హామీలను నెరవేర్చడంలో టీడీపీ విఫలం | Sakshi
Sakshi News home page

హామీలను నెరవేర్చడంలో టీడీపీ విఫలం

Published Mon, Aug 31 2015 12:33 AM

హామీలను నెరవేర్చడంలో టీడీపీ విఫలం - Sakshi

 గుంటూరు వెస్ట్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తీసుకొస్తామని ఎన్నికల్లో హామీలిచ్చిన టీడీపీ నాయకులు ఆ హామీలు నెరవేర్చడంలో వైఫల్యం చెందారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తాము కోరుతుంటే, తమ పార్టీ నాయకులపై విమర్శలు గుప్పించడం సరికాదన్నారు. రాష్ట్రానికి హోదా తెచ్చే విషయంలో తమ పార్టీ శాయశక్తులా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. అరండల్‌పేటలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తిన విషయాన్ని గుర్తు చేశారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీని ప్రశ్నించడంలేదంటూ తమ అధినేత జగన్‌పై టీడీపీ నాయకులు అభాండాలు మోపడం సరికాదన్నారు. చంద్రబాబు కేసులకు భయపడే ప్రత్యేక హోదా విషయంలో నరేంద్రమోడీని నిలదీయలేకపోతున్నారని విమర్శించారు. టీడీపీ నాయకులు ఈ రాష్ట్రాన్ని బీజేపీ నేతలకు తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పుల్లారావు, టీడీపీ ఎమ్మెల్యేలు దోచుకోవడం.. దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. సీసీఐ కుంభకోణంలో సీబీఐని అడ్డుకుంటున్న మంత్రి పుల్లారావు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ తమ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌ను విజయవంతం చేసిన ప్రజలకు, సహకరించిన వామపక్షాలు, ఎమ్మార్పీఎస్, వాణిజ్యరంగాల వారికి రాజశేఖర్ ధన్యవాదాలు తెలిపారు.

 ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే ఊరుకోబోం..
 పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 30 వంచనకు, విద్రోహానికి గురైన రోజుగా రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ గుర్తుంచుకుంటారన్నారు. మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఈ రాష్ర్ట రైతులకు, మహిళలకు, కార్మికులకు వ్యతిరేకంగా పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో తాము చేస్తున్న ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే రాష్ర్ట ప్రజలు చూస్తూ ఊరుకోరని ఆయన హెచ్చరించారు.

 రాజకీయ జ్ఞానంలేని రావెల..
 రాజకీయ జ్ఞానంలేని మంత్రి రావెల కిశోర్‌బాబు తమ పార్టీ అధినేతపై అవగాహనారాహిత్యంగా మాట్లాడటం, అసత్యప్రచారం చేయడం సబబుకాదని ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున పేర్కొన్నారు. రిషితేశ్వరి కేసులో నిందితుడైన ప్రిన్సిపాల్ బాబూరావును టీడీపీ ప్రభుత్వం కాపాడుతోందన్నారు. ప్రత్యేక హోదా, భూసేకరణ తదితర అంశాల్లో ప్రభుత్వం అబద్ధాలు ఆడుతోందని ఆయన విమర్శించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు కె.చిన్నప్పరెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మొగిలి మధు, వివిధ విభాగాల నాయకులు ఆవుల సుందర్‌రెడ్డి, శ్రీకాంత్‌యాదవ్, ఉప్పుటూరి నర్సిరెడ్డి, యాజలి జోజిబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement