జగన్ దీక్షపై ‘ఎల్లో’ విషం


* మళ్లీ బయటపడ్డ జగన్ ఫోబియా

* కోట్ల మంది ఆందోళనకు మద్దతుగా జగన్ దీక్ష నిర్ణయం

* జైలులో దీక్ష చేయటానికి వీల్లేదంటూ శివాలెత్తిన ఎల్లో మీడియా

* ప్రత్యేక కేటగిరీ రద్దు చేస్తారంటూ జైలు అధికారుల పేరుతో అసత్యాలు

* నిరసన తెలిపే ప్రజాస్వామిక హక్కును విస్మరిస్తూ కుట్రపూరిత కథనాలు

* ఈ కథనాల వెనుక జగన్‌పై వేధింపులకు పాల్పడేలా సరికొత్త కుట్ర?

* వేధింపులేవీ లేకపోతే.. మిలాఖత్ అయ్యారంటూ దుష్ర్పచారమే లక్ష్యం

 

సాక్షి, హైదరాబాద్: ఒకవైపు నిరంకుశ విభజన నిర్ణయంతో రాష్ట్రం రగులుతూ ఉంటే.. సీమాంధ్రలో కోట్లాది మంది పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఉంటే.. అధికార, ప్రతిపక్షాలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతూ.. ఆ ప్రజల ఆక్రందనలను పట్టించుకోకుండా వ్యవహరిస్తూ ఉంటే.. అదిచూసి ఆవేదన చెందిన జననేత జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రజా ఉద్యమానికి మద్దతుగా జైలులోనే నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయం బయటకు వచ్చీ రాకముందే ఎల్లో మీడియా విషప్రచారం అందుకుంది.



జగన్ దీక్ష లక్ష్యం.. ప్రజల ఆకాంక్షలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా.. జగన్ పేరు వింటేనే తమలో గుబులుపుట్టే ఫోబియాను మరోసారి నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నాయి. ఎల్లో పార్టీ ప్రచార బాకాలుగా నిత్యం చంద్రబాబుకు వత్తాసు పలికే కొన్ని టీవీ చానళ్లు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో మొదటి నుంచీ అనుసరిస్తున్న కుట్రపూరిత బుద్ధిని మరోసారి చాటుకున్నాయి. నిరసనను తెలియజేసే విషయంలో ఒక వ్యక్తికి ఉండే ప్రజాస్వామిక హక్కు, ప్రాథమిక హక్కులను తోసిరాజని అత్యుత్సాహం ప్రదర్శించాయి. జైలులో నిరాహార దీక్షలు చేయరాదని అధికారులు తమకు చెప్పినట్లు కల్పిత కథనాలు ప్రసారం చేశాయి.



జైల్లో నిరాహార దీక్ష చేస్తే జగన్‌మోహన్‌రెడ్డికి ములాఖత్‌లు రద్దుచేస్తారని.. జగన్‌కు కల్పించిన ప్రత్యేక కేటగిరీని తొలగించాల్సిందిగా కోర్టును ఆశ్రయిస్తామని జైలు అధికారులు చెప్పినట్లు అబద్ధాలు గుప్పించాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల కుమ్మక్కు కుట్రల ఫలితంగా.. అది కూడా విచారణ ఖైదీగా జైలు నిర్బంధంలో ఉన్న జగన్.. ఏదో చట్టవిరుద్ధమైన పనిచేస్తున్నారనే అర్ధం వచ్చేలా చెప్తూ ప్రజలను గందరగోళ పరచడానికి అడ్డగోలు ప్రసారాలకు తెగబడ్డాయి.



జైలు అధికారుల పేరుతో అబద్ధాలు...

ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా కాంగ్రెస్ రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోవటంతో సీమాంధ్ర ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంకావటమే కాకుండా ప్రజలంతా గత 26 రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి అండగా ఉండాలన్న నిర్ణయంతో జగన్ నిరాహార దీక్ష నిర్ణయం తీసుకోగా.. ఆ విషయాన్ని కాదని జైలులో జగన్‌కు దీక్ష చేసే హక్కు లేదని, ములాఖత్‌లన్నీ నిలిపివేస్తారని, ప్రత్యేక కేటగిరీని రద్దు చేస్తారని.. ఈ విషయాలు జైలు అధికారులే చెప్పారంటూ ఇష్టానుసారంగా ప్రసారాలు మొదలుపెట్టాయి. కానీ.. ఆయా చానళ్లలో ప్రసారమైన ఈ కథనాల గురించి జైలు అధికారులను ‘సాక్షి’ సంప్రదించగా.. తాము ఏ మీడియాతోనూ మాట్లాడలేదని వారు స్పష్టంచేశారు.



ఆ కథనాల వెనుక మరో కుట్ర?

