ఒక్క బీటెక్ తో జాబ్ రానే రాదు! | Sakshi
Sakshi News home page

ఒక్క బీటెక్ తో జాబ్ రానే రాదు!

Published Mon, Jun 26 2017 11:49 AM

ఒక్క బీటెక్ తో జాబ్ రానే రాదు!

విజయవంతంగా బీటెక్ పట్టాలతో కాలేజీల నుంచి బయటికి వస్తున్న విద్యార్థులకు బ్యాడ్ న్యూస్. బీటెక్ డిగ్రీ హోల్డర్స్ ప్రస్తుతం అత్యంత కఠినమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తోంది. కేవలం ఒక్క డిగ్రీతోనే ఐటీ కెరీర్ లో విజయవంతం కావడం కష్టతరమని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రతేడాది రాష్ట్రంలో 75వేల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తమ గ్రాడ్యుయేట్ పూర్తిచేస్తున్నారు. వారందరూ కెరీర్ లో సక్సెస్ కావాలంటే, అదనపు స్కిల్స్, సముచిత ప్రాంతంలో స్పెషలైజేషన్ కొత్త మంత్రాలుగా విశ్లేషకులు హితభోదిస్తున్నారు. 
 
1990 మధ్యలో ఐటీ బూమ్ ప్రారంభమైనప్పుడు, సాఫ్ట్ వేర్ కంపెనీలు ఎంట్రీ లెవల్ ఉద్యోగాల కోసం కేవలం ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లనే నియమించుకునేవి. తర్వాత మూడు నెలల కాలం నుంచి ఆరు నెలల కాలం వ్యవధిలో ట్రైనింగ్ ఇచ్చి, వారిని తమ ప్రాజెక్టులలోకి కేటాయించేవి. కానీ గత కొన్నేళ్ల నుంచి అంతర్జాతీయ ఐటీ మార్కెట్లో విద్యార్థులను నియమించుకునే ప్రక్రియలో చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం కంపెనీలు తమ బడ్జెట్ లను మరింత కఠితనరం చేస్తున్నారు. దీంతో ట్రైనింగ్ కు వెచ్చించే అవకాశం కనబడటం లేదు. 
 
మంచి అకాడమిక్ రికార్డు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న ఫ్రెషర్లకి అప్పట్లో ఉద్యోగాలు ఆఫర్ చేసేవాళ్లమని మాదాపూర్ కు చెందిన ఓఎస్ఐ కన్సల్టెంగ్ ఎండీ అనిల్ యామిని చెప్పారు. కానీ ప్రస్తుతం పరిస్థితులన్ని మారిపోయాయని, బీటెక్ డిగ్రీతో పాటు ఏదైనా టెక్నాలజీ లేదా వర్టికల్ పై సంపూర్ణ జ్ఞానం ఉన్న గ్రాడ్యుయేట్లనే కంపెనీలు కోరుకుంటున్నాయని తెలిపారు. సీఎస్ఈ, ఐటీ బ్రాంచులను ఎంపికచేసుకునే విద్యార్థుల్లో కూడా తమ కోర్ సబ్జెట్ లలో పరిపూర్ణ జ్ఞానం, నైపుణ్యాలు ఉండటం లేదన్నారు. ఇప్పటికే చాలా అధ్యయనాలు కూడా గ్రాడ్యుయేట్లు ప్రస్తుత ఐటీ ఇండస్ట్రీకి తగిన విధంగా ఉండటం లేదని గుర్తించాయి. 
 
ప్రస్తుతం సాఫ్ట్ వేర్ కంపెనీలు ఎంట్రీలెవల్ ఉద్యోగాల్లో కోత పెడుతున్నాయి. తమ బెంచ్ బలాన్ని తగ్గించేసుకుంటున్నాయి. ఇది కొత్త టెకీలపై కూడా ప్రభావం చూపుతుంది. అదనంగా టెక్నికల్ స్కిల్స్ లేని బీటెక్ విద్యార్థులకు  ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగాలు వచ్చే అవకాశముండదు. కంపెనీలో జాయిన్ అవకముందే ప్రాజెక్టులపై విద్యార్థులకు అవగాహన ఉండాలని ఐటీ సంస్థలు కోరుకుంటున్నాయని పలువురు పేర్కొంటున్నారు. మరోవైపు ఆటోమేషన్ సైతం ప్రాజెక్ట్ సమయాన్ని తగ్గించడం, బెంచ్ బలగాల డెలివరీ షెడ్యూలపై ప్రభావం చూపడం కూడా చేస్తోంది. 

Advertisement
Advertisement