‘కేర్’లెస్ ప్రభుత్వం | Sakshi
Sakshi News home page

‘కేర్’లెస్ ప్రభుత్వం

Published Sun, Feb 14 2016 2:56 AM

‘కేర్’లెస్ ప్రభుత్వం - Sakshi

రెండేళ్ల చైల్డ్ కేర్ లీవ్ అమలు చేస్తున్న కేంద్రం, పలు రాష్ట్రాలు
పీఆర్సీ సిఫారసు చేసింది కూడా రెండేళ్లే
కానీ సీఎం ప్రకటించింది రెండు నెలలే
ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు మోసం
అయినా నోరు మెదపని ఏపీఎన్జీవోలు
ఆవేదన చెందుతున్న మహిళా ఉద్యోగులు

 సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు ప్రభుత్వం ‘అమ్మల’ ఆశలను నిరాశపరిచింది. పదో పీఆర్సీ(వేతన సవరణ సంఘం) నివేదికను యథాతథంగా అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన టీడీపీ ఇప్పుడు ప్లేటు ఫిరాయించింది. నివేదిక ఇచ్చిన తర్వాత కూడా పీఆర్సీ సిఫారసును సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత కూడా.. ఫిట్‌మెంట్ మినహా మిగతా సిఫారసుల అమలుకు కనీస చర్యలూ తీసుకోలేదు. మహిళా ఉద్యోగులకు ఇవ్వాల్సిన పిల్లల సంరక్షణ సెలవు(చైల్డ్ కేర్ లీవ్)ను పీఆర్సీ సిఫారసు చేసినట్లుగా రెండు సంవత్సరాలు కాకుండా కేవలం రెండు నెలలు ఇస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం పట్ల ఉద్యోగులు మండిపడుతున్నారు.

రెండు నెలల చైల్డ్ కేర్ లీవ్ ఇస్తామంటూ శనివారం ఏపీఎన్జీవోల మహాసభలో సీఎం ప్రకటించిన విషయం విదితమే. కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు రెండు సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్(సీసీఎల్)ను అమలు చేస్తోంది. ఇద్దరు పిల్లలకు 18 సంవత్సరాలు నిండే వరకు.. మహిళా ఉద్యోగులు రెండేళ్ల పిల్లల సంరక్షణ సెలవును తమ సర్వీసులో ఎన్నిసార్లయినా వాడుకోవడానికి అవకాశం కల్పించింది. మన రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారిణిలు ఈ సెలవును వాడుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చైల్డ్ కేర్ లీవ్‌ను అమలు చేస్తున్నాయి.

పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర కీలకమని, మెరుగైన సమాజం కోసం పిల్లలకు ఆలనాపాలనా అవసరమైనప్పుడు ఉద్యోగాలు చేస్తున్న తల్లులు ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారనే ఉద్దేశంతో వారికి ప్రత్యేకంగా సెలవు ఇవ్వాల్సిన అవసరాన్ని ఆరో వేతన సంఘం కేంద్రానికి సిఫారసు చేసింది. పదేళ్లుగా ఈ సెలవును కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. మన రాష్ట్రంలో పదో పీఆర్సీ రెండేళ్ల సీసీఎల్‌ను సిఫారసు చేసింది. పీఆర్సీ సిఫారసును యథాతథంగా అమలు చేస్తానని ఇంతకాలం ఊరిస్తూ వచ్చిన సీఎం తాజాగా రెండేళ్లకు బదులు రెండు నెలలు అమలు చేస్తామని ప్రకటించడం పట్ల మహిళా ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం చంద్రబాబు చరిత్రలోనే లేదని, ఈ సారి మోసపోవడం తమవంతైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నోరు మెదపని ఏపీఎన్జీవోలు
రెండు సంవత్సరాలకు బదులు రెండు నెలలే సీసీఎల్ ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటిస్తే.. ఏపీఎన్జీవో నేతలు ఎవరూ నోరు మెదపకపోవడం గమనార్హం. పీఆర్సీ సిఫారసులను యథాతథంగా అమలు చేస్తామని ఎన్నికల ముందు, తర్వాత స్పష్టంగా హామీ ఇచ్చి, ఇప్పుడు ఎందుకు మోసం చేస్తున్నారని గట్టిగా అడగలేకపోయారు. డీఏ సకాలంలో ఇవ్వకపోయినా గట్టిగా నిలదీయలేని ఏపీఎన్జీవో నాయకత్వం.. ఆర్థికంగా భారం పడని చైల్డ్ కేర్ లీవ్ విషయంలోనూ మౌనం వహించడంపై ఉద్యోగుల్లో నిరసన వ్యక్తమవుతోంది.

Advertisement
Advertisement