ప్రైవేటుకు దాసోహం | Sakshi
Sakshi News home page

ప్రైవేటుకు దాసోహం

Published Wed, Jul 8 2015 4:50 AM

ప్రైవేటుకు దాసోహం - Sakshi

- మొన్న విజయ డెయిరీ మూత
- నిన్న చిత్తూరు షుగర్స్‌కు తాళం
- నేడు ధర్మాస్పత్రి అపోలోకు అప్పగింత
- ప్రభుత్వరంగ సంస్థలను మూయిస్తున్న సీఎం
- కార్పొరేట్ సంస్థలకు అండదండలు
సాక్షి, చిత్తూరు:
ప్రభుత్వరంగ సంస్థలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శీతకన్ను వేశారు. కార్పొరేట్ సంస్థల అడుగులకు మడుగులొత్తే ఆయన ప్రభుత్వం నిర్వహించే సంస్థలను ఒక్కొక్కటిగా అథఃపాతాళానికి తొక్కేస్తున్నారు. అదే సమయంలో కార్పొరేట్ శక్తులకు అందినకాడికి దోచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. కొత్త పరిశ్రమల పేరుతో విదేశాలకు వెళ్లి పారిశ్రామికవేత్తల వద్ద మోకరిల్లుతున్న చంద్రబాబునాయుడు సొంత జిల్లాలో ఉన్న పరిశ్రమలు మూతపడుతుండడం విమర్శలకు తావిస్తోంది.

గతంలో సీఎంగా పనిచేసిన సమయంలో చిత్తూరులోని విజయ డెయిరీ మూతపడింది. మళ్లీ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే చిత్తూరు షుగర్స్‌ను మూసేశారు. తాజాగా చిత్తూరు ధర్మాస్పత్రిని అపోలో ఆస్పత్రికి అప్పగించడం జిల్లా ప్రజలను ఆగ్రహానికి గురిచేస్తోంది. 166 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆస్పత్రి రోజూ వెయ్యిమందికి పైగా పేదలకు వైద్య సేవలు అందిస్తోంది. అలాంటి ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేసి, ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంజూరు చేయించి వైద్య విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించవచ్చు. అందుకు భిన్నంగా అపోలో ఆస్పత్రికి లీజు పేరుతో అప్పగించారు.
 
విజయ డెయిరీని మూయించిన ఘనత బాబుదే
జిల్లా కేంద్రంలోని విజయ డెయిరీని మూయించిన ఘనత బాబుకే దక్కింది. 1945లో చిత్తూరు పాలసహకార సంఘం ఆధ్వర్యంలో చిన్నపాటి చిల్లింగ్ సెంటర్‌గా ఈ డెయిరీ ప్రారంభమైంది. 1970 జనవరి ఒకటో తేదీన విజయ డెయిరీగా రూపాంతరం చెందింది. 1989లో డెయిరీని ప్రభుత్వం జిల్లా పాడిరైతులకు అప్పగించింది. 1.35 లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యం, 495 పాలసేకరణ కేంద్రాలు, 200 వైద్య చికిత్సా కేంద్రాలతో విజయ డెయిరీ వర్ధిల్లింది. 10 ట న్నుల సామర్థ్యం కలిగిన పాల పౌడర్, 4 టన్నుల నెయ్యి, టన్ను వెన్న తయారీ కేంద్రాలు సైతం ఉన్నాయి. 34 ఎకరా ల విస్తీర్ణంలో * 300 కోట్ల ఆస్తులున్న విజయ డెయిరీని 2002 ఆగస్టు 31న నష్టాల పేరుతో చంద్రబాబు మూ యించారు. సొంత డెయిరీ హెరిటేజ్‌ను అభివృద్ధి చేసుకునేందుకే ఈ పనిచేశారని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి.
 
చక్కెర ఫ్యాక్టరీని మూయించారు..
మరోమారు సీఎం పీఠం అధిష్టించి ఏడాది తిరగకుండానే చిత్తూరు షుగర్స్‌ను మూయించిన ఘనత బాబుకే దక్కింది. గతంలో సీఎంగా ఉన్నపుడే చక్కెర ఫ్యాక్టరీని మూ యించేందుకు ప్రయత్నించగా రైతులు కోర్టుకెళ్లి అడ్డుకున్నా రు.  ఈ ఏడాది క్రషింగ్‌ను ప్రభుత్వం నిలిపివేసింది. 400 మంది కార్మికులు వీధినపడ్డారు. 84 ఎకరాల విస్తీర్ణంలో రూ.600 కోట్ల ఆస్తులున్న ఈ ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్న ప్రచారం ఉంది.

Advertisement
Advertisement