బీజేపీని అడ్డుకునే దమ్ము బీఆర్‌ఎస్‌కే | Sakshi
Sakshi News home page

బీజేపీని అడ్డుకునే దమ్ము బీఆర్‌ఎస్‌కే

Published Thu, Apr 25 2024 2:20 PM

Nomination of BRS candidate Ragidi Lakshmareddy

దమ్ము లేని కాంగ్రెస్‌కు ఓట్లేయొద్దు 

బీజేపీ మేలు కోసమే పోటీలో కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థులు  

శ్రీరాముడు కూడా దొంగలను గెలిపించమని చెప్పడు 

బీఆర్‌ఎస్‌కు 10 ఎంపీ సీట్లొస్తే మళ్లీ కేసీఆరే శాసిస్తారు 

అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్‌ మోసం పార్ట్‌ –1 చూపిస్తే ఇప్పుడు మోసం పార్ట్‌ –2 చూపిస్తున్నారు  

కేసీఆర్‌ లేడు.. రాష్ట్రం ఆగమైందని ప్రజల్లో చర్చ జరుగుతోంది. 

మాజీ మంత్రి కేటీఆర్‌ 

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: బీజేపీని అడ్డుకునే దమ్ము ఒక్క బీఆర్‌ఎస్‌కే ఉందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్‌) తేల్చి చెప్పారు. గత 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీని అడ్డుకున్నది బీఆర్‌ఎస్‌ మాత్రమేనని గుర్తు చేశారు. మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్‌ కార్య క్రమం సందర్భంగా బుధవారం తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగుడి వద్ద జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు.

బీజేపీని ఓడించే దమ్ము లేని కాంగ్రెస్‌కు ఓటు వేసి వృథా చేయొద్దని పిలుపునిచ్చారు. బీజేపీని ఓడించే దమ్ము లేకనే రాహుల్‌ గాంధీ కేరళ నుంచి పోటీ చేస్తున్నారని ఎద్ధేవా చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని కొందరు ప్రచారం చేస్తున్నారని, నిజంగా ఆ రెండు పార్టీలు ఒక్కటైతే కేసీఆర్‌ కూతురును జైల్లో పెట్టేవారా అని ప్రశ్నించారు. మరోసారి కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మొత్తం పథకాలను సీఎం రేవంత్‌ రెడ్డి బంద్‌ చేస్తారని, తాము ఏమీ చేయకపోయినా సరే ఓట్లు వేశారంటూ అన్ని పథకాలను ఆపేస్తారన్నారు 
.
బీజేపీకి ఓట్లు అడిగేందుకు 
సిగ్గు ఉందా?..: గత పదేళ్లలో హైదరాబాద్‌కు, తెలంగాణకు బీజేపీ ఏం చేయలేదని, ఉప్పల్, అంబర్‌పేట్‌లో పదేళ్లలో రెండు ఫ్లై ఓవర్లు కూడా కట్టలేకపోయిందని కేటీఆర్‌ విమర్శించారు. తమ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 36 ఫ్లైఓవర్లు కడితే రెండు కూడా కట్టడం చేతకాని బీజేపీకి ఓట్లు అడిగేందుకు సిగ్గు ఉందా అని ప్రశ్నించారు. మోదీ ప్రధాని అయినప్పుడు రూ.400 ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధర, ఇప్పుడు రూ.1100 పెరిగిందన్నారు.

పప్పు, ఉప్పు, చింతపండు, బస్సు, రైలు అన్ని ధరలు పెంచిన మోదీని ప్రజలందరూ ప్రియమైన ప్రధాని కాదు పిరమైన ప్రధాని అని అంటున్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు. బీజేపీ నేతలను ఏం చేశారని అడిగితే చాలు జై శ్రీరామ్‌ అని అంటారని, శ్రీరామునితో తమకు ఎలాంటి పంచాయితీ లేదని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. శ్రీరాముడు కూడా లంగలు, దొంగలను గెలిపించమని చెప్పడన్నారు. 

కేసీఆర్‌ లేడు.. రాష్ట్రం ఆగమైంది.
కేసీఆర్‌ లేడు రాష్ట్రం ఆగమైందని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చర్చ జరుగుతోందని కేటీఆర్‌ చెప్పారు. ప్రజలు ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 10 స్థానాలిస్తే మళ్లీ రాష్ట్రంలో కేసీఆరే రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తుందన్నా రు.

మోదీకి తాము గెలువమని అర్థమైంది కనుకనే ముస్లింలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎన్డీఏ కూటమికి 200 సీట్లు దాటవని, ఇండి యా కూటమికి కూడా 150 సీట్లు రావని అంచనా వేశారు. అందుకే బీఆర్‌ఎస్‌కు ఎక్కువ సీట్లు ఇస్తే వాళ్లే మనల్ని బతిమిలాడే పరిస్థితి వస్తుందన్నారు. 

బడే భాయ్‌ మోదీ.. చోటా భాయ్‌ రేవంత్‌ మోసం చేస్తున్నారు
బడే భాయ్‌ మోదీకి మేలు చేసేందుకు చోటే భా య్‌ రేవంత్‌ రెడ్డి మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్‌ నుంచి డమ్మీ అభ్యర్థి ని పోటీలో పెట్టారని బీఆర్‌ఎస్‌ నే త కేసీఆర్‌ ఆరోపించారు. రాష్ట్రంలో కూడా చాలా చోట్ల కాంగ్రెస్‌ పార్టీ డమ్మీ అభ్యర్థులను పెట్టిందన్నారు.

’’రాహుల్‌ గాంధీ ఏమో లిక్కర్‌ స్కాం లేదంటాడు. కేజ్రీవాల్‌ ఆరెస్ట్‌ అన్యా యమని అంటాడు. కానీ రేవంత్‌ రెడ్డి మాత్రం కవితమ్మ అరెస్ట్‌ కరెక్టే అంటాడు. రేవంత్‌ రెడ్డి రాహుల్‌ గాంధీ కోసం పనిచేస్తున్నాడా..లేక మోదీ కోసం పనిచేస్తున్నాడా’’అని కేటీఆర్‌ ప్రశ్నించారు. మోదీ, రేవంత్‌ కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. 

వలస పక్షులకు ఓటు వేస్తే దొరకరు... 
మల్కాజిగిరిలో వలస పక్షులకు ఓట్లు వేస్తే గెలిచిన తర్వాత కనబడరని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి మోసం పార్ట్‌ –1 సినిమా చూపించగా, పార్లమెంట్‌ ఎన్నికల్లో మోసం పార్ట్‌ –2 సినిమా చూపిస్తున్నాడని దుయ్యబట్టారు. 

Advertisement
Advertisement