
జగన్ ప్రసంగానికి 17సార్లు ఆటంకం!
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో స్పీకర్ కోడెల శివప్రసాద్ కనీస మర్యాద పాటించకుండా వ్యవహరించారని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు మండిపడ్డారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో స్పీకర్ కోడెల శివప్రసాద్ కనీస మర్యాద పాటించకుండా వ్యవహరించారని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు మండిపడ్డారు. సభా సంప్రదాయలకు విరుద్దంగా ఆయన వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభ వాయిదా వేసిన తరువాత వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, డేవిడ్‌రాజు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాచమల్లు ప్రసాదరెడ్డి మాట్లాడారు.
ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగా కనీసం మర్యాద ఇవ్వకుండా, ఆయనను సంప్రదించకుండా సభను వాయిదావేయడం సభా సంప్రదాయాలకు విరుద్ధం అన్నారు. సభను వాయిదా వేసిన తీరు బాధాకరం అన్నారు. జగన్మోహన రెడ్డి ప్రసంగానికి టీడీపీ సభ్యులు పదేపదే అడ్డుతగిలారని చెప్పారు. జగన్ ప్రసంగానికి టీడీపీ సభ్యులు 17 సార్లు ఆటంకపరిచారన్నారు. సభలో రేపు జగన్ ప్రసంగాన్ని కొనసాగనివ్వాలని డిమాండ్ చేశారు. స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు.
అసెంబ్లీ వాయిదా వేయడమనేది వారు ఆలోచించుకోవాలన్నారు. అసెంబ్లీలో అధికారపక్షం తీరు సరిగా లేదని చెప్పారు. ఎదురుదాడే ఎజెండాగా సభను నడిపించారన్నారు. స్పీకర్ వ్యవహారశైలి సరిగ్గాలేదని విమర్శించారు.