
చంద్రబాబు ఆశించినా మా జాతిలో పుట్టలేడు
తాను దళితుడిగా పుట్టాలనుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తల్లకిందులుగా తపస్సుచేసినా అది సాధ్యం కాదు..
- అట్రాసిటీ చట్టం ప్రకారం ఏపీ సీఎంను అరెస్టు చేయాలి
- దళిత మహాసభ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కత్తి పద్మారావు
తెనాలి: తాను దళితుడిగా పుట్టాలనుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తల్లకిందులుగా తపస్సుచేసినా అది సాధ్యం కాదని, రిజర్వేషన్ పొందుతున్న కులాలపై ద్వేషంతో ఎదిగిన ఆయనకు దళితుడిగా పుట్టే మహత్తర అవకాశం ఎన్నటికీ రాదని దళిత మహాసభ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కత్తి పద్మారావు అన్నారు. ఎస్సీలను ఉద్దేశించి తీవ్రవ్యాఖ్యలు చేసినరోజే సీఎంను అట్రాసిటీ చట్టం కింద అరెస్టు చేయాల్సిఉందని, అయితే పోలీస్ వ్యవస్థ అందుకు తయారుగాలేదని పద్మారావు అన్నారు.
గుంటూరు జిల్లా తెనాలిలో శనివారం బహుజన టీచర్స్ అసోసియేషన్ (బీటీఏ), దళిత మహాసభ, అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ‘అంబేడ్కర్-వ్యక్తిత్వ నిర్మాణం’ అంశంపై ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. బీటీఏ వ్యవస్థాపక కార్యదర్శి బట్టు వెంకయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో లెక్చర ఇచ్చిన పద్మారావు.. చంద్రబాబు తీరును ఎండగట్టారు.
తన రాజకీయ జీవితంలో అంబేద్కర్ ఎన్నడూ అవినీతికి తావివ్వలేదని వల్లించే చంద్రబాబు.. తన కొడుకు చేత అవినీతి దుకాణం తెరిపించాడని, శ్రమశక్తి నుంచి ఉద్భవించిన దళితులను పన్ను వసూళ్ల నుంచి పుట్టిన ఇతరులు విమర్శించే అర్హతలేదని పద్మారావు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడులు రిజర్వేషన్ పొందుతున్న కులాలపై ద్వేషంతోనే ఎదిగారని, రుణమాఫీ చేస్తానని ఎన్నికల్లో హామీఇచ్చి, సొంత కులానికి చెందిన రైతులనే వెన్నుపోటుపొడిచిన చరిత్ర బాబుదని పద్మారావు విమర్శించారు.