సచివాలయాల సేవలు అమోఘం! | Sakshi
Sakshi News home page

సచివాలయాల సేవలు అమోఘం!

Published Fri, Oct 27 2023 4:08 AM

Sakshi Guest Column On Village Secretariat Services in AP

ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్న రాష్ట్ర ప్రభుత్వం, దాని అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆశయం మేరకు ఇప్పటి వరకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా  గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఆవిర్భవించింది. ఏ మాత్రం అవినీతికీ, వివక్షకూ తావు ఇవ్వకుండా పరిపాలన ప్రజలకు చేరువ కావాలన్న ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ ఈ సచివాలయ వ్యవస్థకు నాలుగేళ్ల క్రితం శ్రీకారం చుట్టారు. అద్భుతమైన ఫలితాలిస్తున్న ఈ వ్యవస్థను అధ్యయనం చేయడం కోసం అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ పరిశీలనా బృందాలను పంపించటం గమనార్హం. 

కాగా రాష్ట్రంలో ఉన్న మొత్తం 15004 గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి సుమారు 500 సేవలు అందుబాటులోకి వచ్చాయి. పింఛన్, రేషన్‌ కార్డులు, ఇంటి పట్టాలు, సివిల్‌ పనులకు సంబంధించిన పనులు, వైద్యం, ఆరోగ్యం,  రెవిన్యూ సమస్యలు, భూముల సర్వే, శిశు సంక్షేమం, డెయిరీ, పౌల్ట్రీ వంటి  అనేక అంశాలకు సంబంధించిన సేవలు ఇందులో ఉన్నాయి.

ఈ సేవల కోసం ప్రజలు గ్రామ సచివాలయాల్లో అర్జీ పెట్టుకున్న 72 గంటల్లోనే సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్దేశించింది. సదాశయంతో నెలకొల్పిన ఈ గ్రామ, వార్డు సచివాలయాలు వలంటీర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకూ; ప్రజాసమ స్యలు ప్రభుత్వానికీ తెలియజేసి ప్రజలకూ– ప్రభుత్వానికీ మధ్య వారధిగా ఈ వలంటీర్లు వ్యవహరిస్తున్నారు.  

అర్హత ఉన్నవారెవరైనా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందని సందర్భంలో వలంటీర్‌ ద్వారా ప్రయత్నించి çపొందవచ్చు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రకటించిన ‘నవరత్నాలు’ పథకం కింద లబ్ధిదారుల ఎంపికలో ఈ సచివాలయాల పాత్ర అనన్యం. 

ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ బాధ్యత తీసుకునే విధంగా ఈ గ్రామ, వార్డు సచివా లయ వ్యవస్థ రూపొందించబడింది. సమస్త ప్రభుత్వ సేవలూ, పథకాలను వలంటీర్ల ద్వారా సచివాలయ వ్యవస్థ ప్రజల గడప ముందుకు తీసుకువెళ్లడం దేశాన్ని విస్మయానికి గురిచేస్తోంది. మహమ్మారి కరోనా సమయంలో వలంటీర్లు చేసిన సేవలను ఎవరూ మరచి పోలేరు.  

వీరి సేవలు గుర్తించిన  ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి కొత్తగా చట్టం తీసుకొస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేసింది. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికే అమలులో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం, ఆంధ్రప్రదేశ్‌ మున్సి పాలిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం తరహా లోనే సచివాలయ వ్యవస్థకు కూడా చట్టం రానుంది.

రాజ్యాంగంలోని 11, 12 షెడ్యూళ్లలో పేర్కొన్న ప్రకారం ప్రజలు కేంద్రంగా ప్రభుత్వ సేవలు, ఇతర సదుపాయాలను అందించేందుకు ఈ చట్టం ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల పేరుతో కొత్త వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నట్టు ఆర్డినెన్స్‌ పేర్కొంటోంది. ఈ ఆర్డినెన్స్‌తో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందజేసే ప్రభుత్వ సేవలు, గ్రామ, వార్డు సచివాలయ శాఖ ద్వారా జారీచేసే ఉత్త ర్వులు శాసనాధికారంతో కూడినవయ్యాయి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియా మకానికి చట్టబద్ధత లభించింది.

2019 అక్టోబర్‌ 2న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అమలులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రెండు వేల జనాభాకు, అలాగే పట్టణ ప్రాంతాల్లో ప్రతి 4 వేల జనాభాకు ఒక సచివాలయం చొప్పున ఏర్పాటయ్యాయి. అయితే ఈ వ్యవస్థపై కొందరు అనవసర విమర్శలు చేయడం శోచనీయం.

చలాది పూర్ణచంద్రరావు 
వ్యాసకర్త  సీనియర్‌ జర్నలిస్ట్‌
మొబైల్‌: 94915 45699

Advertisement
Advertisement