ప్రజాస్వామ్యాన్ని కాపాడండి: వైఎస్ జగన్



  • టీడీపీ అరాచకాలపై రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రికి జగన్ ఫిర్యాదు

  •   ఏపీలో ఎన్నికల తర్వాత దారుణమైన పాలన సాగుతోంది

  •   17 మంది వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలను హతమార్చారు

  •   తక్షణం జోక్యం చేసుకోండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి 

  •   నేడు ప్రధాని, కేంద్ర మంత్రులతో భేటీ కానున్న వై.ఎస్. జగన్ 

  •  స్వయంగా సీఎం స్థాయి వ్యక్తే ప్రలోభపెడుతున్నారు

  •  అధికార పార్టీ అరాచకాలతో ప్రజాస్వామ్యం ఖూనీడండి

  •  పార్టీ ఎంపీల బృందంతో కలసి ఇరువురితో విడివిడిగా భేటీలు

  •  ప్రణబ్, రాజ్‌నాథ్‌లకు జగన్‌మోహన్‌రెడ్డి వినతులు

  •  మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం: జగన్


 


 నేడు ప్రధాని, కేంద్ర మంత్రులతో జగన్ భేటీ 


 వైఎస్సార్  సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌లను కలుసుకోనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు, సమస్యలపై వారికి వినతిపత్రం సమర్పించడంతో పాటుగా కొత్త రాష్ట్రం పురోభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలందించాలని కోరతారు.


 


 రాష్ట్రపతికిచ్చిన  వినతిపత్రంలో ముఖ్యాంశాలు

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలిచినట్టు మే 16న ఎన్నికల సంఘం ప్రకటించినప్పటి నుంచి రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి.

  •   టీడీపీ నాయకులు రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతూ దాడులు చేస్తున్నారు.

  •   పోలీసులు సైతం వీరి దురాగతాలపై కేసులు నమోదు చేయలేని పరిస్థితి ఉంది.

  •   వీటన్నింటినీ ముఖ్యమంత్రే పోత్సహిస్తున్నారు.

  •   ఎన్నికల ఫలితాలు వచ్చిన ఎనిమిది రోజుల్లోనే వైఎస్సార్‌సీపీకి అధికారిక గుర్తింపులేదని చెబుతూ ఓ ఎంపీని వాళ్ల పార్టీలోకి చేర్చుకున్నారు. మరికొందరినీ ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు.

  •   ఐదేళ్లు స్పీకర్‌గా పనిచేసిన టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు అధికారిక గుర్తింపు లేకపోతే అనర్హత వేటు పడదంటూ ప్రచారం చేశారు.

  •   టీడీపీ అరాచకాలు చూస్తుంటే ఇటీవల వాయిదా పడిన ఎన్నికల్లోనూ న్యాయం జరుగుతుందనే నమ్మకం లేకుండా పోరుుంది. 

  •   ఇదే పరిస్థితి ఉంటే ఆళ్లగడ్డ, నంద్యాల ఉప ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో ముందే ఉహించగలం.

  •   టీడీపీ ప్రభుత్వ వైఖరి చూసి వైఎస్సార్‌సీపీ శ్రేణులు భయభ్రాంతులకు గురవుతున్నాయి.

  •   ఇలాంటి చర్యలన్నిటినీ వెంటనే నిలిపివేయాలని సూచిస్తూ కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు పంపేలా మీరు సూచించండి.

 

 రాజ్‌నాథ్‌కు వినతి..

  •  కేంద్ర హోంశాఖ మంత్రిగా మీరు కూడా ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాన్ని టీడీపీ ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేయకుండా చర్యలు తీసుకోండి.

 

 సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన పార్టీ ఎంపీలతో కలసి గురువారం సాయంత్రం రాష్ట్రపతికి, కేంద్ర హోంమంత్రికి వినతిపత్రాలు సమర్పించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతూ హత్యలు చేస్తున్నారని వారి దృష్టికి తెచ్చారు. వీటన్నింటినీ ఖండించాల్సిన ముఖ్యమంత్రే దిగజారుడు రాజకీయాలతో స్వయంగా తానే ప్రలోభాలకు గురిచేస్తున్న పరిస్థితి ఉందని వారికి నివేదించారు. గురువారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డి సాయంత్రం పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, వై.ఎస్.అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వరప్రసాద్‌రావు, కొత్తపల్లి గీత, బుట్టా రేణుకలతో కలసి రాష్ట్రపతి భవన్ కు వెళ్లారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో అరగంటకు పైగా భేటీ అయ్యారు. అనంతరం పార్టీ ఎంపీల బృందంతో జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా అశోక రోడ్డులోని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ నివాసానికి వెళ్లారు. 15 నిమిషాలకు పైగా ఆయనతో భేటీ అయ్యా రు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఏవిధంగా ఖూనీ చేస్తున్నారో వివరించి, వినతిపత్రం సమర్పించారు. తొలుత రాష్ట్రపతి భవన్ వద్ద, అనంతరం రాజ్‌నాథ్ నివాసం వద్ద జగన్ మీడియాతో మాట్లాడారు. 

