకుంటున్న తరుణంలో ఒక సినిమా చిత్రీకరణకు సన్నాహాలు జరుగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సినిమాకు ఈ నెల 31న తునిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో జరగనున్న కాపు మహాగర్జన సభలో క్లాప్ కొట్టడానికి ఏర్పాట్లు సాగుతున్నట్టు తెలిసింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top