పెద్దన్నయ్య మనసు నిజంగా వెన్నే! | Sakshi
Sakshi News home page

పెద్దన్నయ్య మనసు నిజంగా వెన్నే!

Published Sat, Aug 23 2014 1:53 PM

పెద్దన్నయ్య మనసు నిజంగా వెన్నే! - Sakshi

అందరి మీద పెత్తనం చెలాయించే పెద్దన్నయ్య మనసు నిజంగా వెన్నే... పెద్దన్నయ్య అంటే అర్థం కాలేదా... అదేనండి అగ్రరాజ్యం అమెరికా. అవకాశాన్ని బట్టి ఎప్పడు ఎలా కావాలంటే అలా తన వైఖరీని మార్చుకోవడంలో ప్రపంచంలో మరే దేశం అమెరికాకు సాటిరాదేమో. ఎలా అంటే ఉసరవెల్లి కూడా చిన్నబోయేలా ఆ దేశం వ్యవహరిస్తుంది. ఎందుకంటే .... సెప్టెంబర్ మాసం ఎప్పుడు వస్తుందా... భారత ప్రధాని నరేంద్ర మోడీ తమ దేశంలో ఎప్పుడు పర్యటిస్తాడా... ఆయనతో ఎప్పడు భేటీ అవుతామా అని అమెరికా అధ్యక్షుడు ఒబామాతోపాటు ఆ దేశ ఉన్నతాధికారులు అతృతగా ఎదురు చూస్తున్నారు.

గోద్రా అల్లర్లు నేపథ్యంలో మోడీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యాన్ని సాకుగా చూపి మోడీకి వీసా నిరాకరిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. గుజరాత్ సీఎంగా ఉన్నన్నాళ్లు మోడీకి వీసా జారీపై తమ వైఖరీలో ఎటువంటి మార్పు లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. గత ఏడాది సెప్టెంబర్లో తమ పార్టీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని బీజేపీ ప్రకటించింది. అప్పుడు కూడా తమ వైఖరీలో మార్పు లేదని స్పష్టం చేసింది. అయితే దేశంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కమలం పార్టీ సొంతంగా 282 సీట్లు గెలుచుకుని విజయఢంకా మోగించింది.

దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టడంతో పెద్దన్నయ్య మనసు వెన్నలా కరిగింది. మోడీ తమ దేశంలో ఎప్పుడు పర్యటిస్తారా అంటూ ఆ దేశాధ్యక్షుడు ఒబామాతోపాటు ఆదేశ నేతలు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. మోడీ సెప్టెంబర్లో అమెరికా పర్యటించనున్నారని వార్త తెలియడంతో వారంతా ఎగిరి గంతేశారు. అమెరికాలో మోడీ పర్యటించే రోజు కోసం వారంతా ఎంతో తహతహలాడుతున్నారని ఒబామా ప్రభుత్వంలోని ఉన్నతాధికారి ఇప్పటికే వెల్లడించారు. ఏది ఏమైనా మోడీ దేశప్రధాని పదవి చేపట్టే సరికి పెద్దన్నయ్య తన వైఖరీని మార్చుకోవాల్సి వచ్చింది.

Advertisement
Advertisement