Maharashtra Politics: బారామతిలో ప‘వార్‌’! | Sakshi
Sakshi News home page

Maharashtra Politics: బారామతిలో ప‘వార్‌’!

Published Sun, Feb 18 2024 4:44 AM

Lok Sabha polls 2024: Sunetra Pawar vs Supriya Sule in Baramati - Sakshi

ఎన్సీపీ పార్టీని చీల్చి బీజేపీ ప్రభుత్వంలో చేరి ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టిన అజిత్‌ పవార్‌.. తన భార్యను రాజకీయ అరంగేట్రం చేయిస్తున్నారా? అందులోనూ దిగ్గజ నేత శరద్‌పవార్‌ కుమార్తె, సిట్టింగ్‌ ఎంపీ సుప్రియా సూలే ప్రాతినిధ్యం వహిస్తున్న‘బారామతి’ నుంచే బరిలో దింపుతున్నారా? అంటే ఎన్సీపీ వర్గాలు అవుననే అంటున్నాయి.

ఈ వార్తలను బలం చేకూరుస్తూ ఇప్పటికే కొన్ని చోట్ల ‘బారామతి ఎంపీ సునేత్రా పవార్‌’ అంటూ భారీ హోర్డింగ్‌లనూ పెట్టేశారు. ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి అనే పుకార్లు బారామతి నియోజకవర్గంలో షికార్లుచేస్తున్నాయి. అసలు సునేత్రా పేరు తెరమీదకు ఎందుకొచి్చంది? అనే ప్రశ్నకు ఆమె భర్త అజిత్‌ వ్యాఖ్యల్లో సమాధానం దొరుకుతుంది. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో డెప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ భావోద్వేగంతో చేసిన ప్రసంగం ఈ వార్తలకు బలం చేకూర్చింది.

బారామతి లోక్‌సభ స్థానం నుంచి ఎవరిని నిలపబోతున్నారో ఆయన స్పష్టంగా చెప్పకపోయినా.. ‘ ఈసారి బారామతిలో కొత్త అభ్యరి్థని నిలుపుతాం. తొలిసారి పోటీచేస్తున్న అభ్యరి్థ.. మన భవిష్యత్‌ తరాల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పనిచేయగలరు. కొందరు ‘పాత’ భావోద్వేగాలతో ఓటేయాలని మిమ్మల్ని అడుగుతారు. పట్టించుకోకండి. జరగబోయే నిరంతర అభివృద్ధిని మాత్రమే దృష్టిలో పెట్టుకోండి.

మొదటిసారి పోటీచేస్తున్నా ఆశీర్వదించండి. అభివృద్ధిని గెలిపించండి’ అని పిలుపునిచ్చారు. వెంటనే భార్య సునేత్రనే ఆయన రంగంలోకి దింపబోతున్నారని భావించిన ఎన్సీపీ పార్టీ వర్గాలు ఆ నియోజకవర్గం ప్రధాన కూడళ్లలో భారీ హోర్డింగ్‌లు పెట్టేశాయి. కాబోయే ఎంపీ సునేత్రా పవార్‌ అని రాసి ఉన్న ప్లెక్సీలతో బారామతిలో అప్పుడే ఎన్నికల కోలాహలం మొదలైంది. శరద్‌పవార్‌ కుటుంబానికి కంచుకోట ఈ నియోజకవర్గం. ఇక్కడ ఎన్సీపీ దిగ్గజ నేత శరదపవార్‌ కూతురు సుప్రియా సూలే సిట్టింగ్‌ ఎంపీగా కొనసాగుతున్నారు.

2009 ఏడాది నుంచి అప్రతిహతంగా ఆమె జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆమెను ఢీకొట్టాలంటే తమ కుటుంబానికే చెందిన మహిళా అభ్యర్థి అయితేనే ఎన్నికల రణరంగంలో నెగ్గుకు రాగలరని అజిత్‌ పవార్‌ భావిస్తున్నారు. అందుకే భార్యను బరిలో నిలుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్సీపీ పార్టీని అజిత్‌ పవార్‌ చీలి్చన నేపథ్యంలో పార్టీ ఓటర్లు సైతం రెండు వర్గాలుగా చీలే అవకాశముంది. అప్పుడు సుప్రియా, సునేత్రలలో ఎవరు గెలుపు తలుపు తట్టగలరో వేచి చూడాల్సిందే.

ఎవరీ సునేత్రా?
అజిత్‌ భార్యగా తప్పితే రాజకీయ వర్గాల్లో ఎవరికీ తెలియని పేరు సునేత్ర. ఆమె చాలా సంవత్సరాలుగా సామాజిక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. శరద్‌పవార్‌కు ఒకప్పటి సన్నిహిత నేత, మాజీ మంత్రి పద్మసిన్హా పాటిల్‌ చెల్లెలే ఈమె. ప్రత్యక్ష రాజకీయాలు ఈమెకు కొత్త. ఎని్వరాన్‌మెంట్‌ ఫోరమ్‌ ఆఫ్‌ ఇండియా పేరిట ఒక ఎన్‌జీవోను సునేత్ర నడుపుతున్నారు. సేంద్రీయ వ్యవసాయం, సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని ఈమె అమితంగా ప్రోత్సహిస్తున్నారు. పర్యావరణహిత గ్రామాల స్థాపనకు కృషిచేస్తున్నారు.

ప్రముఖ విద్యాసంస్థ ‘విద్యా ప్రతిష్ఠాన్‌’కు ట్రస్టీగా ఉన్నారు. ఫ్రాన్స్‌లోని మేథో సంస్థ వరల్డ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌íÙప్‌ ఫోరమ్‌లో 2011 నుంచి భాగస్వామిగా కొనసాగుతున్నారు. అయితే ఈమె మెల్లిగా ప్రచారకార్యక్రమాలు మొదలెట్టినట్లు తెలుస్తోంది. 2019లో సుప్రియాపై పోటీచేసి ఓడిపోయిన బీజేపీ మహిళా అభ్యర్థి కంచన్‌ రాహుల్‌ కౌల్‌ను ఈవారమే కలిసి చర్చించారని వార్తలొచ్చాయి. అజిత్, సునేత్రలకు ఇద్దరు కుమారులు. జై పవార్, పార్థపవార్‌. 2019లో మావాల్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి పార్థపవార్‌ ఓటమిని చవిచూశారు.

కంచుకోట బారామతి
పవార్‌ల కుటుంబానికి పుణె జిల్లాలోని బారామతి పెట్టనికోట. గత 55 సంవత్సరాలుగా ఇక్కడ వీరిదే హవా. తొలిసారిగా మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 1967లో బారామతి ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి పోటీచేసి శరద్‌పవార్‌ గెలిచారు. తర్వాత 1972, 1978, 1980, 1985, 1990 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే స్థానంలో ఘన విజయం సాధించారు. ఇదే బారామతి లోక్‌సభ స్థానం నుంచీ శరద్‌పవార్‌ 1984, 1996, 1999, 2004 ఎన్నికల్లో విజయఢంకా మోగించారు.

అజిత్‌ పవార్‌ సైతం 1991లో ఇదే లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడి నుంచి అజిత్‌ ఏకంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం బారామతి ఎమ్మెల్యే అజితే. 2009 నుంచి సుప్రియా సూలే ఇక్కడ ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. ఇక్కడ ఈసారి సునేత్రను దింపితే స్పష్టంగా ‘పవర్‌’ప్లే మొదలైనట్లే. పెదనాన్న కొడుకైన అజిత్‌.. సుప్రియాకు అన్నయ్య అవుతారు. ఆ లెక్కన వదినా, మరదళ్ల పోరులో గెలుపెవరిదో చూడాలి మరి!

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement
Advertisement