Telangana News: అక్కడ అన్నీ ఉన్నాయ్‌.. అధికారుల నిర్లక్ష్యంతో సహా!
Sakshi News home page

అక్కడ అన్నీ ఉన్నాయ్‌.. అధికారుల నిర్లక్ష్యంతో సహా!

Published Thu, Nov 30 2023 1:40 AM

- - Sakshi

రామగుండం: సహజ వనరులకు కొదవ లేదు.. శ్రామిక శక్తికి ఏలోటూ లేదు.. స్థలం కొరత అంతకన్నా లేదు.. నిధుల విడుదలలో ఏమాత్రం జాప్యం కావడంలేదు.. ఉన్నదంతా నిలువెల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే.. అందుకే రామగుండం పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది.

తొలి థర్మల్‌ విద్యుత్‌ రామగుండంలోనే..
►ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే తొలి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం రామగుండంలోనే నిర్మించారు.అంటే రామగుండం పారిశ్రామి ప్రాంతం ప్రాధాన్యత ఎంతఉందో అర్థం చేసుకోవచ్చు.
►ఎన్టీపీసీ, బీ–థర్మల్‌, రైల్వేస్టేషన్‌, సింగరేణి బొగ్గు గనులు, ఎరువుల తయారీ కంపెనీ, సిమెంట్‌ కంపెనీ తదితర పరిశ్రమలు రామగుండం పేరిట స్థాపించారు.
► రాముడు సీతను నడియాడిన నేల కూడా ఇక్కడే ఉంది.
► రాముడు–సీతాదేవి సంచరించిన ఆనవాళ్లు ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నాయని చర్రికారులు చెబుతున్నారు.
►ఇందుకు నిదర్శనంగా భక్తులు ఆయా ప్రాంతాలను దర్శించుకొని పునీతులవుతున్నారు.

పర్యాటకంపై దృష్టి సారిస్తే..
పట్టణ సమీపంలోని రామునిగుండాల ఆధ్మాత్మికంగా, పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. రామలక్ష్మణుడు, సీతాదేవి ఇక్కడ సంచరించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఈ కొండపై 108 గుండాలు ఉండగా ఇందులో ఒకగుండం 200 అడుగుల లోతు, 50 అడుగుల వెడల్పుతో ఓలోయ ఉంది.

రాముడు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు పాదముద్రల స్థానంలో ఏర్పడిన గుంతలు గుండాలుగా మారి రామగుండంగా పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు. 108 గుండాల్లో అన్నికాలాల్లోనూ నీరు సమృద్ధిగా లభిస్తూ ఉండడం ఇక్కడి విశేషం. ఇందులో ప్రధానమైనవి పాలగుండం, నేతిగుండం, జీడిగుండం, పసుపుగుండం, తొక్కుడుగుండం, యమగుండం, ధర్మగుండం, మోక్షగుండం ఉన్నాయి.

కొండపై లోయ.. సొరంగం..
►రామునిగుండాల కొండపై లోయ మధ్యలో సొరంగ మార్గం ఉంది. దీనిని యమకోణమని పేర్కొంటారు.
►ఈ సొరంగం గుండా నిత్యం నీరు పారుతూ ఉంటుంది.
► ప్రతీ శ్రావణ, కార్తీకమాసంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీసీతారామ లక్ష్మణులను దర్శించుకుంటారు.
►ఇంతటి ప్రాధాన్యం కలిగిన రామునిగుండాలను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ఎవరూ ఆసక్తి చూపడంలేదు.
► కొత్త జిల్లాల ఆవిర్భావం సందర్భంగా రామగుండం ప్రాధాన్యం గుర్తించి దీని పేరిటనే జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తారని భావించినా జాబితాలో ఆ పేరు లేకపోవడంతో ప్రజలు అసంతృప్తికి లోనయ్యారు.

మూలనపడ్డ ప్రణాళిక..
రామునిగుండాలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అప్పటి మున్సిపల్‌ పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. ఈక్రమంలో 2007లో అప్పటి మున్సిపల్‌ చైర్మన్‌ రామునిగుండాలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఇస్కాన్‌ సంస్థను సంప్రదించారు.

రూ.200 కోట్ల అంచనా వ్యయంతో హైదరాబాద్‌లోని బిర్లా మందిర్‌ తరహాలో దేవాలయం, కొండకింద నుంచి పైకి రోప్‌వే నిర్మాణం తదితర పనులు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇస్కాన్‌ ప్రతినిధులు కూడా క్షేత్రసందర్శనకు రాగా అటవీశాఖ అధికారుల అభ్యంతరంతో అభివృద్ధికి ఆటంకాలు ఎదురయ్యాయి. భూ వివాదాస్పద అంశాలతో ఇస్కాన్‌ సంస్థ ముందుకు రాలేదు.

అభివృద్ధికి ఆమడదూరం
రామునిగుండాలను అభివృద్ధి చేసేందుకు అటవీ భూముల సాకుతో అభివృద్ధికి నోచుకోకపోవడం లేదు. ఆధ్యాత్మిక చరిత్ర క లిగిన ప్రాంతాలను వివక్ష లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేయాలి. ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అర్హత ఉన్నా పాలకుల ఆధిపత్య ధోరణితో అభివృద్ధికి దూరంగా ఉంది.
– భట్టు ప్రసాద్‌, పట్టణవాసి

అవకాశం ఉన్నా..
రామగుండం పేరిట ఉన్న ప్రతీ పరిశ్రమకు సామాజిక బాధ్యత పథకం (సీఎస్‌ఆర్‌)కింద నిధులు విడుదల చేసి అభివృద్ధి పరిచే అవకాశం ఉంది. కానీ తమ స్వార్థ రాజకీయాల కోసం ఇక్కడి పరిశ్రమల నుంచి వచ్చే సీఎస్‌ఆర్‌ నిధులను పాలకులు వేరే ప్రాంతాలకు తరలించుకెళ్లారు. ఏ ప్రాంతమైనా ఆధ్యాత్మిక, పర్యాటకంగా అభివృద్ధి చేస్తే అన్ని రంగాలు ప్రగతి సాధిస్తాయి. – ముస్త్యాల శంకర్‌లింగం, పట్టణవాసి

Advertisement
 

తప్పక చదవండి

Advertisement