అత్తను మట్టుబెట్టిన కోడలు.. | Sakshi
Sakshi News home page

సజీవ దహనం

Published Sat, Jun 6 2020 6:41 AM

Daughter in law Assassinated Aunt in Tamil nadu - Sakshi

సాక్షి, చెన్నై: తన కాపురంలో వరకట్న చిచ్చు పెట్టడమే కాదు, భర్తను తనకు దూరం చేయడానికి ప్రయత్నించిన  ఓ అత్తను కోడలు సజీవదహనం చేసింది. పాలల్లో నిద్రమాత్రలు వేసి నిద్ర పుచ్చినానంతరం కిరోసిన్‌ పోసి నిప్పు పెట్టింది. అత్త శరీరం మంటల్లో కాలుతున్నా, ఏమీ ఎరుగనట్టుగా మరో గదిలో నిద్ర నాటకం ఆడి అడ్డంగా ఈ కోడలు బుక్కైంది. పోలీసుల కథనం మేరకు వివరాలు...(కాళ్ల పారాణి ఆరకముందే... )

పుదుకోట్టై జిల్లా వెల్లకోట సమీపంలోని మనియాందపురం గ్రామానికి చెందిన రమేష్‌కు రెండేళ్ల క్రితం ప్రతిభతో వివాహం అయింది. వీరికి తొమ్మిది నెలల ఆడ బిడ్డ ఉంది. రమేష్‌ పుదుకోట్టైలోని ఓ మందుల తయారీ సంస్థలో ఉద్యోగి. రమేష్‌తో పాటు తండ్రి అరుల్‌ పుళవన్, తల్లి రాజమ్మాల్‌ కూడా ఉన్నారు. ఈ కుటుంబానికి సొంతంగా ఇళ్లు, పంట పొలాలు ఉన్నాయి. అయితే, కోడల్ని కూతురుగా చూసుకోవాల్సిన అత్త రాజమ్మాల్‌ మొదటి నుంచి ఆరళ్లు పెడుతూ వచ్చింది. పెళ్లి సమయంలో కట్న కానుకల్ని బకాయి పెట్టారని, అది తీసుకు రావాలని, పదే పదే కోడల్ని వేధించేది. తన కుమారుడికి ఆడ బిడ్డ పుట్టినానంతరం కోడలిపై వేధింపుల్ని ఈ గయ్యాలి అత్త పెంచింది. అదనపు కట్నం తీసుకురావాలని లేని పక్షంలో తన కుమారుడికి మరో పెళ్లి చేస్తానంటూ బెదిరించడం మొదలెట్టింది. భర్త, అత్తమామలు తనను బాగానే చూసుకుంటున్నా, అత్తరూపంలో తనకు వేధింపులు పెరగడంతో బయటకు చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోయేది. తన పుట్టింట్లో ఆదరణ కరువు కావడం, అత్త వేధింపులు పెరగడం వెరసి మానసికంగా కృంగిన ›ప్రతిభ చివరకు ఉన్మాదిగా మారింది.  (అక్కాచెల్లెలు అదృశ్యం..)

పథకం ప్రకారం..
వంద రోజుల ఉపాధి పథకం కూలీలకు హెడ్‌గా ఉన్న అత్త రాజమ్మాల్‌ ఇంటికి రాగానే, ప్రతిరోజూ పాలు తాగడం అలవాటు. దీనిని ఆసరగా చేసుకుని ఆమెను మట్టుబెట్టేందుకు ప్రతిభ పథకం వేసుకుంది. వారం రోజులుగా ఒక్కక్కటి చొప్పున నిద్ర మాత్రల్ని మెడికల్‌ షాపు ద్వారా సేకరించింది. బుధవారం సాయంత్రం మామ అరుల్‌ పుళవన్‌ బయటకు వెళ్లడం, భర్త ఇంటికి వచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశాల్ని పరిగణలోకి తీసుకుంది. ఇంటికి వచ్చిన అత్త పాలు తాగింది. అప్పటికే అందులో నిద్ర మాత్రల్ని ప్రతిభ వేసింది. ఆ మత్తులో ఆమె నిద్రకు ఉపశ్రమించింది. తన కాపురంలో చిచ్చు పెట్టే రీతిలో వేధింపులు ఇవ్వడమే కాదు,  భర్తను తనకు కాకుండా చేస్తానన్న అత్తను హతమార్చేందుకు ఉన్మాదిగా మారింది. ముందుగా సిద్ధం చేసుకున్న కిరోసిన్‌ను ఆమెపై పోసి నిప్పు పెట్టింది.

ఏమీ ఎరుగనట్టుగా మరో గదిలోకి వెళ్లి నిద్ర పోయినట్టు నాటకం రచించింది. అయితే, ఈ ఇంట్లో నుంచి హఠాత్తుగా పొగ, కాలిన వాసన రావడాన్ని గుర్తించిన స్థానికులు పరుగులు తీశారు.  తలుపులు తెరిచే ఉండడంతో లోనికి వెళ్లారు. అక్కడ మంటల్లో రాజమ్మాల్‌ కాలుతుండడంతో ఆర్పే యత్నం చేశారు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఇంత జరుగుతున్నా, కోడలు గదికే పరిమితం కావడం, గాడ నిద్ర నుంచి లేచినట్టు బయటకు రావడం స్థానికుల్లో అనుమానం రేకెత్తించింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అయితే, ఆస్పత్రిలో రాజమ్మాల్‌ మరణించడం, సంఘటన స్థలంలో సాగిన పోలీసులు విచారణతో కోడలి బండారం బయటపడింది. భర్తకు మరో పెళ్లి చేస్తే, తాను, తన బిడ్డ ఒంటరి అవుతామన్న భయంతోనే ఈ కిరాతకానికి ఒడి గట్టాల్సి వచ్చిందని ప్రతిభ కన్నీటి పర్యంతమైంది. ఆమెను అరెస్టు చేసిన పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. అత్త కోడళ్ల మధ్య సాగిన వరకట్న వేధింపులు, ఉన్మాద చర్య కారణంగా ముక్కు పచ్చలారని 9 నెలల చంటి బిడ్డ పాల కోసం అలమటిస్తుండడం కొసమెరుపు.

Advertisement
 
Advertisement
 
Advertisement