Sakshi News home page

ప్రభుత్వ వ్యవహారాల్లో సహాయకులుగా వ్యవహరించేందుకు ..సలహాదారుల మండలి? 

Published Sat, Dec 9 2023 4:17 AM

Telangana Government May Appoint Professor Kodandaram as Chief Advisor - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ పాలన సజావుగా సాగే క్రమంలో తనకు సహాయకారులుగా ఉండడానికి వీలుగా సలహాదారులతో కూడిన మండలిని ఏర్పాటు చేసుకునే యోచనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం ఏర్పాటయ్యే సలహామండలికి (అడ్వయిజరీ బోర్డు) చైర్మన్‌గా లేదంటే ముఖ్య సలహాదారుడిగా తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) అధ్యక్షుడు కోదండరాం నియమితులయ్యే అవకాశాలున్నట్లు ప్రభుత్వవర్గాల సమాచారం.

ఇందుకోసం సీఎం రేవంత్‌రెడ్డి కసరత్తు చేస్తునట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచే కీలక శాఖలపై పట్టు సాధించేపనిలో పడ్డారు. రాష్ట్ర మనుగడలో కీలకమైన ఆర్థికశాఖతో పాటు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో తీవ్రచర్చకు కారణమైన విద్యుత్, సాగునీటి రంగాలపై ఆయన అధికారులను గుచ్చిగుచ్చి ప్రశ్నలు అడిగారు. కాంగ్రెస్‌ పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం రాష్ట్రంలోని కీలకశాఖల్లో ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు త్వరలోనే ప్రక్షాళన జరిగే అవకాశాలున్నాయి. 

మలిరోజే విద్యుత్‌శాఖపై సమీక్ష 
ప్రభుత్వం కొలువుదీరిన రోజే జరిగిన మంత్రివర్గ సమావేశంలో భాగంగా సీఎం రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వవర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. కేబినెట్‌ భేటీలో విద్యుత్‌ రంగంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రేవంత్‌ మరుసటిరోజే ఆ శాఖపై పూర్తిస్థాయిలో సమీక్ష చేశారు. రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం సృష్టించేందుకు ప్రయత్నం జరుగుతోందన్న రేవంత్‌ వ్యాఖ్యలు ఆ శాఖలో తీవ్రచర్చకు దారితీస్తున్నాయి.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత కరెంట్‌ గురించి గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకునేదని, ఈ నేపథ్యంలోనే కరెంటు ప్రగతికి సంబంధించిన వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచనలతోనే సీఎం ఆ శాఖను టార్గెట్‌ చేశారని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిన్నటివరకు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఐదేళ్లుగా కరెంట్‌ను తీసుకున్నారని, బహిరంగమార్కెట్‌లో అధిక రేటుకు విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నారని లెక్కలతో సహా వెల్లడించారు.

ఒకవేళ కరెంట్‌ కొనుగోలులో అవినీతి జరిగి ఉంటే దానిని కూడా ప్రజల ముందు ఉంచేందుకే రేవంత్‌ సిద్ధమవుతున్నారని అధికార పార్టీ నేతలు అంటున్నారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వం పదేళ్లుగా చేసిన ఖర్చులు, రాబడులకు సంబంధించిన వివరాలు సిద్ధం చేయాలని ఆర్థికశాఖ అధికారులకు తొలి కేబినెట్‌ భేటీలోనే స్పష్టమైన ఆదేశాలు ఇచి్చన రేవంత్‌ అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వ వాస్తవ ఆర్థికపరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.  

తర్వాత ప్రాజెక్టులపై దృష్టి 
విద్యుత్, ఆర్థిక రంగాలపై సమీక్షలు, యాక్షన్‌ప్లాన్‌ తర్వాత సీఎం రేవంత్‌ సాగునీటి రంగంపై దృష్టి సారించే అవకాశముంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు పాలమూరు–రంగారెడ్డిపై ఆయన ప్రత్యేక కసరత్తు చేస్తారని సమాచారం.

Advertisement

What’s your opinion

Advertisement