గంటలోనే గమ్యానికి | Sakshi
Sakshi News home page

గంటలోనే గమ్యానికి

Published Thu, May 28 2015 1:46 AM

Hour destination

రూ. 550 కోట్లతో రాజధాని రహదార్లకు ప్రణాళిక
 
హైదరాబాద్: నవ్యాంధ్ర రాజధానిలో ప్రయాణం శరవేగంగా సాగనుంది. ఎక్కడినుంచి ఎక్కడికైనా గంటలోనే చేరుకునేలా రహదార్లను నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనల్ని అధికార యంత్రాంగం రూపొందిస్తోంది. సింగపూర్ మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా రాజధాని రోడ్ కనెక్టివిటీ ఉండేలా ప్రణాళికల్ని రూపొందిస్తున్నారు. సీఆర్‌డీఏ పరిధిలోని 7,208 చ.కి.మీలలో ఎక్స్‌ప్రెస్, సెమీ ఎక్స్‌ప్రెస్, ఆర్టీరియల్, సబ్ ఆర్టీరియల్ రహదార్లకు సింగపూర్ ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్ రూపొందించింది. దీన్నిబట్టి ప్రాథమికంగా ఏయే రహదార్ల్లు ఎక్కడ ఉండాలనేదానిపై అధికారులు ఓ నిర్ణయానికొచ్చారు.

ఎక్స్‌ప్రెస్, సెమీఎక్స్‌ప్రెస్ కాకుండా మిగిలిన రోడ్లను రూ.550 కోట్లతో నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. మొత్తం 869 కి.మీ మేర 115 రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు తయారుచేశారు. ఎక్స్‌ప్రెస్, సెమీ ఎక్స్‌ప్రెస్ రహదారుల్ని ఎన్.హెచ్.9, 5, 221లతో అనుసంధానిస్తారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో రెండు వేల కి.మీ రహదారుల్ని అభివృద్ధి చేస్తారు. ఈ మేరకు బడ్జెట్‌లో కేటాయింపులు జరిపారు. మొత్తం రూ.3 వేల కోట్ల వరకు నిధులు బడ్జెట్‌లో కేటాయించారు. రాజధాని ప్రాంతంలోనే 1,000 కి.మీ మేర పీపీపీ విధానంలో రహదార్లను నిర్మించాలంటూ అధికారులకు ఆదేశాలందాయి.
 

Advertisement
Advertisement