చరిత్ర సృష్టించిన లక్ష్య సేన్‌  | Sakshi
Sakshi News home page

#LakshyaSen: చరిత్ర సృష్టించిన లక్ష్య సేన్‌ 

Published Tue, Jul 11 2023 7:32 AM

Lakshya-Sen-Wins Canada Open World Tour Super 500 Title - Sakshi

కాల్గరీ: ఏడాదిన్నర తర్వాత భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్య సేన్‌ మరో అంతర్జాతీయ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. కెనడా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో లక్ష్య సేన్‌ చాంపియన్‌గా అవతరించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ 19వ ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ 21–18, 22–20తో ప్రపంచ పదో ర్యాంకర్, ఈ ఏడాది ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ చాంపియన్‌ షి ఫెంగ్‌ లీ (చైనా)పై గెలుపొందాడు.

గత ఏడాది జనవరిలో ఇండియా ఓపెన్‌ టైటిల్‌ సాధించాక లక్ష్య సేన్‌ నెగ్గిన మరో అంతర్జాతీయ టైటిల్‌ ఇదే కావడం విశేషం. టైటిల్‌ నెగ్గిన లక్ష్య సేన్‌కు 31,500 డాలర్ల (రూ. 25 లక్షల 99 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 9200 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. గత ఏడాది ఆగస్టులో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో వ్యక్తిగత స్వర్ణ పతకం గెలిచిన లక్ష్య సేన్‌ ఈ సంవత్సరం తాను పాల్గొన్న 12వ టోర్నీలో తొలిసారి విజేతగా నిలిచాడు.

షి ఫెంగ్‌ లీపై గతంలో నాలుగుసార్లు నెగ్గిన లక్ష్య సేన్‌కు ఈసారీ గట్టిపోటీనే ఎదురైంది. 50 నిమిషాలపాటు సాగిన ఈ పోరులో లక్ష్య సేన్‌ కీలకదశలో విజృంభించి పాయింట్లు గెలిచాడు. తొలి గేమ్‌లో స్కోరు 15–15తో సమంగా ఉన్నపుడు లక్ష్య సేన్‌ వరుసగా మూడు పాయింట్లు గెలిచి 18–15తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో స్కోరు 5–6 వద్ద ఉన్నపుడు షి ఫెంగ్‌ లీ వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 11–6తో ముందంజ వేశాడు. 

అనంతరం ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ షి ఫెంగ్‌ లీ 20–16తో నాలుగు గేమ్‌ పాయింట్లు సంపాదించాడు. అయితే లక్ష్య సేన్‌ దూకుడుగా ఆడి ఊహించనిరీతిలో వరుసగా ఆరు పాయింట్లు గెలిచాడు. తద్వారా రెండో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.

‘ఒలింపిక్‌ అర్హత సంవత్సరం కావడం, దానికి తోడు అన్నీ నాకు ప్రతికూల ఫలితాలు వస్తున్న సమయంలో ఈ విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఈ టోర్నీ కొనసాగినకొద్దీ నా ఆటతీరు మెరుగైంది. ఫైనల్లో రెండో గేమ్‌లో వెనుకబడిన దశలో సంయమనం కోల్పోకుండా ఆడాలని  నిర్ణయించుకున్నాను. ఇది ఫలితాన్నిచ్చింది’ అని ఉత్తరాఖండ్‌కు చెందిన 21 ఏళ్ల లక్ష్య సేన్‌ వ్యాఖ్యానించాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement