'కార్మిక కుటుంబాల్లో.. తీరని శోకం!' ఈ ప్రమాదాలు ఇంకెన్నాళ్లు? | Sakshi
Sakshi News home page

'కార్మిక కుటుంబాల్లో.. తీరని శోకం!' ఈ ప్రమాదాలు ఇంకెన్నాళ్లు?

Published Thu, Nov 2 2023 5:20 AM

- - Sakshi

సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో ఉన్న బొల్లారం, బొంతపల్లి, ఖాజీపల్లి, హత్నూర, బొంతపల్లి, పటాన్‌చెరు, పాశమైలారం ప్రాంతాల్లో 5 వేల వరకు వివిధ రకాల పరిశ్రమలున్నాయి. అందులో ఎక్కువగా రసాయన పరిశ్రమలు అధికం. ఇటీవల కొన్ని వాటిల్లో వరుసగా అగ్ని ప్రమాదాలు జరిగాయి. అమాయకులైన కార్మికులు మృత్యువాత పడ్డారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇలా పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు, యాజమాన్యాలు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు మాత్రం కనిపించటం లేదు.

రెండేళ్లలో జరిగిన ప్రమాద వివరాలు..
► పటాన్‌చెరు పారిశ్రామిక వాడలో 28 ప్రమాదాలు జరిగి 12 మంది మృతిచెందారు. 70 మంది క్షతగాత్రులయ్యారు.
► బొల్లారం పారిశ్రామికవాడలో 13 ప్రమాదాల్లో ఆరుగురు కార్మికులు మరణించగా 40 మంది గాయపడ్డారు.
► బొంతపల్లిలో ఐదు ప్రమాదాలు చోటుచేసుకొని ఇద్దరు చనిపోగా మరో 12 మంది గాయపడ్డారు.
► గడ్డపోతారం పారిశ్రామిక వాడలో ఐదు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. మరో 16 మంది కార్మికులు గాయపడ్డారు.
► హత్నూర పారిశ్రామికవాడలో ఐదు ప్రమా దాలు జరగగా ఇద్దరు మరణించారు. 20 మంది కార్మికులు గాయపడ్డారు.

పరిశ్రమల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు.. కార్మిక కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగుల్చుతున్నాయి. ఇందులో పనిచేస్తున్న క్రమంలో చోటుచేసుకుంటున్న ఘటనలు.. వారి ప్రాణాలను హరించి వేస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి పొట్ట చేత పట్టుకొని పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతానికి వలసొచ్చి నివసిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు కార్మిక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి.

తాజా ఘటనలు..
► ఇటీవల బొల్లారంలోని అమరా ల్యాబ్స్‌ పరిశ్రమలో రియాక్టర్‌ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది గాయపడగా ఒక కార్మికుడు మృతిచెందాడు.
► తాజాగా హైగ్రోస్‌ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు కార్మికులు శ్వాస ఆడక ఇబ్బందులు పడుతున్నారని తోటి కార్మికులు చెప్పారు.
► ఏడాది కాలంలో ఖైతాన్‌, వింధ్యా కెమికల్స్‌, మైలాన్‌, లీఫార్మా, శ్రీకర ల్యాబ్స్‌ పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో కార్మికులు తీవ్రంగా గాయపడటంతోపాటు మరికొంత మంది కార్మికులు మృతిచెందారు.

ఎందుకీ ప్రమాదాలు?
రసాయన పరిశ్రమల్లో ఎక్కువగా మండే స్వభావం గల రసాయనాలను వినియోగిస్తుంటారు. రియాక్టర్‌లో రసాయనాలను కలిపే సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా రియాక్టర్‌ పేలి ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రమ్ముల్లో నుంచి రసాయనాలను వేరు చేసే క్రమంలో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు జరుగకుండా ఉండేందుకు యాజమాన్యం నైపుణ్యం ఉన్న ఉద్యోగులతో పనులు చేయించాల్సి ఉంటుంది.

రియాక్టర్‌లలో ఒత్తిడి నియంత్రణకు నూతన యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఏర్పాటు చేయటంతో యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఈ విషయంలో అవి నిర్లక్ష్యం వహిస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పరిశ్రమల శాఖ అధికారులు సైతం ప్రమాదాల నివారణ కోసం దృష్టి సారించటం లేదనే ఆరోపణలున్నాయి.

నిబంధనలు పాటించని పరిశ్రమలపై చర్యలు!
నిబంధనలు పాటించని పరిశ్రమలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై యాజమాన్యాలకు అవగహన కల్పిస్తున్నాం. అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్న వంటి సంస్థలకు నోటీసులు అందిస్తున్నాం. – శ్రీనివాస్‌రావు, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ డిప్యూటీ చీఫ్‌
ఇవి చదవండి: రాజీపడుతున్నట్లు నమ్మించి.. మద్యం తాగించి.. యువకుడిని దారుణంగా..

Advertisement

తప్పక చదవండి

Advertisement