ఐసీడీఎస్ ‘హైర్’ బాడుగకు బ్రేక్‌లు | Sakshi
Sakshi News home page

ఐసీడీఎస్ ‘హైర్’ బాడుగకు బ్రేక్‌లు

Published Wed, Sep 17 2014 2:54 AM

vehicles cash dropping to 13 projects

ఒంగోలు టౌన్: ఐసీడీఎస్ ప్రాజెక్టులకు చెందిన హైర్ వాహనాలకు బ్రేక్‌లు పడ్డాయి. ఆర్థికశాఖ అనుమతి లేకపోవడంతో ఆ వాహనాలకు సంబంధించిన నగదు చెల్లింపులు నిలిచిపోయాయి. కొన్ని ప్రాజెక్టులకు 8నెలల నుంచి, మరికొన్ని ప్రాజెక్టులకు 6 నెలల నుంచి వాహన బాడుగ అద్దెలు రాకపోవడంతో సంబంధిత సీడీపీవోలు తలలు పట్టుకుంటున్నారు.

జిల్లాలో 21 ఐసీడీఎస్ ప్రాజెక్టులుండగా, చీరాల, పర్చూరు,  కొండపి, కందుకూరు, సంతమాగులూరు, కొరిశపాడు, మద్దిపాడు, తాళ్లూరు, వెలిగండ్ల, మార్కాపురం అర్బన్, బేస్తవారపేట, ఒంగోలు అర్బన్, పొదిలి ప్రాజెక్టులకు చెందిన సీడీపీవోలు హైర్ వాహనాలను వినియోగిస్తున్నారు. ప్రతి హైర్ వాహనానికి నెలకు రూ.24 వేల చొప్పున ప్రభుత్వం బాడుగ రూపంలో చెల్లిస్తుంది.  నెలరోజుల వ్యవధిలో 2500 కిలోమీటర్లు హైర్ వాహనం తిరగాలి. సీడీపీవోలు ప్రతినెలా ఠంచనుగా బిల్లులు పెడుతూనే ఉన్నారు.

ఏ నెలకు ఆ నెల నగదు కోసం ఆశగా ఎదురు చూడటం, ఉసూరుమంటూ మరుసటినెల కోసం కళ్లు కాయలు కాచేలా చూడటం పరిపాటిగా మారింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైర్ వాహనాల నగదు బిల్లులు నిలిచిపోయాయని కొంతమంది సీడీపీవోలు అనుకుంటూ వచ్చారు. అయితే మిగిలిన ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారుల హైర్ వాహనాల బిల్లులు చెల్లింపులు జరుగుతుండటం గమనార్హం.

 అంతా అడ్డగోలే...
 సీడీపీవోలు హైర్ వాహనాల బిల్లులు అడ్డగోలుగా పెట్టడం వల్లే ఆర్థికశాఖ నగదు చెల్లింపులు నిలిపివేసినట్లు తెలుస్తోంది. సీడీపీవోలు వారు పనిచేసే ప్రాంతాల్లో ఉండకుండా జిల్లా కేంద్రంలో, డివిజన్ కేంద్రాల్లో ఉంటున్నారు. వాహనాలకు సంబంధించిన లాగ్ బుక్‌లు, డైరీలు సక్రమంగా రాయడం లేదు. ఏ రోజు ఏ సెక్టార్‌కు వెళ్లారు, ఐసీడీఎస్ ప్రాజెక్టు నుంచి అక్కడకు ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి, ఆ తరువాత ఎన్ని కిలోమీటర్లు తిరిగారు అన్న వివరాలు డైరీలో సమగ్రంగా ఉండటం లేదు. కొంతమంది సీడీపీవోలు రాస్తున్న కాకి లెక్కలను ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పసిగట్టారు. మొక్కుబడిగా విధులు నిర్వర్తించి ప్రభుత్వం నిర్దేశించిన విధంగా పూర్తి మొత్తంలో హైర్ వాహనాల నగదు అప్పనంగా ఆరగిస్తున్నారన్న ఆరోపణలు కూడా రావడంతో సీడీపీవోల హైర్ బిల్లులకు ఆర్థికశాఖ బ్రేక్‌లు వేసినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement