ఖరారుకు ముందే తకరారు | Sakshi
Sakshi News home page

ఖరారుకు ముందే తకరారు

Published Thu, Sep 28 2023 12:40 AM

Disagreement started before finalization of candidates in Congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  కాంగ్రెస్‌ పార్టీలో అసెంబ్లీ టికెట్లు ఎవరెవరికి ఇచ్చేదీ ఇంకా ఖరారుకాక ముందే అసమ్మతి సెగ మొదలైంది. స్క్రీనింగ్‌ కమిటీ సమావేశాల్లో జరుగుతున్న చర్చలు, ఖరారయ్యాయని భావిస్తున్న స్థానాల గురించిన సమాచారం బయటికి వస్తుండటంతో అసంతృప్తులు గళం విప్పుతున్నారు. పార్టీ టికెట్లను అమ్ముకుంటున్నారంటూ.. మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన నాయకుడు కొత్త మనోహర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆశావహుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మాల, మాదిగ, లంబాడీ, ఆదివాసీ, పార్టీ అనుబంధ సంఘాలు, ఇతర కేటగిరీల పేరుతో ఇప్పటికే టికెట్ల కోసం డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో.. టికెట్ల ప్రకటన తర్వాత పరిస్థితి ఇంకెలా ఉంటుందోనన్న చర్చ జరుగుతోంది. 

ఇప్పటికే ఢిల్లీకి బీసీ నేతలు 
ఈసారి బీసీలకు టికెట్ల కేటాయింపు కాంగ్రెస్‌లో పెద్ద చిచ్చు రాజేసేలా కనిపిస్తోంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రెండు చొప్పున 34 స్థానాలు బీసీలకు ఇస్తామని రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం మాట ఇచ్చింది. ఈ మేరకు తమకు కనీసం 34 అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని.. వాటిని 40 వరకు పెంచాలని బీసీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌ వేదికగా పలుమార్లు సమావేశం కావడంతోపాటు ఇప్పుడు హస్తిన బాట పట్టారు. బీసీ నేతలు బుధవారమే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవాల్సి ఉన్నా.. ఆయన బెంగళూరులో ఉండటంతో వీలుకాలేదు.

అందుబాటులో ఉన్న అధిష్టానం నేతలను కలుస్తున్న బీసీ నేతలు.. గురువారం ఖర్గేను, వీలుంటే రాహుల్‌ను కలిసే అవకాశం ఉందని సమాచారం. అయితే టీపీసీసీ నాయకత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా అన్న దానిపై బీసీ నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సర్వేలలో మంచి ఫలితాలు రావడం లేదన్న సాకు చూపి తమకు ఇవ్వాల్సిన టికెట్లను అగ్రవర్ణాలకు కేటాయించే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు.

అందుకే తొలి జాబితాలో బీసీ నేతల పేర్లు రాకుండా చేసి, వారిని టికెట్‌ ఒత్తిడిలో ఉంచి మిగతా వారి కోసం మాట్లాడకుండా చేయాలనే ప్రయత్నమని పేర్కొంటున్నారు. ఈసారి టికెట్ల కేటాయింపులో తేడా వస్తే సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే టికెట్లు ఆశిస్తున్న బీసీల్లో ఎక్కువ శాతం అగ్రవర్ణ నాయకులతోనే పోటీ పడుతుండటంతో.. తమను కాదని ఓసీ నేతలకు టికెట్లు ఇస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. 

మాకు మరో మూడు సీట్లివ్వండి 
ఎస్టీ నేతలు కూడా తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని టీపీసీసీ పెద్దలను కోరుతున్నారు. 40–50 స్థానాల్లో ప్రభావితం చేయగల తమ సామాజిక వర్గానికి రిజర్వ్‌ అయిన 12 అసెంబ్లీ సీట్లకుతోడు కనీసం మరో 3 జనరల్‌ స్థానాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. రిజర్వుడు నియోజకవర్గాల్లో కూడా లంబాడా, కోయ (ఆదివాసీ) సామాజిక వర్గాలకు ఏయే సీట్లు ఇవ్వాలనే విభజన కూడా చేస్తున్నారు. దేవరకొండ, వైరా, ఖానాపూర్, బోథ్, మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు స్థానాలు లంబాడాలకు ఇవ్వాలని.. ఆసిఫాబాద్‌లో ఆదివాసీలకు, ములుగు, భద్రాచలం, అశ్వారావుపేట, పినపాక కోయ వర్గానికి ఇవ్వాలని కోరుతున్నారు.

అంతేగాకుండా తెలంగాణలో 31 లక్షలకు పైగా ఎస్టీ జనాభా ఉందని.. జనాభా ప్రాతిపదికన మరో మూడు జనరల్‌ స్థానాల్లో కూడా ఎస్టీలకు అవకాశం ఇవ్వాలని అంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ ఈ విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం తాము కూడా బీసీ నేతల తరహాలోనే ఢిల్లీ వెళ్లి పార్టీ అధిష్టానాన్ని కలుస్తామని కూడా పేర్కొనడం గమనార్హం. 
 
 బుజ్జగింపులు షురూ 
అసమ్మతి కుంపట్లపై ఓ అంచనాకు వచ్చిన కాంగ్రెస్‌ అధిష్టానం.. పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రేను రంగంలోకి దింపింది. స్క్రీనింగ్‌ కమిటీ సమావేశాలు ప్రారంభమవడానికి ముందే తన పని మొదలుపెట్టిన ఆయన ఇప్పుడు మరింత ముమ్మరం చేశారు. గాందీభవన్, ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వేదికగా మంతనాలు జరుపుతున్నారు. నేతలతో మాట్లాడుతూ.. పార్టీపై నమ్మకం ఉంచాలని, టికెట్‌ వచ్చినా, రాకపోయినా సహకరించాలని కోరుతున్నారు. మొత్తమ్మీద టికెట్ల ప్రకటన ఘట్టం కోసం కాంగ్రెస్‌ పార్టీ నేతలు అటు ఉత్కంఠతోనూ, ఇటు ఆందోళనతోనూ ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.  

ఒక్కోచోట పది మంది.. 
కాంగ్రెస్‌ టికెట్ల కోసం పదిమందికిపైగా దరఖాస్తు చేసుకున్న స్థానాలు 50కి పైగా ఉన్నాయి. ఇందులో ఇద్దరు లేదా ముగ్గురు గట్టిగానే యత్నిస్తున్నారు. వివిధ సమీకరణాల్లో లాబీయింగ్‌ చేసుకుంటూ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఏ ఒక్కరికి టికెట్‌ వచ్చినా మిగతా నేతలు రోడ్డెక్కే అవకాశాలున్నాయి. ముఖ్య నాయకులపై ఉన్న అసంతృప్తిని కక్కేసి ఇతర పార్టీలోకి వెళ్లిపోవాలని కొందరు, పార్టీలోనే ఉండి తమకు అన్యాయం చేసిన నేతలను బహిరంగంగా విమర్శించాలని మరికొందరున్నట్టు సమాచారం.

టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించిన మహేశ్వరం నేత కొత్త మనోహర్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో.. అధికారికంగా టికెట్లు ప్రకటించాక ఎన్ని చోట్ల అసమ్మతి రగులుతుంది? దాన్ని చల్లార్చే యత్నాలు ఏమేరకు గట్టెక్కుతాయి? టికెట్లు రాక రోడ్డెక్కేనేతలపై ఏ చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న అంశాలు చర్చనీయాంశంగా మారాయి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement