పుస్తకం.. ఓ బహుమానం | Sakshi
Sakshi News home page

పుస్తకం.. ఓ బహుమానం

Published Sat, Dec 31 2022 2:20 AM

Huge Visitors At hyderabad National book Fair - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ జాతీయ పుస్తక మహోత్సవం శుక్రవారం  సందర్శకులతో పోటెత్తింది. మరో రెండు రోజుల్లో ప్రదర్శన ముగియనున్న దృష్ట్యా పుస్తకప్రియులు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రతి సంవత్సరం డిసెంబర్‌ చివరి నాటికే ముగిసే పుస్తక ప్రదర్శన ఈ ఏడాది నూతన సంవత్సరంలోకి అడుగిడుతోంది. జనవరి ఒకటో తేదీన  ప్రదర్శన  ముగియనుంది. పుస్తక ప్రియులను  విశేషంగా  ఆకట్టుకొనే  వైవిధ్యభరితమైన  పుస్తకాలు  అందుబాటులో ఉన్నాయి.

300 స్టాళ్లతో ఈ సంవత్సరం పుస్తక ప్రదర్శనను  ఏర్పాటు చేశారు. ఒకవైపు పుస్తక ఆవిష్కరణలు, మరోవైపు  సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తక సమీక్షలు, అమ్మకాలతో సందడి  నెలకొంది. పుస్తక ప్రదర్శన కేవలం పుస్తకాల అమ్మకాలకు మాత్రమే పరిమితం కాకుండా రచయితలను, పాఠకులను ఒకచోట చేర్చే వేదికగా మారింది.ఈ నెల 22వ తేదీన ప్రారంభమైనప్పటి నుంచి పుస్తక ప్రియుల  నుంచి అనూహ్యమైన స్పందన  కనిపిస్తోందని నిర్వాహకులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

‘కొత్త సంవత్సరం పుస్తక పఠనంతో  ప్రారంభం కావాలని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పుస్తకాలు చదవాలనే లక్ష్యంతో జనవరి 1వ తేదీ వరకు  ప్రదర్శన  ఉండేవిధంగా ఏర్పాటు చేశాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.’ అని బుక్‌ ఫెయిర్‌ కమిటీ ఉపాధ్యక్షులు కోయ చంద్రమోహన్‌ తెలిపారు. గత వారం రోజుల్లో  సుమారు 5 లక్షల మందికి పైగా సందర్శకులు తరలివచ్చినట్లు  పేర్కొన్నారు.  

ప్రతి సంవత్సరం  ఒక వేడుకగా నిర్వహిస్తున్న  పుస్తక ప్రదర్శన ఈ సంవత్సరం సైతం  అదే పండుగ  వాతావరణాన్ని తలపించింది. వైవిధ్యభరితమైన జాతీయ, అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంస్థలు ఈ ప్రదర్శనలో భాగస్వాములుగా నిలిచాయి. పుస్తక ప్రదర్శనలో యువత పెద్ద సంఖ్యలో  కనిపించడం విశేషం. తెలంగాణ పబ్లిషర్స్, తెలుగు అకాడమీ, విశాలాంధ్ర, నవతెలంగాణ, నవోదయ వంటి సంస్థల్లో పోటీ పరీక్షలకు కావలసిన పుస్తకాలను కొనుగోలు చేయడం మొదలుకొని ఎమెస్కో, సేజ్, పెంగ్విన్, నవయుగ, వీక్షణం, అరుణతార వంటి పుస్తక ప్రచురణ సంస్థల స్టాళ్లలో లభించే విలువైన నవలలు, సాహిత్య విశ్లేషణ పుస్తకాల వరకు పాఠకులు ఎంతో ఇష్టంగా కొనుగోలు చేశారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సైతం  తరలి వచ్చారు.  

పుస్తక స్పర్శ గొప్పది  
డిజిటల్‌ కంటే పుస్తకస్పర్శ గొప్పది. ప్రస్తుత సమాజం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. మార్కెట్‌ శక్తులు అలజడిని సృష్టిస్తున్నాయి. ఇలాంటి సమయంలో  మౌలికమైన ఆనందాన్ని ఇచ్చేది పుస్తకమే. బంధువులు, ఆత్మీయులు, స్నేహితుల నుంచి కూడా లభించని సుఖం, సంతోషం పుస్తకం నుంచి లభిస్తాయి. పుస్తకాలను ప్రేమించండి. 
– గోరటి వెంకన్న, ప్రముఖ గాయకుడు, ఎమ్మెల్సీ  

Advertisement
Advertisement