ఫ్లిప్‌కార్ట్ బాటలోనే ఎల్‌అండ్‌టీ | Sakshi
Sakshi News home page

ఫ్లిప్‌కార్ట్ బాటలోనే ఎల్‌అండ్‌టీ

Published Mon, May 30 2016 11:02 AM

ఫ్లిప్‌కార్ట్ బాటలోనే ఎల్‌అండ్‌టీ - Sakshi

ఐఐఎం పట్టభద్రులకు ఆఫర్ లెటర్లు ఇచ్చినట్లే ఇచ్చి ఎంతకీ ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో ఫ్లిప్‌కార్ట్ మీద జనం దుమ్మెత్తి పోసిన సంగతి గుర్తుంది కదూ. ఇప్పుడు అదేబాటలో ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్ కూడా పయనిస్తోంది. వివిధ కాలేజీలకు చెందిన దాదాపు 1500 మంది విద్యార్థులకు ఇచ్చిన ఆఫర్ లెటర్లను ఆ కంపెనీ రద్దుచేసింది. అంటే.. ముందు ఉద్యోగం ఇస్తాం రమ్మని చెప్పి, ఆ తర్వాత లేదు పొమ్మందన్న మాట. దాంతో పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడింది. తమకు చేతిలో ఉద్యోగం ఉంది కదా అన్న నమ్మకంతో వేరే ప్రయత్నాలు ఏమీ చేయని వాళ్లు.. చదువుకోడానికి తాము తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్లను తీర్చాలంటూ బ్యాంకుల నుంచి పదే పదే ఫోన్లు రావడంతో ఏం చేయాలో తెలియక వాపోతున్నారు.

పైగా, ఒకసారి ఒక కంపెనీలో క్యాంపస్ ప్లేస్‌మెంట్ ఆఫర్ వచ్చిందంటే, మరో కంపెనీ ప్లేస్‌మెంట్ ఇంటర్వ్యూకు వెళ్లడానికి వీల్లేదని తమిళనాడులో దాదాపు అన్ని కాలేజీలలో నిబంధన ఉందని ఓ విద్యార్థి చెప్పాడు. తమ పెర్ఫార్మెన్సు తగినవిధంగా లేని కారణంగా ఆఫర్ రద్దుచేస్తున్నట్లు మెయిల్ పంపారని, ఇప్పుడు ఏం చేయాలని వాపోయాడు. ప్లేస్‌మెంట్లు బాగున్నాయనే ఈ కాలేజీలలో ఫీజు ఎక్కువైనా చేరి, ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నామని, ఇప్పుడు బ్యాంకులు దాదాపు ప్రతిరోజూ తమకు లేఖలు పంపుతున్నాయని మరో విద్యార్థి ఆందోళన వ్యక్తం చేశాడు. ఇన్నాళ్ల బట్టి తొందరపడొద్దు, జాయినింగ్ డేట్ త్వరలోనే చెబుతామన్న ఎల్అండ్‌టీ ఇన్ఫోటెక్ వాళ్లు ఇప్పుడు చావుకబురు చల్లగా చెప్పారని మండిపడ్డాడు. తమకు జరిగిన అన్యాయంపై విద్యార్థులు నిరాహార దీక్షలకు కూడా దిగారు.

మరికొన్ని కంపెనీలు కూడా..
వాస్తవానికి ఫ్లిప్‌కార్ట్, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ల పేర్లు బయటకు వచ్చాయి కాబట్టి విషయం తెలుస్తోంది కానీ, ఇంకా చాలా కంపెనీలు ఇలాగే చేస్తున్నాయి. ఇన్‌మోర్బి, కార్‌దేఖో, హాప్‌స్కాచ్ లాంటి కంపెనీలు కూడా తొలుత ఆఫర్ లెటర్లు ఇచ్చి, ఆ తర్వాత ఉద్యోగాలు ఇవ్వలేదని అంటున్నారు. దీనివల్ల కాలేజీల ట్రాక్ రికార్డు కూడా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement