పంటలన్నిటికీ ఒకే విధానం సాధ్యమా? | Sakshi
Sakshi News home page

పంటలన్నిటికీ ఒకే విధానం సాధ్యమా?

Published Tue, Feb 27 2024 12:01 AM

Sakshi Guest Column On Farmers Protest

కనీస మద్దతు ధరకు చట్టబద్ధతను కల్పించాలని చేస్తున్న రైతుల ఉద్యమం ఇప్పటికీ ఆగడం లేదు. కేంద్ర ప్రభుత్వంతో వారి చర్చలు సఫలం కాలేదు.వారి డిమాండ్లు నెరవేరుతాయా? అన్ని పంటలకూ ఒకే విధానం అమలుచేయడం సాధ్యమేనా అన్నవి తలెత్తే ప్రశ్నలు. ప్రకటించిన 23 పంటలకు కనీస మద్దతు ధరను అమలు చేసినట్టయితే దాని ప్రభావం ఇతర అంశాలపైన, ముఖ్యంగా ఆర్థిక రంగంపైన ఉంటుందన్నది ఒక వాదన. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం కంటే మెరుగ్గా ఉండే విధంగా ‘ప్రైస్‌ స్టెబిలైజేషన్‌ ఫండ్‌’ (ధరల స్థిరీకరణ నిధి) ఏర్పాటు చేయాలని కొందరు సూచిస్తున్నారు. దీనివల్ల రైతాంగానికి మంచి మద్దతు అందుతుంది.

2024 రైతు ఉద్యమంలో ఉధృతి తక్కువే. కానీ ప్రశ్నలు ఎక్కువ. మూడు రైతు సంస్క రణ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకున్నప్పటికీ రైతుల పేరిట జరుగుతున్న ఉద్యమం ఆగడం లేదు. కేవలం రెండు రాష్ట్రాల (పంజాబ్, హరియాణా) రైతులే ఇందులో ఎందుకు పాల్గొంటు న్నారు? కేంద్రం చర్చలకు పిలిచిన ప్రతిసారీ డిమాండ్లు ఎందుకు మారుతున్నాయి? అసలు చర్చలు సఫలమయ్యే దిశగా డిమాండ్లు ఉన్నాయా? ఎన్నికల ముందు మొదలైన చలో ఢిల్లీ రైతు ఉద్యమం బీజేపీ విజయావకాశాలను దెబ్బ తీసేందుకేనన్న విమర్శ మాటేమిటి? ఈ మేరకు ఒక రైతు నేత మాటలతో బయటపడిన వీడియో (మోదీ ప్రతిష్ఠను దించడమే ధ్యేయం అంటూ) మాటేమిటి? నిజానికి రెండేళ్ల నాటి రైతు ఉద్యమమమే చాలా అనుమానాలనే మిగిల్చింది.

ఆఖరికి ‘టూల్‌–కిట్‌’ సాలెగూడులో కూడా రైతు ఉద్యమం చిక్కుకుంది. రైతు ఉద్యమ మంటే రైతుకు సాయపడాలి. రాజకీయాలకు కాదు. జాతి వ్యతిరేక శక్తులకు అసలే కాదు. ఐదు పంటలకు మద్దతు ధరను ఐదేళ్ల పాటు అమలు చేస్తామని కేంద్ర బృందం హామీ ఇచ్చింది. మొదట ఒప్పుకున్నట్టే ఒప్పుకున్న రైతు సంఘాలు, పంటల సంఖ్యను పెంచాయి.

కనీస మద్దతు ధర (మినిమమ్‌ సపోర్ట్‌ ప్రైస్‌– ఎంఎస్‌పీ)కి  చట్ట బద్ధత కల్పించాలనే ప్రధాన డిమాండ్‌ తోపాటు ఇతర అంశాలపైన ప్రభుత్వం తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌ (కొన్ని ప్రాంతాలు)కు చెందిన రైతులు దాదాపు 200 యూనియన్లతో ఢిల్లీపైన దండయాత్రకు సిద్ధ మయిన నేపథ్యంలో, కేంద్రం చర్చలకు సిద్ధమైంది. చండీఘడ్‌లో నాలుగు దఫాలుగా సాగిన చర్చలు ఎలాంటి ఫలితాన్నీ ఇవ్వలేదు. 

ఎంఎస్‌పీ ప్రభుత్వాల వ్యవసాయ ధరల నిర్ణయం విధానంలో భాగం. ఇది పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయటానికి నిర్దేశించే ధర. స్వామినాథన్‌ కమిషన్‌ కనీస మద్దతు ధరకు సిఫార్సు చేసింది. మొత్తం పంతొమ్మిది వందల పేజీలతో ఐదు నివేదికలు సమ ర్పించింది. కానీ రైతు నేతలు చెబుతున్నట్టు ఎంఎస్‌పీకి  చట్టబద్ధత, లేదా దాని లెక్కింపు సూత్రాల గురించి ప్రతిపాదించలేదు. ఎంఎస్‌పీ పంట వ్యయానికి 50 శాతం అధికంగా ఉండాలని సూచించింది. 

రైతు సంఘాలు కోరే 23 పంటలకు ఎంఎస్‌పీ అమలు కష్టమని నిపుణులు, విశ్లేషకులు మొదటినుంచీ చెబుతున్నారు. ఆ నిర్ణయం ఆర్థిక రంగంపైన చూపించే ప్రభావం నేపథ్యంలో అన్ని పంటలకు ఒకే విధానం సరికాదన్నది బలంగా వినిపిస్తున్న వాదన. ఎంఎస్‌పీ భద్రత చట్టాన్ని అమలు చేయాలంటే, ప్రభుత్వం ఏటా రూ. 12 లక్షల కోట్లు అదనపు వ్యయాన్ని భరించాలి. అది సాధ్యం కాదని కేంద్రం కూడా చెబుతోంది. ప్రభుత్వం గనక ఎంఎస్‌పీ ప్రకటించిన 23 పంటలను కొనుగోలు చేసినట్టయితే అనేక అంశాలపైన దాని ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో  రైతుల ఎదుటికి కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు కూడా వచ్చాయి. ఎంఎస్‌పీకి చట్టబద్ధత కంటే మెరుగ్గా ఉండే విధంగా ‘ప్రైస్‌ స్టెబిలైజేషన్‌ ఫండ్‌’(ధరల స్థిరీక రణ నిధి) ఏర్పాటు చేయాలని కొందరు సూచిస్తున్నారు. ఎంఎస్‌పీ కంటే ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని ఉత్పత్తిలో కొంత భాగాన్ని ప్రొక్యూర్‌ చేసి రైతులకు న్యాయబద్ధమైన ధరను అందిస్తుంది. దీనివల్ల రైతాంగానికి మంచి మద్దతు అందుతుంది. 

2024 రైతు ఉద్యమం 2020 నాటి ఆందోళనకు కొనసాగింపుగా కాకుండా, ఒక వివాదం పొడిగింపుగానే కనిపిస్తోంది. 2020 నాటి ఆందోళన కేంద్రం తెచ్చిన మూడు రైతు చట్టాలకు వ్యతిరేకం. వాటిని కేంద్రం 2021లో రద్దు చేసింది. అప్పట్లో ప్రభుత్వం రైతుల డిమాండ్ల మేరకు ఆందోళన చేసిన రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయటానికి అంగీకరించింది. కానీ కనీస మద్దతు ధరకు చట్టబద్ధతకు సంబంధించి ఎలాంటి హామీ ఇవ్వలేదు. కానీ నేటి ఢిల్లీ చలో ఉద్దేశం వేరు.

ఆందోళనకు ముందే ఈ అంశం మీద చర్చించటానికి కేంద్రం సిద్ధమైంది. అన్ని పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ ఇవ్వాలనీ, రైతులకు  రుణహామీ, పెన్షన్‌ సదుపాయాలు కల్పించా లనీ, స్వామినాథన్‌ కమిషన్‌ ఫార్ములాను అమలు చేయాలనీ రైతు సంఘాలు కోరుతున్నాయి. లఖింపుర్‌ హింసలో బాధితులకు న్యాయం చేయాలనీ, 2013 భూస్వాధీన చట్టాన్ని తిరిగి ప్రవేశ పెట్టాలనీ, 2020–21 ఆందోళనల్లో చనిపోయిన రైతులకు పరిహారం అందించాలనీ కూడా కోరుతున్నారు.

2020లో ఈ నిరసనకు భారతీయ కిసాన్‌ యూనియన్, సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకత్వం వహించాయి. ఇప్పుడు వివిధ యూని యన్లు నడిపిస్తున్నాయి. 2020 మాదిరిగా కేంద్రం రైతు సంఘాలను ఢిల్లీలోకి అడుగు పెట్టనీయలేదు. ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలోనే ఆపేసింది. ఆందోళన నాలుగో రోజున, 63 ఏళ్ల జియాన్‌ సింగ్‌ మర ణించారు. రైతుల ఆందోళన సాగుతున్నతీరు, దానికి ఖర్చవుతున్న తీరు, ట్రాక్టర్ల స్థానంలో కోట్లాది రూపాయల విలువైన వాహనాలు అక్కడకు రావటం వంటివి చూస్తుంటే, ఈ ఆందోళనకు ఎవరు నాయకత్వం వహిస్తున్నారో సులువుగా అర్థం చేసుకోవచ్చునన్న విమర్శలు ఉన్నాయి.

రైతుల ఆందోళన ముసుగులో కొందరు యువకులు ముసు గులు ధరించి భద్రతా సిబ్బంది పైన రాళ్లు విసురుతున్నట్టు తేలింది. హరియాణా పోలీసులు ఆందోళనకారులపైన టియర్‌ గ్యాస్‌ షెల్స్, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించి ‘బలవంతపు చర్యలకు’ పాల్పడటంతో అనేక మంది గాయపడ్డారని రైతు నేతలు ఆరోపించారు. రైతుల, యూట్యూబర్ల సోషల్‌ మీడియా ఎకౌంట్లను రద్దు చేయటం ద్వారా ప్రభుత్వం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని రైతు నేత సరవన్‌ సింగ్‌ పాంథర్‌ ఆరోపించారు. 

కేంద్రం మీద నిందంతా మోపుతున్నవారు గమనించవలసిన అంశాలు కూడా ఉన్నాయి. పంజాబ్‌– హరియాణా సరిహద్దుల్లో రైతు లకు, భద్రతా సిబ్బందికి మధ్య ప్రతిష్టంభన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నాలుగు దఫాలుగా చర్చలు నిర్వహించింది. రైతు నేతలు కేంద్రమంత్రుల మధ్య (ఫిబ్రవరి 8, 12, 15, 18) చర్చలు జరిగాయి. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి అర్జున్‌ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయెల్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ పాల్గొన్నారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ మాన్, వ్యవ సాయశాఖ మంత్రి గుర్మీత్‌ సింగ్‌ కూడా పాల్గొన్నారు. ఈ చర్చలు ఎలాంటి ఫలితాన్నీ ఇవ్వలేదు. ట్రాలీలతో కూడిన ట్రాక్టర్లు జాతీయ రహదారుల మీద కనిపించకూడదు. దానిని రైతులు ఉల్లంఘించారు. ఇంకా చాలా విషయాలలో చట్టాన్ని చేతుల్లోకి తీసు కుంటున్నారు.

కాగా 23 పంటలకు ఒకే విధమైన విధానం సాధ్యం కాదని ఎవరైనా అంగీకరించాలి. కొత్తగా మళ్లీ, పాడి రైతుల సమస్యలను ఈ ఆందోళన ఎందుకు పట్టించుకోదన్న ప్రశ్న మొదలయింది. ఇంకా చేపల చెరువుల రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదన్న విమర్శ కూడా ఉంది. ఇప్పుడు కనీస మద్దతు ధర శాశ్వతంగా ఇవ్వాలని రైతులు చెబుతున్న 23 పంటలు మొత్తం వ్యవసాయంలో 30 శాతం లోపే.

మరి మిగిలిన వ్యవసాయోత్పత్తుల మాటేమిటి? ఈ ప్రశ్నకు రైతు నేతల నుంచి సమాధానం రావాలి. ఏమైనా రైతుల సమస్యల పేరుతో రాజకీయ లబ్ధిని పొందాలని కొన్ని బీజేపీయేతర పక్షాలు కోరుకుంటున్నాయి. అందుకు అవి ఎంచుకున్న మార్గం రోడ్ల మీద తేల్చుకోవడం. రైతు సమస్యల పరిష్కారం అంటే రైతులకు చెడ్డపేరు తేవడం కాదు. వారి మీద దారుణ ముద్ర పడేలా చేయడం కాదు.

పి. వేణుగోపాల్‌ రెడ్డి 
వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్‌ చైర్మన్‌ ‘ pvg@ekalavya.net

Advertisement
 
Advertisement
 
Advertisement