ఇషా–శివ జోడీకి స్వర్ణం | Sakshi
Sakshi News home page

ఇషా–శివ జోడీకి స్వర్ణం

Published Sat, Aug 19 2023 12:55 AM

Gold medal for India in 10m air pistol mixed team event - Sakshi

బకూ (అజర్‌బైజాన్‌): ప్రపంచ సీనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ ఖాతాలో తొలి స్వర్ణ పతకం చేరింది. శుక్రవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఇషా సింగ్‌ –శివా నర్వాల్‌ జోడీ పసిడి పతకం సొంతం చేసుకుంది. తెలంగాణకు చెందిన ఇషా సింగ్‌... హరి యాణాకు చెందిన శివా నర్వాల్‌ ఫైనల్లో 16–10తో తర్హాన్‌ ఇలేదా–యూసుఫ్‌ డికెచ్‌ (తుర్కియే) ద్వయంపై విజయం సాధించారు.

ఫైనల్‌ను మొత్తం 13 రౌండ్లపాటు నిర్వహించారు. ఒక్కో రౌండ్‌లో ఇరు జట్ల షూటర్లు రెండేసి షాట్‌లు లక్ష్యం దిశగా సంధిస్తారు. అత్యధిక పాయింట్లు సాధించిన జోడీకి రెండు పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. భారత జోడీ ఎనిమిది రౌండ్‌లలో నెగ్గగా, తుర్కియే జంట ఐదు రౌండ్‌లలో గెలిచింది.

అంతకుముందు 65 జోడీలు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో ఇషా సింగ్‌–శివా నర్వాల్‌ ద్వయం 583 పాయింట్లు స్కోరు చేసి టాప్‌ ర్యాంక్‌లో... తర్హాన్‌–యూసుఫ్‌ జోడీ 581 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాయి.

580 పాయింట్లతో జియాంగ్‌ రాన్‌జిన్‌–జాంగ్‌ బౌవెన్‌ (చైనా), హనియె–సాజద్‌ (ఇరాన్‌) జంటలు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచి కాంస్య పతక పోరుకు అర్హత పొందాయి. కాంస్య పతక మ్యాచ్‌లో రాన్‌జిన్‌–జాంగ్‌ బౌవెన్‌ ద్వయం 17–7తో హనియె–సాజద్‌ జంటను ఓడించింది.  

మరోవైపు 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత జోడీలకు నిరాశ ఎదురైంది. మెహులీ–ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ జోడీ 630.2 పాయింట్లు సాధించి తొమ్మిదో స్థానంలో... రమిత –దివ్యాంశ్‌ జంట 628.3 పాయింట్లు సాధించి 17వ స్థానంలో నిలిచాయి.

టాప్‌–4లో నిలిచిన జోడీలు మాత్రమే స్వర్ణ, రజత, కాంస్య పతకాల మ్యాచ్‌లకు అర్హత సాధిస్తాయి. మహిళల స్కీట్‌ టీమ్‌ ఈవెంట్‌లో పరీనాజ్‌ ధలివాల్, గనీమత్‌ సెఖోన్, దర్శన రాథోడ్‌ బృందం 351 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో నిలిచింది.  

ప్రపంచ సీనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో భారత్‌ గెలిచిన స్వర్ణ పతకాలు. గతంలో అభినవ్‌ బింద్రా (2006; 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌), మానవ్‌జిత్‌ సింగ్‌ (2006; ట్రాప్‌), తేజస్విని సావంత్‌ (2010; మహిళల 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌), ఓంప్రకాశ్‌ (2018; 50 మీటర్ల పిస్టల్‌), అంకుర్‌ మిట్టల్‌ (2018; డబుల్‌ ట్రాప్‌), రుద్రాం„Š  (2022; 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌), రుద్రాం„Š , అర్జున్‌ బబూటా, అంకుశ్‌ జాదవ్‌ బృందం (2022; 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌) ఈ ఘనత సాధించారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement