మోసం చేయడానికే రంగురంగుల మేనిఫెస్టో | Sakshi
Sakshi News home page

మోసం చేయడానికే రంగురంగుల మెనిఫెస్టో

Published Tue, Feb 6 2024 7:10 PM

AP Budget Session: CM YS Jagan Slams Chandrababu Naidu - Sakshi

గుంటూరు, సాక్షి:  నోరు తెరిస్తే చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నానని అంటారని.. అనుభవం అనేది రాష్ట్రాలకు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని.. ఏ అనుభవం లేకుండానే రాష్ట్రానికి సుపరిపాలన అందించామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.  ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలలో మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం జగన్ ప్రసంగిస్తూ.. గత 57 నెలల్లో జరిగిన మంచిని ప్రస్తావిస్తూనే చంద్రబాబు తీరను ఎండగట్టారు. 

ఇప్పటివరకు ఐదు బడ్జెట్ లు ప్రవేశపెట్టాం. ఇదే బడ్జెట్ కు మరిన్ని మెరుగులతో వచ్చే ప్రభుత్వంలో పెట్టుకుందాం. 2024 జూన్ లో మన ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతాం. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై నిందలు వేస్తున్నాయి. కఠినమైన పరిస్థితుల మధ్య అధికారంలోకి వచ్చాం. ఇప్పటివరకు ఐదు ప్రజాబడ్జెట్లు ప్రవేశపెట్టాం. 

కరోనా కారణంగా ఆదాయం తగ్గింది.. ఖర్చులు పెరిగాయి. గత ఐదేళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. కరోనా మూడేళ్లలో రాష్ట్రం రూ.66,116 కోట్లు నష్టపోయింది.  కరోనా వల్ల ఇతర రాష్ట్రాలు కూడా బాగా నష్టపోయాయి. మన దేశంలోని చాలా రాష్ట్రాలను ఈ పరిస్థితులు కుదిపేశాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గిపోయాయి. 2015-19 మధ్య కేంద్రం ఇచ్చిన పన్నుల వాటా 35 శాతం. ఈ ఐదేళ్లలో కేంద్రం ఇచ్చిన పన్నుల వాటా 31.5 శాతమే. ప్రతి ఏటా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగ్గుతూ వచ్చాయి 

గత ప్రభుత్వ విధానాల కారణంగా విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత వంటి కీలక రంగాలు కుదేలయ్యాయి. రూ.87,612 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి రైతులను చంద్రబాబు మోసం చేశారు. ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు కూడా చంద్రబాబు రైతులకు ఇవ్వలేదు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారు. ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనమిక్ పవర్ హౌస్ ఉండాలి. అలాంటి పవర్ హౌస్ లేకపోతే రాష్ట్ర ఆదాయాలు ఎప్పటికీ పెరగవు. 

ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్ ను కోల్పోయాం. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ రెవెన్యూ లోటు వెంటాడుతోంది. అందుకోసమే విశాఖ గురించి పదేపదే చెప్తున్నా విభజన కారణంగా రాష్ట్రం ఏటా రూ.13 వేలకోట్లు నష్టపోతున్నాం. లక్షా 30 వేల కోట్లు అదనపు ఆదాయాన్ని కోల్పోయాం. మనకు ఆ వెసులుబాటు లేకుండా చేశారు. కనీసం చట్టంలోనూ ఆ వెసులుబాటు కల్పించలేదు. అందుకే కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రావొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 



57 నెలల మన ప్రయాణంలో ఎక్కడా అవినీతికి తావివ్వలేదు.  లంచాలు, వివక్ష లేకుండా పారదర్శక పాలన చేశాం. ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి రూపాయి ప్రజలకు చేరుతోంది. రూ.2 లక్షల 55 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం. బటన్ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో డబ్బులేస్తున్నారు. నాన్ డీబీటీ ద్వారా రూ.లక్షా 76 వేల కోట్లు అందించాం. 
 
ఎల్లో మీడియా ఒకే అబద్ధాన్ని పదేపదే చెప్తోంది. ఇలాంటి వారిపై మనం యుద్ధం చేస్తున్నాం. చంద్రబాబు హయాంలో కంటే అభివృద్ధి కోసం మేం అదనంగా ఖర్చు చేస్తున్నాం. చంద్రబాబు హయాంలో ఏడాదికి సగటున రూ.15,227 కోట్లు ఖర్చు చేస్తే మా హయాంలో ఏడాదికి రూ.17,757 కోట్లు ఖర్చు చేశాం. అప్పులపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది. ఎక్కువ అప్పులు చేశామని అబద్ధాల బ్యాచ్ ప్రచారం చేస్తోంది. విభజన నాటికి లక్షా 53 వేల కోట్ల అప్పు ఉంటే... చంద్రబాబు దిగిపోయే సమయానికి 4.12 లక్షల కోట్లకు చేరింది. రూ.4.12 లక్షల కోట్ల అప్పులతో మన ప్రయాణం ప్రారంభించాం. చంద్రబాబు హయాంలో అప్పులు రూ.4,12,288 కోట్లు 
చంద్రబాబు హయాంలో అప్పులు 21.87 శాతం పెరిగితే ..  మన హయాంలో అప్పుల పెరుగుదల 12 శాతానికి పరిమితం చేశాం.

14 ఏళ్ల చంద్రబాబు హయాంలో ఒక్కరికీ మంచి చేసింది లేదు. మన పాలనలో అందరికీ సంక్షేమం అందించాం. బాబు హయాంలో అక్కచెల్లెమ్మలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మనం అక్కచెల్లెమ్మల ఖాతాలో రూ.2 లక్షల 55 వేల కోట్లు వేశాం. పేదలకు అండగా నిలబడ్డాం. ప్రతి రూపాయిని బాధ్యతగా ఖర్చు చేశాం. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు. చంద్రబాబు పొత్తులకోసం వెంపర్లాడుతున్నారు. జాతీయ పార్టీలతో కూడా పరోక్షంగా, ప్రత్యక్షంగా అంటకాగుతున్నారు.

చంద్రబాబు మళ్లీ మోసపూరిత వాగ్ధానాలు ఇస్తున్నాడు. చంద్రబాబు మూడుసార్లు సీఎం అయినా... ప్రజలకు చేసిందేమీ లేదు. ఇప్పటికీ బాబు ఏంచేశాడో చెప్పి ఓటు అడగలేకపోతున్నాడు. చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చే స్కీం ఒక్కటైనా ఉందా?. చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చేది.. వెన్నుపోటు. అన్ని సామాజిక వర్గాలను చంద్రబాబు మోసం చేశారు. మేనిఫెస్టోను వెబ్ సైట్ నుంచి తొలగించిన ఘనత చంద్రబాబుది. ఎన్నికల పేరుతో చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో పెద్ద బుక్ తెస్తారు. ఎన్నికల తర్వాత ఆ మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్తుంది. ఏ గ్రామానికి వెళ్లి చూసినా చంద్రబాబు చేసిందేమీ కనిపించదు. నమ్మినవాడు మునుగుతాడు... నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు. చంద్రబాబు ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు. పేదలను మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. పక్క రాష్ట్రాల్లోని వాగ్ధానాలను తీసుకొచ్చి మళ్లీ మేనిఫెస్టోలో పెట్టారు. బాబు కనీసం మేనిఫెస్టోలోని 10 శాతం హామీలను కూడా నెరవేర్చలేదు.

ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు, ఇన్ని పొత్తులు ఎందుకు?. వేరే రాష్ట్రాల్లో ఆకట్టుకున్న హామీలను చంద్రబాబు తీసుకొచ్చారు. మా హయాంలో ఎవరూ టచ్ చేయలేని పథకాలు తీసుకొచ్చాం. 8 పథకాలకే రూ.52 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. 650 వాగ్దానాలతో గత మేనిఫెస్టో రూపొందించిన చంద్రబాబు అందులో 10 శాతం మాత్రమే అమలు చేశారు. ప్రజలను మోసం చేసేందుకే చంద్రబాబు వాగ్ధానాలు ఉంటాయి. చంద్రబాబు కొత్త వాగ్ధానాలకు ఏడాదికి రూ.73 వేల కోట్లు అవుతుంది. ఇప్పటివరకు ఇచ్చిన వాగ్ధానాలకు రూ.లక్షా 26 వేల 140 కోట్లు అవుతుంది. మనం ఏడాదికి రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తే శ్రీలంక అయిపోతుందని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. మరి వాళ్లు అమలు చేస్తే రాష్ట్రం ఏమవుతుంది?.  

 
దీనిపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరగాలని కోరుతున్నా. ఏమైనా అంటే చంద్రబాబు సంపద సృష్టిస్తాడని అంటారు. చంద్రబాబు సీఎం అయితే రాష్ట్రంలో రెవెన్యూ ద్రవ్య లోటు వాగ్ధానాలు అమలు చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదు. చేయలేనివి చెప్పకూడదు.. మాట ఇస్తే తప్పకూడదు. విశ్వసనీయతకు అర్ధం జగనే. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను అమలు చేశాం. మేలు చేశాం కాబట్టే ప్రతి గడపకు ధైర్యంగా పోగలుగుతున్నాం అని సీఎం జగన్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement