రత్నగిరికి కల్యాణశోభ | Sakshi
Sakshi News home page

రత్నగిరికి కల్యాణశోభ

Published Wed, May 15 2024 5:00 AM

-

18 నుంచి సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలు

24 వరకూ నిర్వహణ

19వ తేదీ రాత్రి స్వామివారి కల్యాణం

అన్నవరం: సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడే అనంతలక్ష్మీ సత్యవతీదేవి సమేతుడై వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రంగా అన్నవరం ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ పావన పంపా నదీ తీరాన రత్నగిరిపై వెలసిన భక్తవరదుడు.. శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి వారి వార్షిక దివ్యకల్యాణ మహోత్సవాలకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వామివారికి ఎడమ భాగాన లక్ష్మీదేవి అంశగా దేవేరి శ్రీ అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, కుడివైపున శంకరుడు ఒకే పానవట్టంపై దర్శనమిచ్చే దివ్యధామం ఈ హరిహర క్షేత్రం. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా సత్యదేవుని ఖ్యాతి జగద్విఖ్యాతం.

కల్యాణోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

రత్నగిరిపై సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలు ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకూ అంగరంగ వైభవంగా నిర్వహించడానికి దేవస్థానం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 19వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 11.030 గంటల వరకూ స్వామివారి దివ్య కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. సత్యదేవుని కల్యాణ మహోత్సవ ఏర్పాట్లపై గత నెల 28వ తేదీన పెద్దాపురం ఆర్‌డీఓ జె.సీతారామారావు అధ్యక్షతన అన్నవరం దేవస్థానం ఈఓ కె.రామచంద్రమోహన్‌, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, దేవస్థానం అధికారులతో సమీక్ష నిర్వహించారు. విభాగాల వారీగా కార్యాచరణ రూపొందించారు.

నిత్య కల్యాణాలు రద్దు

కల్యాణోత్సవాల ఏర్పాట్లపై దేవస్థానం అధికారులతో ఈఓ కె.రామచంద్ర మోహన్‌ గడచిన వారం రోజుల్లో రెండుసార్లు సమావేశమై ఏర్పాట్లు పురోగతిపై చర్చించారు. కల్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అందరూ కృషి చేయాలని ఆదేశించారు. ప్రధానంగా 19వ తేదీన జరిగే స్వామివారి కల్యాణం, 22న జరిగే రథోత్సవం సందర్భంగా తీసుకోవలసిన చర్యలపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు. వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాల సందర్భంగా ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకూ సత్యదేవుని నిత్య కల్యాణాలను రద్దు చేశారు. ఈ నెల 25 నుంచి తిరిగి ఈ కల్యాణాలు నిర్వహిస్తారు.

సీతారాములే పెళ్లి పెద్దలు

భద్రాద్రి రాముని కల్యాణోత్సవం తరువాత తెలుగు రాష్ట్రాల్లో అంత ప్రాముఖ్యత కలిగిన వేడుక సత్యదేవుని దివ్యకల్యాణం. ఈ వేడుకకు సీతారాములే పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు. అన్నవరం క్షేత్ర పాలకునిగా శ్రీరాముడు పూజలందుకుంటున్న విషయం తెలిసిందే. ఆ హోదాలో సత్యదేవుని కల్యాణోత్సవాలకు సీతారాములే పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తూండటం ఇక్కడి సంప్రదాయం.

ఇదీ కల్యాణోత్సవాల క్రమం

ఫ మే 18: వైశాఖ శుద్ధ దశమి శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రధానాలయంలోని అనివేటి మండపంలో అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని, సత్యదేవుడిని వధూవరులుగా అలంకరిస్తారు. అనంతరం రామారాయ కళావేదిక మీద స్వామి, అమ్మవార్లకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు.

ఫ మే 19: వైశాఖ శుద్ధ ఏకాదశి ఆదివారం రాత్రి 9 నుంచి 11.30 గంటల వరకూ రత్నగిరిపై వార్షిక కల్యాణ వేదిక మీద స్వామి, అమ్మవార్ల దివ్య కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. అనంతరం భక్తులకు ప్రసాదం, తలంబ్రాలు పంపిణీ చేస్తారు.

ఫ మే 20: వైశాఖ శుద్ధ ద్వాదశి సోమవారం ప్రధాన స్థాలీపాక హోమాలు, రాత్రి 7 గంటలకు అరుంధతీ నక్షత్ర దర్శనం నిర్వహిస్తారు.

ఫ మే 21: వైశాఖ శుద్ధ త్రయోదశి మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు అనివేటి మండపంలో పండిత సదస్యం నిర్వహిస్తారు.

ఫ మే 22: వైశాఖ శుద్ధ చతుర్దశి బుధవారం సాయంత్రం 5 గంటలకు కొండ దిగువన దేవస్థానం గార్డెన్స్‌లో సత్యదేవుని వనవిహారోత్సవం.

ఫ మే 23: వైశాఖ పౌర్ణమి గురువారం ఉదయం 8.30 గంటలకు పంపా నదిలో స్వామివారి శ్రీచక్రస్నాన మహోత్సవం. సాయంత్రం 4 గంటలకు రత్నగిరిపై అనివేటి మండపంలో నీలలోహిత గౌరీపూజ, నాకబలి, దండియాడింపు, ధ్వజావరోహణం, కంకణ విమోచన కార్యక్రమాలు.

ఫ మే 24: వైశాఖ బహుళ పాడ్యమి శుక్రవారం రాత్రి 7 గంటలకు నిత్య కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లకు శ్రీ పుష్పయాగం కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయి.

ప్రత్యేక ఆకర్షణగా రథోత్సవం

సత్యదేవుని కల్యాణోత్సవాల్లో భాగంగా ఈ నెల 22వ తేదీన నిర్వహించే రథోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. స్వామివారికి రూ.1.04 కోట్ల వ్యయంతో భారీ టేకు రథంపై నిర్మించిన విషయం తెలిసిందే. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు ఈ రథంపై రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ రథాన్ని ఇప్పటికే గత నెల 26న లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆ రథానికి రంగులు వేసే కార్యక్రమంతో పాటు, ఆరు చక్రాలకు పట్టీలు, హైడ్రాలిక్‌ బ్రేకులు, హైడ్రాలిక్‌ జాకీలు, ముందు భాగంలో రెండు గుర్రాలు అమర్చే పనులు చురుకుగా జరుగుతున్నాయి. ఈ పనులన్నీ ఈ నెల 16వ తేదీకల్లా పూర్తి చేసి, ఆ రోజు ఉదయం 9 గంటలకు పూర్తి స్థాయిలో ట్రయల్‌ రన్‌ వేయనున్నారు. దీనికోసం రథం ఉన్న పంపా సత్రం గేట్లు తొలగించి ర్యాంపు ఏర్పాటు చేస్తున్నారు. పంపా సత్రం నుంచి మెయిన్‌ రోడ్డు మీదుగా సత్యదేవుని తొలి పావంచా వద్దకు తీసుకుని వెళ్లి, అక్కడి నుంచి మళ్లీ పంపా సత్రానికి తీసుకుని వస్తారు. రథాలను లాగడంలో అనుభవం కలిగిన ధవళేశ్వరానికి చెందిన నిపుణులను ఈ రథోత్సవానికి తీసుకుని వస్తున్నామని అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement