Sakshi News home page

రెండు రోజుల్లో శుభవార్త వింటారు: కమల్‌ హాసన్‌

Published Mon, Feb 19 2024 1:21 PM

"Good News In 2 Days: Kamal Haasan On Lok Sabha Poll Alliance With DMK - Sakshi

చెన్నై: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరో రెండు రోజుల్లో శుభవార్త చెప్తానని ప్రకటించారు నటుడు, మక్కల్‌ నీది మయ్యం(ఎమ్‌ఎన్‌ఎమ్‌) పార్టీ అధినేత కమల్‌ హాసన్‌. పార్లమెంట్‌ ఎన్నికల కోసం సద్ధమవుతున్నామని.. తమకు మంచి అవకాశాలు వస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల్లో పొత్తుకు సంబంధించి నిర్ణయం ప్రకటిస్తామని కమల్‌ హాసన్‌ వెల్లడించారు.

తన తదుపరి చిత్రం ‘థగ్‌ లైఫ్‌’ షూటింగ్‌ కోసం అమెరికా వెళ్లిన కమల్‌ సోమవారం చెన్నై తిరిగొచ్చారు. ఈ మేరకు ఎయిర్‌పోర్టులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీతో కమల్‌ ఎమ్‌ఎన్‌ఎమ్‌ పొత్తు పెట్టుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని గత ఏడాది సెప్టెంబర్‌లో డీఎంకే నాయకుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ వెల్లడించారు. పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో కమల్‌ హాసన్‌ మక్కల్‌ నీది మయ్యమ్‌తో పోత్తుపై పార్టీ నేతలు నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.

అంతేగాక సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వివాదాస్ప వ్యాఖ్యలకు మద్దతుగా కమల్‌ హాసన్‌ నిలిచారు. సనాతన ధర్మంపై మాట్లాడినందుకే చిన్న పిల్లావాడిని టార్గెట్‌ చేస్తున్నారని విమర్శించారు. ఇక 2018లో కమల్‌ హాసన్‌ ఎమ్‌ఎన్‌ఎమ్‌ పార్టీని స్థాపించారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికలు, 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. అనంతరం గత ఏడాది జరిగిన ఈరోడ్‌ ఉప ఎన్నికల్లో డీఎంకే నిలబెట్టిన అభ్యర్థికి ఎమ్‌ఎన్‌ఎమ్‌ మద్దతు ఇచ్చింది.
చదవండి: యూపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ‘ఆర్‌ఎస్‌ఎస్‌పీ’

Advertisement
Advertisement