బాబు గుప్పెట్లో..! | Sakshi
Sakshi News home page

బాబు గుప్పెట్లో..!

Published Wed, Nov 19 2014 1:18 AM

బాబు గుప్పెట్లో..! - Sakshi

 ఏపీ సీఎం నేతృత్వంలో సీఆర్‌డీఏ ఏర్పాటు
 రాజధాని ప్రాంతంలో అనుమతులు సహా
 అన్ని అంశాలూ ఈ అథారిటీ పరిధిలోకే...

 
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన అన్ని వ్యవహారాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఏర్పాటు కానున్న రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్‌డీఏ) పరిధిలోకి తీసుకురావాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాజధాని పరిధిలోని స్థానిక సంస్థల విధులకు భంగం కలగదంటూనే.. అన్ని రకాల అనుమతులు మంజూరు చేసే అధికారాన్నీ అథారిటీకే కట్టబెట్టనున్నారు. రాజధాని కోసం చేపట్టనున్న ‘భూ సమీకరణ’కు చట్టబద్ధత కల్పించడానికి వీలుగా ఒక చట్టం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు రూపొందించిన ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాథికార సంస్థ బిల్లు - 2014కు మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర వేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం హైదరబాద్‌లోని సచివాలయంలో సమావేశమైంది. ఐదున్నర గంటలకుపైగా సాగిన ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆ తర్వాత మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలివీ...
 
