ప్రేతాత్మలను ప్రత్యక్షంగా చూడటానికి ఎగబడుతున్న జనాలు! | Sakshi
Sakshi News home page

Gurdon Ghost Light: చీకట్లో దారి చూపించే దెయ్యం!..గజగజ వణికిస్తున్న మిస్టరీ

Published Mon, Dec 18 2023 10:12 AM

The Mystery Behind Gurdon Ghost Light - Sakshi

చిమ్మచీకటి వణికిస్తుంది. కానీ కొన్ని సార్లు.. ఆ చీకటిని చీల్చే వెలుతురు కూడా వణికిస్తుంది. అమాంతం ప్రత్యక్షమై.. అర్ధాంతరంగా మాయమై.. గజగజ వణికిస్తోన్న ఆ  మిస్టరీ ఏంటీ?

అది దక్షిణ అమెరికా, ఆర్కన్‌సా (Arkansas) రాష్ట్రంలో గుర్డాన్‌ సిటీ. చీకటిపడేవరకు ఆత్రంగా ఎదురుచూసిన.. ఓ నలుగురు చిన్నారులు నక్కి నక్కి.. పాత రైల్‌రోడ్‌ ట్రాక్‌ వైపు అడుగులు వేశారు. కాళ్లకు చెప్పులుంటే అలికిడి అవుతుందని ఒట్టికాళ్లతో మెల్లమెల్లగా నడుస్తూ.. ఓ బండకు ఆనుకుని ఒకరి తల మీంచి మరొకరు తల పెట్టి తొంగి తొంగి చూస్తున్నారు. చీకట్లో నల్లరాయిలా.. వాళ్లు ఎవరికీ కనిపించడం లేదు. వాళ్లకీ ఏమీ కనిపించడం లేదు.‘ఏది వచ్చిందా? ఎక్కడ నుంచి వస్తోంది? ఎలా వస్తోంది? వచ్చేసిందా?’ అనే గుసగుసలు.. వారి గుండె అలికిడి కంటే చిన్నగా వినిపిస్తున్నాయి.

‘అదిగో’ అన్న మాట ఆ నలుగురిలో ఎవరి నుంచి బయటికి వచ్చిందో తెలియదు కానీ.. కాస్త గట్టిగానే వచ్చింది. నిదానిస్తే అది వాళ్ల వైపే దూసుకొస్తోంది. అది, గుండ్రంగా, చిన్నబంతిలా మెరుస్తోంది. దగ్గరకు వచ్చేసరికి వాలీబాల్‌ అంత పెద్దదైపోయింది. కెవ్వుమనే కేకలతో వణుకుతూ నలుగురూ నాలుగు దిక్కులకు పరుగెత్తారు. ఆ అతీంద్రియశక్తికి ‘గుర్డాన్‌ లైట్‌’ అని పేరు పెట్టిన రిపోర్టర్స్‌.. ఈ మిస్టరీని ప్రపంచానికి పరిచయం చేశారు. అదో కాంతి. ఓ దీపం ప్రకాశించినట్లుగా.. మిలమిలా మెరిసిపోతుంది. అది తరుముతూ వెనుకే వస్తుంటే.. పరుగెత్తే వారికి చీకట్లో తోవ కనిపించడమే ఇక్కడ గమ్మత్తైన విషయం.

సీన్‌ కట్‌ చేస్తే.. ఆ నలుగురు పిల్లలకు నాలుగు రోజులు నిద్ర లేవలేదు. అది ఆ నలుగురి అనుభవం మాత్రమే కాదు. చాలా ఏళ్లుగా గుర్డాన్‌ వాసుల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలామందికి కలిగిన వింత అనుభవం. ఈ హడలెత్తించే కథనాలను విన్న వారంతా దీని వెనుకున్న ఉదంతాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించినవారే. అయితే పోలీస్‌ రికార్డుల్లో నిక్షిప్తమైన ఆ వ్యథ.. విన్నవారిని ఇంకాస్త బెదరగొడుతుంది. 1931 డిసెంబరు 10న విలియమ్‌ మెక్‌క్లెయిన్‌ అనే వ్యక్తిని తన కింద పనిచేసే 38 ఏళ్ల లూయీ మెక్‌బ్రైడ్‌.. గుర్డాన్‌ రైల్‌రోడ్‌ ట్రాక్‌ సమీపంలో నరికి చంపేశాడు. అయితే మొదట అనుమానితుడిగా అరెస్ట్‌ అయిన లూయీ.. చివరికి స్వయంగా తన నేరాన్ని అంగీకరించాడు. దాంతో కోర్టు ఉరిశిక్ష విధించింది. అక్కడితో లూయీ కథ కూడా ముగిసింది.