 

 ఏపీలో దారుణ పాలనపై వివరించాం

 ‘‘ఏపీలో ఎన్నికల తర్వాత ఎటువంటి దారుణమైన పాలన సాగుతోందో రాష్ట్రపతిని కలసి వివరించాం. ఎన్నికల తర్వాత దాదాపు 17 మంది వైసీపీ కార్యకర్తలు హత్యకాబడ్డారు, 110 మంది కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. బాధాకరమైన విషయమేమిటంటే.. ఈ దాడుల్లో చనిపోయిన, గాయపడిన, నష్టపోయినవారు 50 శాతంపైగా ఎస్సీలు, మహిళలే. ఇలాం టి దారుణ పాలన ఏపీలో జరుగుతుండగా.. ఈ నెల 3, 4, 5 తేదీల్లో ఎంపీపీ చైర్మన్లు, మునిపల్ చైర్మన్ల ఎన్నికలు, జెడ్‌పీ చైర్మన్ల ఎన్నికల్లో ఎటువంటి దారుణాలు జరిగాయో సవివరంగా రాష్ట్రపతికి నివేదించాం. చివరకు ఎంపీటీసీలను, జెడ్‌పీటీసీలను, కౌన్సిలర్లను సైతం ఏవిధంగా కిడ్నాప్ చేశారో, భయపెట్టారో, ప్రలోభపెట్టారో ప్రెసిడెంట్‌కి చెప్పాం. 

 

 సీఎం స్థాయి వ్యక్తే ప్రలోభపెడుతున్నారు

 ప్రజాస్వామ్యంలో వేరొక పార్టీ గుర్తుపై ఎన్నికలు జరిగినప్పుడు సీఎం స్థాయి వ్యక్తి ఏకంగా ఫోన్‌లో జెడ్‌పీటీసీలతో మాట్లాడి ప్రలోభపెడుతుంటే.. మరోవైపు మంత్రులు జెడ్‌పీటీసీలను ఎత్తుకుని వెళ్లడం, బెదిరింపులకు పాల్పడటం చేస్తావుంటే.. మా బాధ ఎక్కడికి వెళ్లి చెప్పుకోవాలో అర్థంకావట్లేదు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్‌ను కలిశాం. గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. ఇప్పుడు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశాం. ఈ దారుణ పాలన గురించి నిజంగా చాలా చాలా బాధతో రాష్ట్రపతికి వివరించాం. కనీసం ఇప్పటికైనా స్పందన వస్తుందని, కదలిక వస్తుందని ఆశిస్తున్నాం’’ అని జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రపతి అన్ని అంశాలను సానుకూలంగా విన్నారని ఆయన చెప్పారు. ‘‘కేంద్ర హోంమంత్రికి మీరు చెప్పండి.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి గట్టిగా సిఫారసు చేయండని కోరాం. ఆయన చేస్తారని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. 

 

 కేంద్ర హోంమంత్రి మంచి చేస్తారని ఆశిస్తున్నాం

 రాష్ట్రపతికి చేసిన ఫిర్యాదులకు సంబంధించి ఆధారాలున్నాయా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘ఈ అంశాలన్నీ మీడియాలో వస్తూనే ఉన్నాయి. వాటి పేపర్ కటింగ్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ఈ వార్తలు వచ్చాయి’’ అని గుర్తుచేశారు. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ఇంకా దేశంలో పార్టీ గుర్తులపై ఎన్నికలెందుకని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నవాళ్లే చైర్మన్లను ఎంపికచేసేలా బిల్లు పాస్ చేయించుకుంటే సరిపోతుంది కదా అని విమర్శించారు. ప్రజాస్వామ్యంపై, ప్రజాతీర్పుపై గౌరవం లేనప్పుడు ఎన్నికలు నిర్వహించడం ఎందుకని జగన్ మండిపడ్డారు. రాష్ట్రపతికి వివరించిన అంశాలన్నిటినీ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కూ వివరించా మని తెలిపారు. హోంమంత్రి మంచి చేస్తారన్న నమ్మకం ఉందని, మంచి జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top