 - ‘ఆంధ్రప్రదేశ్ కేపిటల్ రీజియన్ డెవలెప్‌మెంట్ అథారిటీ బిల్ - 2014 (ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాథికార సంస్థ బిల్లు - 2014)’కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆర్డినెన్స్ లేదా చట్టం రూపంలో దీన్ని తీసుకురావాలని నిర్ణయించారు. బిల్లు అమల్లోకి వస్తే.. ‘భూ సమీకరణ’కు చట్టబద్ధత రావడంతో పాటు కేపిటల్ రీజియన్ డెవలెప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ) ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. ఈ అథారిటీకి చైర్మన్‌గా ముఖ్యమంత్రి వ్యవహరించనున్నారు. మరో 22 మంది సభ్యులు ఉంటారు. దీనికి అనుబంధంగా కార్యనిర్వహక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలో 30 మంది సభ్యులుంటారు. సీఆర్‌డీఏకు కమిషనర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమిస్తారు. కమిటీకి సీఆర్‌డీఏ కమిషనర్ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు.
 - రాజధాని, రాజధాని ప్రాంతాన్ని (కేపిటల్ రీజియన్‌ను) సీఆర్‌డీఏ నోటిఫై చేస్తుంది. రాజధాని మాస్టర్ ప్లాన్, అభివృద్ధి ప్రణాళికలను తయారు చేస్తుంది. రాజధాని నిర్మాణాన్ని నేరుగా పర్యవేక్షస్తుంది. మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత తీసుకుంటుంది. అన్ని రకాల అనుమతులు మంజూరు చేసే అధికారం కూడా సీఆర్‌డీఏకు ఉంటుంది. సీఆర్‌డీఏ పరిధిలోని స్థానిక సంస్థల విధులకు భంగం కలగదు.
 - పేదల ఆరోగ్య బీమా పథకమైన రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరును ‘ఎన్‌టీఆర్ వైద్య సేవ’గా మార్చాలని నిర్ణయించారు. ఒక్కో కుటుంబానికి గరిష్ట చికిత్స వ్యయ పరిమితి (కవరేజీ)ని రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచారు. ఆరోగ్యశ్రీ కింద ఇప్పటి వరకు 938 రకాల వ్యాధులకు చికిత్స అందించారు. ఇక మీదట 1,038 రకాల వ్యాధులకు చికిత్స అందించాలని నిర్ణయించారు.
 - ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు పెంపొందించాలని, ఎన్‌టీఆర్ వైద్య సేవను ప్రభుత్వాసుపత్రుల్లోనూ అమలు చేయాలి నిర్ణయం తీసుకున్నారు. నిపుణులైన వైద్యులు లేకుంటే, ప్రయివేటు వైద్యులను ప్రభుత్వాసుపత్రులకు పిలిపించి వైద్యం చేయించాలని నిర్ణయించారు.
 - అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం సజ్జలదిన్నె గ్రామంలో.. జెడ్‌ఆర్ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్, నెడ్‌క్యాప్ సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న పవన విద్యుత్ ప్రాజెక్టుకు 35 ఎకరాలను 33 సంవత్సరాలకు లీజుకు ఇవ్వాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. లీజు ఏటా రూ. 20 వేలు చెల్లించాలని నిర్ణయించారు.
 - వైఎస్‌ఆర్ జిల్లా మంగంపేట బెరైటీస్ మైనింగ్‌లో అక్రమాలు అరికట్టడానికి వీలుగా గ్లోబల్ ఫ్లోటింగ్ టెండర్లు పిలవాలని నిర్ణయించారు. మంగంపేటలో 250 హెక్టార్లలో బెరైటీస్ ఖనిజం ఉంది. దేశంలో దొరికే బెరైటీస్‌లో 95 శాతం మంగంపేటలోనే లభిస్తుంది. ఇక్కడ రూ. 50 వేల కోట్ల విలువైన 50 మిలియన్ మెట్రిక్ టన్నుల బెరైటీస్ ఉందని అంచనా. 2004 నుంచి 2014 వరకు బెరైటీస్ మైనింగ్‌లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. అవినీతిపై ఏర్పాటయిన మంత్రివర్గ ఉపసంఘానికి విచారణ బాధ్యత అప్పగించనున్నారు.
 - ఏటా 5 శాతం కంటే ఖనిజం ధర పెంచకూడదంటూ 2004లో జారీ అయిన జీవో 296 ను రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. బెరైటీస్ ఎ-గ్రేడ్ ఖనిజాన్ని మంగంపేటలో ప్రభుత్వం టన్ను రూ. 4,475 ధరకు విక్రయిస్తుండగా, చెన్నైలో దానికి రూ. 9,112 ధర పలుకుతోంది. రవాణా ఖర్చులు పోనూ టన్ను మీద రూ. 4,300 వరకు లాభం ఉంటోంది. అక్రమ మైనింగ్ కూడా జరుగుతోంది. ఫలితంగా ప్రభుత్వ రాబడికి గండిపడుతోంది. అక్రమ మైనింగ్‌ను అరికట్టడానికి వీలుగా బెరైటీస్ లభించే ప్రాంతం చుట్టూ రక్షణ గోడ నిర్మించాలని నిర్ణయించారు.
 - మైనింగ్ లీజు కాల పరిమితి ముగిసిన తర్వాత పొడిగించకూడదని మంత్రివర్గం నిర్ణయించింది. గ్లోబల్ ఫ్లోటింగ్ టెండర్లు నిర్వహించాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. మైనింగ్‌లో 40 శాతాన్ని స్థానికులకే కొనసాగించనున్నారు. మిగతా 60 శాతానికే టెండర్లు పిలుస్తారు.
 - మంగంపేటలో ప్రస్తుతం 45 వేల టన్నుల బెరైటీస్ వ్యర్థం (వేస్ట్) ఉన్నాయి. దాన్ని విక్రయించడానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
 - విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధికి పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. పొరుగు రాష్ట్రాలు, విదేశాలతో సైతం పోటీ పడే విధంగా విద్యావిధానంలో మార్పులు తీసుకురావాలని, అందుకు అనుగుణంగా సిలబస్ పెంచాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. జిల్లాల్లో ఎంపిక చేసిన కళాశాలల్లో నైపుణ్యాల అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఒక్కో యూనిట్‌లో ఏటా కనీసం వెయ్యి మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులకూ నైపుణ్యాల అభవృద్ధికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
 - అన్ని విశ్వవిద్యాలయాలకు వీసీలుగా విద్యావేత్తలను నియమించాలని నిర్ణయించారు. విదేశీ విశ్వవిద్యాలయాలతో అనుబంధం పెట్టుకోవాలని, అకడమిక్ బోర్డుల్లో విదేశీ ప్రొఫెసర్లకు చోటు కల్పించాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.
 - వ్యవసాయ, అనుబంధ రంగాల్లో లాభదాయకత పెంచడానికి అనుసరించాల్సిన విధానాలను సూచిస్తూ ఇక్రిశాట్ చేత ‘కాన్సెప్ట్ పేపర్’ తయారు చేయించాలని నిర్ణయించారు.
 - అర్హులైన అందరికీ పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 38 లక్షల మందికి పెన్షన్లు ఇస్తుండగా.. మరో 3.8 లక్షల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. కొత్తగా అర్హులను గుర్తిస్తే.. వారికి డిసెంబర్‌లో రెండు నెలల పెన్షన్ చెల్లించాలని నిర్ణయించారు. దళారీల ప్రమేయాన్ని అరికట్టడానికి వీలుగా బ్యాంకు ఖాతాలకే నేరుగా పెన్షన్ జమ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు.
 
 అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గుంటూరులో ఉండకపోవచ్చు: పల్లె
 
 శాసనసభ శీతాకాల సమావేశాలు గుంటూరులో ఉండకపోవచ్చని సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు గుంటూరులో నిర్వహించాలని భావించినా, నిర్వహణలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా ఈ ఏడాది గుంటూరులో ఉండకపోవచ్చని ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. గుంటూరుకు వెళ్లడం పాత్రికేయులకూ ఇబ్బందేనన్నారు. తెలంగాణలో విద్యుత్ కష్టాలకు ఆంధ్రప్రదేశే కారణమని టీ-అసెంబ్లీలో తీర్మానం చేసిన అంశంపై స్పందించాలని విలేకరులు అడిగినప్పుడు.. పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని అంశాలను ఏపీ పాటిస్తోందని ఆయన బదులిచ్చారు. సీఆర్‌డీఏ ఏర్పాటయిన తర్వాత కూడా.. భూసేకరణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం కొనసాగుతుందని మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఉపసంఘంలో ఎంపీ మురళీమోహన్‌కు చోటు కల్పించే ప్రతిపాదన లేదని, సహకారం తీసుకుంటామని పేర్కొన్నారు. మంత్రివర్గ సమావేశంలో మంత్రులను ముఖ్యమంత్రి మందలించలేదని ఇంకో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
 

Advertisement
Advertisement