క్రీడలతోనే ప్రత్యేక గుర్తింపు | Sakshi
Sakshi News home page

క్రీడలతోనే ప్రత్యేక గుర్తింపు

Published Wed, Nov 5 2014 2:24 AM

Kridalatone special recognition

అనంతపురం స్పోర్ట్స్ : క్రీడల్లో రాణించడం ద్వారా సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని జేఎన్‌టీయూ వైస్ ఛాన్సలర్ లాల్‌కిషోర్ అన్నారు. అనంత క్రీడాగ్రామంలో మంగళవారం మొదటి రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ జూడో చాంపియన్‌షిప్ పోటీల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. క్రీడలు దేశ ప్రతిష్టను ఇనుమడింపజేస్తాయన్నారు. దేశ జనాభాతో పోల్చితే క్రీడల్లో పాల్గొనే వారి సంఖ్య చాలా తక్కువన్నారు.

చదువుతో పాటు క్రీడలకు సమప్రాధాన్యత కల్పించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఆర్డీటీ చైర్మన్ తిప్పేస్వామి మాట్లాడుతూ క్రీడల్లో ‘అనంత’ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోందన్నారు. ఏ పోటీలు జరిగినా అందులో మన జిల్లా మంచి ప్రతిభను చూపుతోందన్నారు. జూడో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఇందులో 13 జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని వెల్లడించారు. అనంతరం మ్యాచ్‌లను వీసీ, ఆర్డీటీ చైర్మన్ ప్రారంభించారు.  కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి (డీఎస్‌డీఓ) శ్రీనివాస్ కుమార్, ఒలింపిక్ అసోసియేషన్ పరిశీలకుడు మచ్చా రామలింగారెడ్డి, జూడో సంఘం రాష్ట్ర కార్యదర్శి కేఎన్ బాబు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement