నేడు తేలికపాటి వర్షాలు   | Sakshi
Sakshi News home page

నేడు తేలికపాటి వర్షాలు  

Published Thu, Mar 21 2024 5:18 AM

Light rains today - Sakshi

బలహీన పడిన ద్రోణి

సీమలో వేడి వాతావరణం

సాక్షి, విశాఖపట్నం: దక్షిణ తమిళనాడు నుంచి పశ్చిమ విదర్భ వరకు.. జార్ఖండ్‌ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో పలుచోట్ల బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు సంభవించాయి. కాగా.. ఉత్తరాంధ్ర వరకు విస్తరించిన ద్రోణి బలహీనపడింది.

మరోవైపు పశ్చిమ విదర్భ వరకు విస్తరించిన ద్రోణి బుధవారం కేరళ నుంచి ఉత్తర తెలంగాణ వరకు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతూ ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాల్లోని ఉపరితల ఆవర్తనం వరకు విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో గురువారం కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం రాత్రి నివేదికలో తెలిపింది.

అదే సమయంలో ఉత్తర కోస్తాలో ఉరుములు, మెరుపులకు ఆస్కారం ఉందని పేర్కొంది. రాయలసీమలో మాత్రం వేడితో కూడిన పొడి వాతావరణం నెలకొంటుందని తెలిపింది. కాగా బుధవారం అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

అత్యధికంగా రాజాం (అనకాపల్లి)లో 5.9 సెం.మీ. వర్షపాతం రికార్డయింది. చొల్లంగి (కాకినాడ)లో 5.4, జగ్గంపేట (కాకినాడ)లో 5.2, కొత్తకోట (అనకాపల్లి)లో 4.7, కిర్లంపూడి (కాకినాడ) 3.5, రాజానగరం (తూర్పు గోదావరి) 3.4, పెదగంట్యాడలో (విశాఖ) 3.2 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.  

Advertisement
Advertisement