సాక్షి, అనకాపల్లి: టీడీపీ జెండా ఇంకా ఎన్నాళ్లు మోయాలి, సైకిల్‌ను భరించడం మావల్లకాదు.. అంటూ జనసేన నేతలు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుకి షాక్ ఇచ్చారు. ఈ దఫా పాయకరావుపేట అసెంబ్లీ టికెట్ జనసేనకు కేటాయించాలని.. ఇవ్వకుంటే ఎన్నికల ప్రచారంలో సహాయ నిరాకరణ చేపడతామని అల్టిమేటం జారీ చేశారు.
పాయకరావుపేటలో మరోసారి జనసేన టీడీపీ సీటు వివాదం రాజుకుంది. బుధవారం ఆ నియోజకవర్గంలో జనసేన నాయకులతో నాగబాబు సమావేశం అయ్యారు. ఆ సందర్భంలో.. టీడీపీ పొత్తులో భాగంగా పాయకరావుపేట సీటు జనసేనకే కేటాయించాలని జనసేన నేతలు కోరారు. ‘‘గతంలో జనసేన మద్దతుతో నెగ్గిన అనిత.. అనేక కేసులతో మమ్మల్ని వేధించారు. జనసేనకు సీటు ఇవ్వకపోతే ఈసారి ఎన్నికల్లో టీడీపీకి ఎంతమాత్రం సహకరించేది లేదు’’ అని స్పష్టం చేశారు. దీంతో నాగబాబు మౌనంగా ఫోన్ చూస్తూ ఉండిపోయారు.
2014లో టీడీపీ అభ్యర్థి అనిత.. జనసేన పార్టీ మద్దతుతో గెలిచారని... ఇబ్బంది పెట్టారని.. మళ్లీ అనితకే టికెట్ ఇచ్చి కలిసి పనిచేయాలంటే కష్టమని మొదటి నుంచి జనసేన నాయకులు చెబుతున్నారు. పొత్తులో భాగంగా టీడీపీకే ఆ సీటు ఇవ్వాల్సి వస్తే మాత్రం తాము పని చేయమని ఖరాకండిగా చెబుతూ వస్తున్నారు. అయితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం అసంతృప్తిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
ఏపీ రాజకీయాల్లో ఇంకా పొత్తు మాత్రం పొడవడం లేదు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో జనసేన-టీడీపీలో సీట్ల లొల్లి నడుస్తోంది. మరోవైపు చర్చల పేరిట టైం పాస్ చేస్తూ వస్తున్న జనసేనాని.. టీడీపీ నుంచి ఎన్ని స్థానాల్లో పోటీ? అనే అంశంపై స్పష్టమైన హామీ పొందలేక పోవడంపైనా ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి.. తీవ్రంగా అవమానించిన టీడీపీతో కలిసి నడవడం ఇబ్బందిగా అనిపిస్తోందంటూ పలువురు నేతలు పవన్ దగ్గర ఏకరువు పెడుతున్నా.. ఆయన మాత్రం కలిసి నడవాల్సిందేనని.. టీడీపీ జెండా మోయాల్సిందేనని చెబుతుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment