
'ధర్మపోరాటంలో అంతిమ విజయం మనదే'
పార్టీ శ్రేణుల్లో మనోధైర్యం నింపడమే సమీక్షల ఉద్దేశమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
గుంటూరు : పార్టీ శ్రేణుల్లో మనోధైర్యం నింపడమే సమీక్షల ఉద్దేశమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం రెండోరోజు సమీక్ష సమావేశాలను ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా సరిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. సూచనలు, సలహాలు పార్టీకి ఎంతో అవసరమని వైఎస్ జగన్ అన్నారు. ధర్మపోరాటంలో అంతిమ విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనన్నారు.
'చంద్రబాబులా అబద్ధం చెప్పి ఉంటే అధికారం మనదే ...నేను కూడా ఆయనలా సాధ్యం కాని హామీలిచ్చి ఉంటే..మీరంతా ఇప్పుడు నన్ను ప్రశ్నించేవారని' వైఎస్ జగన్ అన్నారు. అబద్దాలు, మోసం చేసి సీఎం పదవి చేపట్టి ఉంటే అయిదేళ్లకే ప్రజలు ఇంటికి పంపేవారన్నారు. ఎన్నికలకు ముందు బాబు వస్తున్నాడు...జాబు వస్తుందన్నారు. ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇదే అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తే బాబు నోరు మెదపలేదని ఆయన అన్నారు. మనం నిత్యం ప్రజల్లోనే ఉందాం... ప్రజా సమస్యలపై ముందుండి పోరాడదాం, బాబు మోసాలను ప్రశ్నిద్దాం... ప్రజల్లోకి వెళ్లి నిలదీద్దామని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ సూచించారు. టీడీపీ ప్రభుత్వం ప్రజల ఆక్రోశాన్ని త్వరలోనే చవి చూస్తుందని ఆయన అన్నారు.