వాస్తవానికి ములాఖత్‌ల విషయంలో జైలు మాన్యువల్ విరుద్ధంగా వెళ్లటం గానీ, న్యాయస్థానం ఇచ్చిన ప్రత్యేక కేటగిరీని మార్చటం గానీ జైలు అధికారులు చేయలేరు. మరైతే.. లక్షలాది మంది ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక పార్లమెంట్ సభ్యుడైన జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక కేటగిరీని న్యాయస్థానం కల్పిస్తే దాన్ని రద్దు చేస్తారంటూ ఎల్లో మీడియా ఉన్నపళంగా తప్పుడు కథనాలు ఎందుకు ప్రసారం చేయాల్సివచ్చింది? ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శించింది? నిరసన తెలిపే హక్కు ఒక వ్యక్తి ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుందన్న కనీస జ్ఞానాన్ని విస్మరించి పనిగట్టుకుని ఎందుకు వక్రభాష్యం చెప్పాయి? టీడీపీ అధినేత చంద్రబాబు కనుసన్నల్లో పనిచేసే ఆ ఎల్లోమీడియా.. జగన్ దీక్ష దేనికోసం చేస్తున్నారన్న విషయాల జోలికెళ్లకుండా.. ఈ రకంగా మరో కుట్రకు తెరతీశాయన్న అనుమానాలు కూడా ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.



ప్రభుత్వానికి వేధింపుల మార్గం చూపటమే...

నిరాహార దీక్ష చేసినంత కాలం ఎవరినీ కలవనని జగన్ స్వయంగా తానే ప్రకటించిన విషయాన్ని సైతం విస్మరించి మరీ అడ్డగోలు కథనాలకు తెగబడటం వెనుక.. ఎల్లో గ్యాంగ్ ఉద్దేశం స్పష్టంగా బయటపడింది. ‘‘జైలు అధికారుల పేరుతో ఎల్లో మీడియా విషప్రచారం ద్వారా.. వేధింపులకు వెరచి జగన్ దీక్ష విరమించుకుంటారనే ఉద్దేశం ఉండొచ్చు. లేదా ఈ విధంగా ఊదరగొట్టటం ద్వారా ప్రభుత్వం జగన్‌ను వేధించటానికి అవసరమైన దారి చూపటం కావచ్చు. ఇవన్నీ జరగకపోతే జగన్‌తో ప్రభుత్వం మిలాఖత్ అయ్యిందనే ప్రచారం చేయటానికి ఉపయోగపడవచ్చుననే ఉద్దేశంతోనే ఎల్లో మీడియా ఈ కుట్రకు పాల్పడింది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు.



ఎల్లో మీడియాది ఆది నుంచీ వక్రీకరణే...

జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డిపై మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తూనే ఉన్నారు. జైలు నిబంధనలకు విరుద్ధంగా అత్యధికంగా ములాఖత్‌లు ఇస్తున్నారని, జైలు నుంచే ఆయన ఫోనులో మాట్లాడుతున్నారంటూ టీడీపీ నేతలు రాష్ట్రంలో ఇంకేమీ పనిలేనట్లు నిత్యం ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అవన్నీ పూర్తిగా నిరాధారమైనవని జైళ్లశాఖ డెరైక్టర్ జనరల్ టి.కృష్ణరాజు స్వయంగా వివరణ ఇచ్చారు. నిబంధనలకు అనుగుణంగానే ములాఖత్‌లు ఇస్తున్నామని, జైలు నుంచి ఫోనులో మాట్లాడుతున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టంచేశారు.



విజయమ్మ మాటలకూ వక్రభాష్యం...

నిన్నటికి నిన్న గుంటూరులో దీక్ష ప్రారంభం సందర్భంగా వై.ఎస్.విజయమ్మ మాట్లాడిన మాటలను కూడా ఎల్లో మీడియా వక్రీకరించింది. ‘ప్రజల తరఫున జైల్లో ఉన్న జగన్‌తో చెప్పమని ఫోనులో చెపుతానని’ వైఎస్ విజయమ్మ అన్న మాటలను.. ఎల్లో మీడియా వక్రీకరించింది. జైల్లో ఉన్న జగన్‌తో ఫోనులో మాట్లాడతానన్నట్లూ ఆమె మాటలకు అర్థాలు తీశారు. జగన్‌ను ములాఖత్ ద్వారా కలిసిన సందర్భంలో కుటుంబ సభ్యులు, పార్టీ నేతల ద్వారా ప్రజల తరఫున విషయాలు చెప్పాలని చెప్తాననేది విజయమ్మ చెప్పిన మాట.



ఆ విషయం స్పష్టంగా ఉన్నప్పటికీ జగన్ జైలు నుంచే ఫోను మాట్లాడుతున్నారంటూ టీడీపీ నాయకులు ఆరోపణలు గుప్పించారు. టీడీపీ వంతపాడే ఎల్లో మీడియా కూడా అదే విషప్రచారం సాగించింది. గతంలో జగన్‌మోహన్‌రెడ్డిని జైలు నుంచి కోర్టు వాయిదాకు తీసుకెళ్లే సమయంలో భద్రతను గాలికొదిలేసి బులెట్ ప్రూఫ్ వాహనం వాడకుండా సాధారణ వ్యాన్‌లో తరలించిన వ్యవహారంలోనూ టీడీపీ నేతలు మాట్లాడుతూ జగన్ కోర్టుకు నవ్వుతూ ఎలా వెళతారని ఆక్రోశం వెళ్లగక్కారు. ఆ విషయంలో బులెట్‌ప్రూఫ్ వాహనంతో పాటు జగన్‌కు అవసరమైన భద్రత కల్పించాలని న్యాయస్థానం ఆదేశించాల్సి వచ్చింది.

