దండయాత్ర | Sakshi
Sakshi News home page

దండయాత్ర

Published Fri, Aug 1 2014 2:12 AM

దండయాత్ర - Sakshi

ఎర్రగుంట్ల: ప్రభుత్వమేమో డ్వాక్రా రుణాలు రద్దు చేస్తున్నామని ప్రకటించింది. దీనిపై పూర్తి మార్గదర్శకాలు ఇంకా విడుదల చేయలేదు. అధికారులేమో తాళిబొట్లు తాకట్టు పెట్టయినా సరే బ్యాంకులకు రుణాలు చెల్లించాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నారు. మమ్మల్ని ఇలా వేధిస్తే ఎలా అంటూ నిడుజివ్వి గ్రామానికి చెందిన వందలాది డ్వాక్రా మహిళలు గురువారం ఎర్రగుంట్ల మండలం చిలంకూరులోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకును ముట్టడించి, ధర్నా చేపట్టారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు డాక్టర్ సుధీర్‌రెడ్డి వీరికి అండగా నిలిచారు. వివరాల్లోకెళితే..
 నిడుజివ్వి గ్రామంలో 26 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి.
 
 ఈ సంఘాలకు మండల సమాఖ్య సీసీగా గురివిరెడ్డి, యానిమేటర్‌గా పద్మ కొనసాగుతున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు డ్వాక్రా రుణలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో మహిళలు గత నాలుగా నెలలుగా పొదుపు సంఘాలకు చెందిన రుణాలు చెల్లించలేదు. అయితే సీసీ గురివిరెడ్డి బుధవారం రాత్రి గ్రామానికి వచ్చి బ్యాంకు రుణాలు కచ్చితంగా చెల్లించాలని, ఈ నెల 31లోగా చెల్లిస్తేనే వడ్డీ మాఫీ అవుతుందని ఒత్తిడి చేసినట్టు మహిళలు తెలిపారు. లేక పోతే బ్యాంకు నుంచి నోటీసులు వస్తాయని హెచ్చరించారు.
 
 ఈ విషయాన్ని వారు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు, ఎంపీపీ కుమారుడు డాక్టర్ సుధీర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన 26 గ్రూపులకు చెందిన మహిళలతో కలిసి చిలంకూరులోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు. టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించిందని. మీరెందుకు మహిళలను ఒత్తిడి చేస్తున్నారని బ్యాంకు ఇన్‌చార్జి మేనేజర్ రామన్నను సుధీర్‌రెడ్డి ప్రశ్నించారు. తాము రుణాలు కట్టమని మహిళలను ఒత్తిడి చేయలేదని వారు కట్టకుంటే వడ్డీలు పెరుగుతాయని బ్యాంకు మేనేజర్ అన్నారు. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు ప్రభుత్వంతో సంబంధం లేకుండా నిదానంగా కట్టుకోవాలని మహిళలకు ఆయన సూచించారు.  
 
 నగలు కుదువ పెట్టి డబ్బులు చెల్లించమని సీసీ ఒత్తిడి
 మండల సమాఖ్య సీసీ గురివిరెడ్డి మాత్రం ఈనెల 31లోగా కచ్చితంగా రుణాలు కట్టాలని ఒత్తిడి చే స్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రుణాలు తీసుకునే సమయంలో, పాసుబుక్‌లు రాసేటప్పుడు యానిమేటర్ డబ్బులు తీసుకుంటుందని మహిళలు ఆరోపించారు. వెలుగు సంఘంలోని అధికారులు నానా ఇబ్బందులు పెడుతున్నారని మహిళలు వాపోయారు. రుణాలు కట్టకుంటే ఊరివేసుకోండని చెబుతున్నారని మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారు. తాళిబొట్లు, ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలు కుదవ పెట్టి రుణాలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని వారు ఆవేదనతో చెప్పారు.
 
 నే ను డబ్బులు  తీసుకోలేదు..
 పాసుబుక్‌లు రాసేటప్పుడు, రుణాలు ఇప్పించే సమయంలో గ్రూపు సభ్యులు ఇస్తేనే డబ్బులు తీసుకుంటాను. ఒత్తిడి చే యలేదు.
 - పద్మ (యానిమేటర్,  నిడుజివ్వి)
 
 రుణాలు కట్టమని తీవ్రంగా ఒత్తిడి
 చేస్తున్నారు.
 ప్రభుత్వం రుణ మాఫీ చేయడంలో నిర్లక్ష్యం చేస్తోంది. ఈ సమయంలో వెలుగు సంఘం వారు, బ్యాంకు అధికారులు రుణాలు కట్టమని ఒత్తిడి చేస్తున్నారు. కుటుంబాలు గడవక ఇబ్బందులు పడుతున్న సమయంలో వీరి ఒత్తిడితో అల్లాడుతున్నాం.
 - ఫాతిమా (గండిఆంజనేయ గ్రూపు, నిడుజివ్వి)
 
 మాట మార్చిన ప్రభుత్వం
 డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వస్తూనే మాట మార్చారు. అయినా ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అటు బ్యాంకర్లు, ఇటు వెలుగు సంఘం వారు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు.  ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలి.
 - హుస్సేన్‌బీ, వెంకటలక్షుమ్మ, నిడుజివ్వి)
 
 తాళిబొట్లు కుదువ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
 ప్రభుత్వం మాట మార్చడంతో బంగారు ఆభరణాలతో పాటు తాళిబొట్లు కుదవ పెట్టి రుణాలు చెల్సించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుని ఆదుకోవాలి.
 -నాగసుబ్బమ్మ(నారాయణ స్వామి గ్రూపు)
 

Advertisement
Advertisement