‘ఆ మాట చెప్పడానికి నువ్వెవరయ్యా?’ | Sakshi
Sakshi News home page

పచ్చ చిలుక మరో వేషం.. షాకిచ్చిన టీడీపీ నేతలు!

Published Fri, Apr 26 2024 10:08 AM

ap elections 2024 tdp rebels insults prashant kishor

హైదరాబాద్‌, సాక్షి: తెలుగు దేశం కోసం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి కోసం మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కోసం మరో వేషం కట్టారు. ఇప్పటిదాకా టీడీపీ అనుకూల స్టేట్‌మెంట్లు ఇస్తూ వస్తున్న ఈ పచ్చ చిలుక.. ఇప్పుడు స్వయంగా ఏపీ రాజకీయాల్లోకి దిగింది. ఈ ఎన్నికల్లో టీడీపీకి తలనొప్పిగా మారిన ఆ పార్టీ రెబల్స్‌ను బుజ్జగించేందుకు ప్రశాంత్‌ కిషోర్‌ను రంగంలోకి దించారు చంద్రబాబు. అయితే ఇక్కడే పీకేకు ఘోరమైన భంగపాటు కలిగింది. 

 

కూటమి పేరుతో టికెట్ల డ్రామా ఆడించిన చంద్రబాబు.. ఆ పార్టీ సీనియర్లకు, గత ఐదేళ్లుగా కష్టపడ్డవాళ్లకు మొండి చేయి చూపించారు. కార్యకర్తల మద్దతు కంటే డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చారని, సామాజిక వర్గాల ప్రతిపాదికన కూడా టికెట్లు ఇవ్వకపోవడం దారుణమంటూ బహిరంగంగానే కొందరు అసంతృప్తి వెల్లగక్కారు. ఈ క్రమంలో  చాలాచోట్ల ఆ పార్టీ నేతలు రెబల్స్‌గా పోటీ చేసేందుకు ముందుకు వచ్చారు. 

అయితే.. నామినేషన్ల ఉపసంహరణకు ఇంకా గడువు ఉండడంతో(ఏప్రిల్‌ 29).. బుజ్జగింపు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాస్తవానికి వీళ్ల విషయంలో టీడీపీ అధిష్టానం మొదటి నుంచే బుజ్జగింపులు చేస్తోంది. చంద్రబాబుతో పాటు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ స్వయంగా రంగంలోకి వాళ్లతో చర్చలు జరిపారు. కొందరు  వెనక్కితగ్గగా.. మరికొందరు మెత్తబడుతూ వస్తున్నారు. అయితే ఇంకొందరు మాత్రం నేరుగా తగ్గబోమంటూ ముఖం మీదే చెప్పేశారు. దీంతో చివరి అస్త్రంగా ఈ ఎన్నికల్లో తమకు పని చేస్తున్న పీకేతో.. ఆ రెబల్స్‌కు చంద్రబాబు ఫోన్లు చేయిస్తున్నారు. 

ఈసారి ఎన్నికల్లో గెలుపు కష్టంగా ఉందని, పోటీ నుంచి తప్పుకుని కాస్తైనా పార్టీకి సహకరించాలని పీకే ఇప్పుడు వాళ్లను బతిమాలుతున్నట్లు తెలుస్తోంది. అందుకు బదులుగా పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని, అవసరమైతే పదవులు కూడా ఇస్తుందని పీకే టీడీపీ రెబల్స్‌తో చెబుతున్నారట. అయితే.. ఈ క్రమంలోనే టీడీపీ నేతల నుంచి పీకేకు దిమ్మతిరిగే సమాధానాలు వస్తున్నట్లు తెలుస్తోంది.  

అసలు టీడీపీ అధిష్టానం బదులుగా ఫోన్లు చేయడానికి మీరెవరంటూ ప్రశాంత్‌ కిషోర్‌ను వాళ్లు నిలదీస్తున్నారట. అంతేకాదు.. టీడీపీ ఇంకా అధికారంలోకే రాలేదని, అధికారంలోకి వచ్చేది అనుమానాలు ఉన్నప్పుడు పదవులు ఇస్తామని మీరెలా చెబుతున్నారంటూ నిలదీశారట. దీంతో భంగపడ్డ పీకే.. ఆ ఫోన్‌ సంభాషణల సారాంశాన్ని చంద్రబాబుకు చెప్పుకుని ఫీలైనట్లు తెలుస్తోంది. అయినప్పటికీ టీడీపీ కోసం ఎలాగైనా వాళ్లను ఒప్పించాలని చంద్రబాబు బతిమాలడంతో.. వాళ్లకు ప్రత్యామ్నాయ ఆశలు కలిగించేందుకు మరోసారి ఫోన్లలో మాట్లాడేందుకు పీకే సిద్ధపడుతున్నట్లు సమాచారం.

 
 
 

 

Advertisement
Advertisement