టీడీపీని వీడేందుకు ఎమ్మెల్యేలు సిద్ధం | Sakshi
Sakshi News home page

టీడీపీని వీడేందుకు ఎమ్మెల్యేలు సిద్ధం

Published Sat, Nov 1 2014 1:47 AM

టీడీపీని వీడేందుకు ఎమ్మెల్యేలు సిద్ధం - Sakshi

వైఎస్సార్‌సీపీ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి
మేనిఫెస్టోలో 200 హామీలిచ్చారు.. ఒక్కటీ అమలు కాలేదు

 
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘‘ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో టీడీపీ పూర్తిగా విఫలమైంది. రైతు, డ్వాక్రా, చేనేత రుణాల మాఫీతోపాటు 9 గంటల ఉచిత విద్యుత్, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి.. ఇలా మేనిఫెస్టోలో పొందుపరిచిన 200 హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదు.

దీంతో జనం నిలదీస్తుండడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో జనానికి ముఖం చూపించలేక పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే తెలంగాణలో పూర్తిగా ఖాళీ అవుతోంది’’ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం అనంతపురంలో జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ అధ్యక్షతన జిల్లా కమిటీలతో సమావేశం నిర్వహించారు.

విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతం కావాలన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ‘అనంత’ రైతుల శ్రేయస్సును చంద్రబాబు పూర్తిగా విస్మరించారని ఆయన విమర్శించారు. అనంతపురానికి సాగునీటి వనరుల కల్పనలోనూ పూర్తిగా నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారన్నారు. ‘‘రుణమాఫీ చేయకపోవడంతో రైతులు పంటల బీమా ప్రీమియాన్ని చెల్లించలేకపోయారు. ఉత్తరాంధ్రలో హుద్‌హుద్ తుపానుతో 4 లక్షల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. ప్రీమియం చెల్లించి ఉంటే ఒక్కొక్క రైతుకు రూ.23 వేలు చొప్పున పరిహారం వచ్చేది. బాబు పుణ్యంతో చిల్లిగవ్వ కూడా రాని పరిస్థితి తలెత్తింది’’ ’’ అని విమర్శించారు.

చంద్రబాబు నిర్వాకంతో రాష్ట్రంలో డ్వాక్రా మహిళల పరిస్థితి తలకిందులైందన్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన పావలావడ్డీ, వడ్డీలేని రుణాలతోపాటు కేంద్రమిచ్చే ఏడుశాతం వడ్డీ కూడా పోయిందని, ఇప్పుడు 14 శాతం వడ్డీని చెల్లించాల్సి వస్తోందన్నారు. డ్వాక్రా రుణాలు నాలుగేళ్లల్లో 20 శాతం చొప్పున చెల్లిస్తామని బాబు అంటున్నారని, అంటే అప్పటివరకు రుణగ్రస్తులుగానే వారిని ఉంచుతారా? అని ప్రశ్నించారు. చరిత్రలో హామీల్ని నిలబెట్టుకున్న ఘనత ఎన్టీఆర్, వైఎస్‌లకు మాత్రమే దక్కుతుందన్నారు. రుణమాఫీ చేయని బాబుపై నవంబర్ 5న ప్రజలంతా దండయాత్ర చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement