వైభవం... రథోత్సవం | Sakshi
Sakshi News home page

వైభవం... రథోత్సవం

Published Tue, Jan 27 2015 1:58 AM

వైభవం... రథోత్సవం

కడప కల్చరల్ : అడుగడుగునా గోవింద నామ స్మరణలు...భక్తజనంతో పోటెత్తిన మాడవీధులు.. దేవునికడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం శాస్త్రోక్తంగా పూజలనంతరం స్వామిని రథంపైకొలువుదీర్చారు. తెల్లవారుజాము నుంచే   స్వామిని దర్శించుకునేందుకు భక్తులు  బారులు తీరారు. సాయంత్రం మూడు గంటలకు అర్చకులు, టీటీడీ డిప్యూటీ ఈఓ బాలాజీతో తొలిపూజలు చేయించారు.

ముత్యాల శేషయ్యపేరిట ప్రత్యేక పూజలు చేసి భక్తుల జయజయధ్వానాల మధ్య స్వామి రథాన్ని కదిలించారు. పాతకడప, దేవునికడప గ్రామ పెద్దల ప్రోత్సాహంతో యువకులు రథచక్రాల వెనుక భారీ దుంగలు ఉంచి సన్నలు తొక్కడంతో రథం ముందుకు కదిలింది.  రథంపై అర్చకులు అడుగడుగునా భక్తులకు మంగళ హారతులిచ్చారు. రథం గొలుసులు లాగేందుకు పోటీలు పడ్డారు.   

రథోత్సవం సందర్భంగా  దేవునికడప మాడ వీధులన్నీ జనమయంగా కనిపించాయి.  దేవునికడప, పాతకడపతోపాటు సమీపంలోని పలు వీధులకు చెందిన భక్తులతోపాటు కడప నగరానికి చెందిన భక్తులు కూడా రథోత్సవానికి తరలి వచ్చారు.  రథంపైగల బ్రహ్మదారు శిల్పం ముందు సప్తాశ్వాలు రథాన్ని ముందుకు నడుపుతున్నట్లు ఉండటంతో పదేపదే ఆ శిల్పంపై పూలు చల్లారు.రథ చక్రాల కింద మొక్కులు చెల్లింపుగా గుమ్మడికాయలు ఉంచారు. దేవునికడప చెరువు కట్టనుంచి పోలీసులు వాహనాలను నియంత్రించడంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగలేదు.  రెండున్నర గంటల అనంతరం రథం తిరిగి  యథాస్థానానికి చేరుకుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement