రాయలసీమకు హైకోర్టు అక్కర్లేదట.. సీమకు చంద్రబాబు ద్రోహం | Chandrababu Naidu Is A Cheater Of Rayalaseema People - Sakshi
Sakshi News home page

రాయలసీమకు హైకోర్టు అక్కర్లేదట.. సీమకు చంద్రబాబు ద్రోహం

Published Fri, Sep 8 2023 1:32 PM

Chandrababu Is A Cheater Of Rayalaseema - Sakshi

“అమరావతిలో లక్షల కోట్లు ఖర్చుపెట్టేసి టీడీపీ నేతల రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచేయాలి. కానీ వెనుక బడిన రాయలసీమకు కనీసం హైకోర్టు కూడా అవసరం లేదట. ఉత్తరాంధ్రకు ముందే గుండు సున్నా కొట్టేసిన చంద్రబాబు నాయుడు రాయలసీమపైనా విషం చిమ్మేశారు. మొత్తానికి తనకు అమరావతి తప్ప రాష్ట్రంలో ఇంకే ప్రాంతమూ నగరమూ ముఖ్యమే కాదని చంద్రబాబు నాయుడు చాటి చెప్పారు. రాయలసీమ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న  న్యాయరాజధాని వద్దే వద్దని చెప్పడం ద్వారా చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయారు.”

రాయలసీమలో పర్యటిస్తోన్న చంద్రబాబు నాయుడు ఒక పక్క తన అవినీతిని ఐటీ నోటీసులు బట్టబయలు చేయడంతో ఎప్పుడు అరెస్ట్ చేస్తారోనన్న భయంతో ఉన్నారు. మరో పక్క రాయలసీమ వాసులు న్యాయ రాజధాని ప్రస్తావన తీసుకురాగానే చంద్రబాబుకు అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం గుర్తుకొచ్చింది. అంతే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.  రాయలసీమకు హైకోర్టు ఎందుకు? అని ఎదురు ప్రశ్రించారు. కావాలంటే హై కోర్టు బెంచ్  ఇస్తే అదే ఎక్కువ అని కూడా తీర్పు చెప్పారు. రాయలసీమ ప్రజల ఓట్లతో రాజకీయ బిక్ష పెడితే   రాజకీయాల్లో  ఎదిగి కుదరకపోతే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు.

తనను అంతటి వాణ్ని చేసిన రాయలసీమ ప్రజల రుణాన్ని ఎలా తీర్చుకోవాలా? అని ఆయన ఆలోచించాలి. అలాంటిది రాయలసీమకు ఎలా ద్రోహం తలపెడదామా అన్న ఆలోచనే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. 2019లో ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార.. అభివృద్ది వికేంద్రీకరణల్లో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయించిస సంగతి తెలిసిందే. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూనే ఉత్తరాంధ్రలోని విశాఖను కార్యనిర్వాహక రాజధానిగానూ కర్నూలును న్యాయ రాజధానిగానూ చేయాలని ఆయన నిర్ణయించారు.

అయితే కర్నూలులో హై కోర్టు పెడితే ఏం వస్తుంది? నాలుగు జిరాక్స్ సెంటర్లు వస్తాయంతే అని చంద్రబాబు విషం చిమ్మారు. తాజాగా చంద్రబాబు రాయలసీమ పర్యటనలో సీమ న్యాయవాదులు కర్నూలులో హైకోర్టు ప్రస్తావన తీసుకురాగనే చంద్రబాబుకు మండుకొచ్చేసింది.  రాయలసీమకు హైకోర్టు అవసరమే లేదని తెగేసి చెప్పారు. కావాలంటే ఓ బెంచ్ ఇస్తే సరిపోతుందన్నారు. హైకోర్టు పెడితేనే నాలుగు జిరాక్స్ షాపులు తప్ప ఏవీ రావన్న చంద్రబాబు నాయుడు హైకోర్టు బెంచ్ పెడితే కర్నూలుకు ఏం వస్తుందో చెప్పాలంటున్నారు  రాయలసీమ హక్కుల వేదిక నేతలు.

బాగా అభివృద్ది చెంది.. రాజధానికి అన్ని విధాలా అనువైన నగరంగా అందరూ ఒప్పుకునే విశాఖపై విషం చిమ్ముతూనే ఉన్నారు చంద్రబాబు. అక్కడ కార్యనిర్వాహక రాజధాని అవసరం లేదని ఉత్తరాంధ్ర ప్రజలే అంటున్నారంటూ బుకాయిస్తున్నారు చంద్రబాబు. ఇటు రాయలసీమకు హైకోర్టు అవసరం లేదంటూ ఈ ప్రాంతంపైనా విషం చిమ్ముతున్నారు. తాను తన బంధువులు.. తన ఎల్లో మీడియా అధినేతలు.. టీడీపీ సీనియర్లు వారి బంధువులు భూములు కొని అట్టేపెట్టుకున్న అమరావతిలో మాత్రం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అయినా సరే లక్షన్నర కోట్లకు పైగా ఖర్చే చేసేయాలని చంద్రబాబు పట్టుబడుతున్నారు.
చదవండి: ‘చంద్రబాబు నిజంగానే భయపడ్డారు’

ఏ అమరావతి జపం చేస్తున్నారో అదే అమరావతిలో తాత్కాలిక భవనాల నిర్మాణం ముసుగులోనే  వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు అడ్డంగా భోంచేసిన వైనాన్ని ఐటీ శాఖ అధికారులు సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే తాను జైలుకు వెళ్లక తప్పదని చంద్రబాబు నాయుడికి అర్ధమైపోయింది. తాను చేసిన తప్పేంటో తనకి తెలుసు. ఆ తప్పుకు శిక్ష ఏం పడుతుందో కూడా బాబుకు తెలుసు. అందుకే  తనను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారని ఆయన కంగారు పడుతున్నారు. ఈ ఉక్రోషంలోనే రాయలసీమకు హైకోర్టు బెంచ్ చాలునని విషం కక్కుతున్నారని రాయలసీమకు చెందిన న్యాయవాదులు అంటున్నారు.
-సీఎన్‌ఎస్‌ యాజులు, సీనియర్‌ జర్నలిస్టు, సాక్షి

Advertisement
 
Advertisement
 
Advertisement