అయితే మెక్‌క్లెయిన్‌ హత్య జరిగిన చోట దాదాపు పావు మైలు పొడవున రక్తపు అడుగుజాడలు ఉన్నాయని.. లూయీ దాడి నుంచి తప్పించుకోవడానికి మెక్‌క్లెయిన్‌ చాలా ప్రయత్నించాడని.. చేతిలో లాంతరు పట్టుకుని.. ప్రాణాలు నిలుపుకోవడానికి పరుగులు తీశాడని.. పోలీస్‌ క్రైమ్‌ రికార్డ్‌లో ఉంది. తల తెగిన కారణంగానే మరణం సంభవించిందని పోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్‌ తేల్చింది. అయితే మెక్‌క్లెయిన్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు.. అతడి పిడికిలి పట్టులో లాంతరు ఉండటమే కీలకంగా మారింది. నాటి నుంచి ఆ సమీపంలో గుర్డాన్‌ ఘోస్ట్‌లీ లైట్‌.. స్థానికులను పరుగులెత్తిస్తోందనేది చాలామంది నమ్మకం. తెగిపడిన తన తలను వెతుక్కోవడానికే మెక్‌క్లెయిన్‌ ఆత్మ లాంతరు పట్టుకుని.. ఆ పరిసరాల్లోనే తిరుగుతోందనే ప్రచారం మొదలైంది.

ఈ దయ్యం కాంతి.. భూమి నుంచి 3 అడుగుల ఎత్తులో ఉరకలేస్తుందని.. ముందుకు వెనక్కు కదులుతుందని, కొన్ని సార్లు పసుపు, నారింజ, నీలం, ఎరుపు రంగుల్లో కనిపిస్తోందని సాక్షులు చెప్పారు. అయితే ఇది ఏంటి అనేది మాత్రం ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. గుర్డాన్‌ నివాసి మార్తా రామీ అనే ప్రత్యక్ష సాక్షి.. ‘నేను కూడా చిన్నప్పుడు ఆ దీపాన్ని చూడటానికి రాత్రి పూట స్నేహితులతో వెళ్లాను. అది నన్ను తరమడం నాకు ఇప్పటికీ గుర్తుంది’ అని చెప్పుకొచ్చింది.ఈ లైట్‌ దయ్యం కాదని.. పీజో ఎలక్ట్రిక్‌ ప్రభావం అంటూ కొందరు వాదన లేవదీశారు.

స్ఫటికాలు, సిరామిక్స్‌ వంటి కొన్ని పదార్థాలకు తేమగాలులు సోకినప్పుడు ఒత్తిడికి గురై.. విద్యుదుత్పత్తి జరుగుతుందని.. ఆ వెలుతురుని చూసి చాలామంది భయపడుతున్నారని వారు తేల్చేశారు.బాబ్‌ థాంప్సన్‌ అనే క్లార్క్‌ కౌంటీ హిస్టారికల్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌.. దీనిపై ఎన్నో పరిశోధనలు చేశాడు.  ‘మేము ఒక రకమైన ఎర్రటి, బంగారు కాంతిని చాలాసార్లు చూశాం. అది చూడటానికి ఎవరో ఒక బేస్‌బాల్‌ క్యాప్‌తో ఫ్లాష్‌లైట్‌ని కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. కాసేపటికి అదృశ్యమైపోతుంది.

కొన్నిసార్లు ఆ బాల్‌ లాంటి కాంతి.. స్వింగ్‌ అవుతున్నట్లుగా వలయాల్లా కనిపిస్తుంది. ఎంతటి ధైర్యవంతులైనా అది చూసి భయపడతారు’ అని చెప్పుకొచ్చారు. అయితే  ప్రేతాత్మలను ప్రత్యక్షంగా చూడాలనుకునేవారు మాత్రం ఇక్కడకు ఎగబడుతూ ఉంటారు.ఇప్పటికీ చాలామంది ఆ వెలుగును చూసి జడుసుకుంటూంటారు. ఏదేమైనా ఈ కాంతికి అసలు కారణం తేలియకపోవడంతో ఈ ఘోస్ట్‌ లైట్‌ మిస్టరీగానే మిగిలిపోయింది.

-సంహిత నిమ్మన

Advertisement
 
Advertisement
 
Advertisement