 

అడ్డుకునే అధికారం జైలు అధికారులకు ఉండదు

‘‘జైల్లో ఉన్న వ్యక్తి జైలు నిబంధనల ప్రకారం నడుచుకోవలసి ఉంటుంది. అయితే, జైలులో ఉన్న వ్యక్తి ఆహారం తీసుకోకుండా నిరాహార దీక్ష చేస్తానంటే.. లేదు లేదు తిని తీరాల్సిందేనని బలవంతం చేసే అధికారం జైలు అధికారులకు లేదు. నిరాహార దీక్ష చేయవద్దని, ఆహారం తీసుకోవాలని బలవంతం చేసే అధికారం లేదు. జగన్‌మోహన్‌రెడ్డి జైల్లో చేస్తున్న దీక్ష వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తబోదు. ఆయన దీక్ష కేవలం ఆయనకు మాత్రమే పరిమితం అయి ఉంటుంది. ఆయన దీక్షకు ఇతరులు హాజరుకావటం అనే ప్రశ్న తలెత్తబోదు. కాబట్టి జైల్లో నిరాహార దీక్షకు అధికారులు అడ్డుచెప్పటానికి లేదు.’’    

 -కె.రామకష్ణారెడ్డి హైకోర్టు సీనియర్ న్యాయవాది

 

జైలు అధికారుల పరిధిలో ఈ అంశం ఉండదు

‘‘ములాఖత్ అనేది విచారణలో ఉన్న ఖైదీలకు ఉండే హక్కు. వాటిని తొలగించటం, రద్దుచేయటం వంటివి జైలు అధికారుల పరిధిలో ఉండవు. ఎవరిని కలవాలి? ఎవరిని కలవకూడదు? అనేది విచారణలో ఉన్న వ్యక్తి ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. నిరాహార దీక్ష అంశం జైలు నియమావళిలో లేదు. జగన్‌మోహన్‌రెడ్డి పార్లమెంటు సభ్యుడు, పారిశ్రామిక వేత్త అయినందున ఆయనకు కోర్టు ప్రత్యేక కేటగిరీ కల్పించింది. ప్రత్యేక కేటగిరీ కల్పించటం, రద్దుచేయటం రెండూ జైళ్లశాఖ అధికారుల పరిధిలోనివి కానేకాదు. ఆ విషయాలను న్యాయస్థానం నిర్ణయిస్తుంది. అలాంటప్పుడు ప్రత్యేక కేటగిరీ ర ద్దుకు జైలు అధికారులు ప్రయత్నిస్తారనే ప్రచారం కేవలం అపోహ మాత్రమే.’’

 -మాజీ డీజీపీ ఎంవీ కృష్ణారావు

 

నిరాహార దీక్ష ప్రజాస్వామిక హక్కు

‘‘జగన్ జైల్లో నిరాహార దీక్ష చేపట్టటం ప్రజాస్వామిక హక్కు. తమ అభిప్రాయాలను వ్యక్తంచేసే హక్కు, నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. నిరాహార దీక్ష కారణంగా విచారణ ఖైదీ తన హక్కులను కోల్పోడు. ములాఖత్‌లు రద్దుచేసే అధికారం కూడా ఎవరికీ లేదు.’’    

 -నాగేశ్వరరావు, వైఎస్‌ఆర్ పార్టీ లీగల్‌సెల్ కో ఆర్డినేటర్

 

దీక్షకు... ప్రత్యేక హోదాకు సంబంధంలేదు

‘‘పార్లమెంట్ సభ్యుడు జగన్‌మోహన్‌రెడ్డి జైల్లో నిరాహార దీక్ష చేయటానికి, ఆయన ప్రత్యేక హోదాకు ఎలాంటి సంబంధమూ లేదు. ఆయన ఆమరణ దీక్ష చేసినా జైలు నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండబోవు. ములాఖత్‌లు అనేవి విచారణలో ఉన్న ఖైదీకి చట్టం ద్వారా సంక్రమించిన హక్కులు. ములాఖత్‌లను అడ్డుకునే అధికారం జైలు అధికారులకు ఉండబోదు. నిరాహార దీక్షకు పాల్పడ్డారనే కారణంతో ములాఖత్‌లను రద్దుచేసే అంశం జైలు అధికారుల న్యాయ పరిధిలో ఉండదు.’’

 -ఎస్.రామచంద్రరావు, మాజీ అడ్వొకేట్ జనరల్

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top