శ్రమించి గెలిచిన సింధు, ప్రణయ్‌ | Sakshi
Sakshi News home page

శ్రమించి గెలిచిన సింధు, ప్రణయ్‌

Published Thu, Apr 11 2024 4:05 AM

Sindhu and Pranay won after hard work - Sakshi

తొలి రౌండ్‌లోనే ఓడిన శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రియాన్షు

నింగ్బో (చైనా): ఆసియా బ్యాడ్మింటన్‌ వ్యక్తిగత చాంపియన్‌షిప్‌ సింగిల్స్‌ విభాగంలో భారత స్టార్స్‌ పీవీ సింధు, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ మాత్రమే బరిలో మిగిలారు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 12వ ర్యాంకర్‌ సింధు 64 నిమిషాల్లో 18–21, 21–14, 21–19తో ప్రపంచ 33వ ర్యాంకర్‌ గో జిన్‌ వె (మలేసియా)పై... పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో తొమ్మిదో ర్యాంకర్‌ ప్రణయ్‌ 90 నిమిషాల్లో 17–21, 23–21, 23–21తో ప్రపంచ 16వ ర్యాంకర్‌ లు గ్వాంగ్‌ జు (చైనా)పై గెలుపొందారు.

గతంలో గ్వాంగ్‌ జుతో ఆడిన మూడుసార్లూ ఓడిపోయిన ప్రణయ్‌ నాలుగో ప్రయత్నంలో విజయాన్ని అందుకున్నాడు. తొలి గేమ్‌ను కోల్పోయిన ప్రణయ్‌ రెండో గేమ్‌లో, మూడో గేమ్‌లో మ్యాచ్‌ పాయింట్లను కాపాడుకొని నెగ్గడం విశేషం. మహిళల సింగిల్స్‌ ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో మాళవిక (భారత్‌) 18–21, 19–21తో సిమ్‌ యు జిన్‌ (కొరియా) చేతిలో, ఆకర్షి కశ్యప్‌ 10–21, 11–21తో బుసానన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడిపోయారు.

పురుషుల సింగిల్స్‌ ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో లక్ష్య సేన్‌ 19–21, 15–21తో టాప్‌ సీడ్‌ షి యుకీ (చైనా) చేతిలో, కిడాంబి శ్రీకాంత్‌ 14–21, 13–21తో రెండో సీడ్‌ జిన్‌టింగ్‌ (ఇండోనేసియా) చేతిలో, ప్రియాన్షు 9–21, 13–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్‌) జోడీ 2–21, 12–21తో లియు షెంగ్‌ షు–టాన్‌ నింగ్‌ (చైనా) 
జంట చేతిలో ఓటమి పాలైంది.  

Advertisement
Advertisement