Jayapraksh Narayan Supports YS Jagan's Decision Over Providing Free Electricity and Meters to Farmers - Sakshi
Sakshi News home page

ప్రభుత్వ నిర్ణయాల్లో కోర్టుల జోక్యం తప్పు 

Published Fri, Sep 11 2020 8:00 AM

Jayaprakash Narayana Said That Interference Of Courts In Government Decisions Wrong - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజలెనుకున్న ప్రభుత్వాలు విధానపరంగా తీసుకునే నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడాన్ని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్‌ నారాయణ తప్పుబట్టారు. ఓ టీవీ చానల్‌ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేకంగా మన రాష్ట్రం పేరెత్తకుండా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికైన ప్రభుత్వానికి రాజధాని ఎక్కడ ఉండాలనేది నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంది. మంచో చెడో పక్కన పెట్టండి.. మనకు ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం ఒకసారి ఓటువేసి ఎన్నుకున్న ప్రభుత్వం చట్టబద్ధమైన నిర్ణయం తీసుకుంటే నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుంది. కానీ, మీరు చేయకూడదనడం సరైంది కాదు. దానికి కోర్టులుగానీ మరొకటిగానీ పరిష్కారం కాదు’.. అని జయప్రకాష్‌ నారాయణ వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు, కోర్టులు, చట్టసభలు తమతమ పాత్రలు పోషించాలని.. కానీ, మనదేశంలో పలు సందర్భాల్లో కలగాపులగం అయిపోతోందన్నారు. కొన్ని సందర్భాల్లో కోర్టులు ప్రభుత్వ పనిచేస్తున్నాయి.. ప్రభుత్వాలు కోర్టుల్లా వ్యవహరిస్తున్నాయి.. న్యాయ నిర్ణయం మేం చేస్తామంటున్నాయి.. మనకీ గందరగోళం పోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. (చదవండి: ‘అమరావతి’ మా నిర్ణయం కాదు)

మీటర్లు పెట్టడం మంచి నిర్ణయం 
రైతులకు ఉచిత విద్యుత్‌ను అందించే కనెక్షన్లకు మీటర్లు బిగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని జయప్రకాష్‌ నారాయణ సమరి్థంచారు. ‘విద్యుత్‌ రంగంలో నాకు తెలిసి ఒక మంచి ప్రయత్నం జరుగుతోంది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉచిత విద్యుత్‌ ప్రవేశపెట్టినప్పుడు ఆయనతో నేను గట్టిగా వాదించాను. నచ్చజెప్పే ప్రయత్నం చేశా. మీరు ఉచిత విద్యుత్‌ ఇవ్వడంలో తప్పులేదు. కానీ, మీటర్‌ పెట్టమని చెప్పా. కనీసం ఎక్కడ ఖర్చవుతోంది, ఎక్కడ వృథా అవుతోందో మనకు అర్ధమైతే ఎనర్జీ ఆడిటింగ్‌ సరిగ్గా ఉంటుంది.. విద్యుత్‌ను పొదుపు చెయ్యొచ్చు అని చెప్పా. ఆయన మీటర్లు పెట్టాలనే ప్రయత్నం చేశారు. కానీ, మనకెందుకీ గొడవంతా అని కేబినెట్లో అనడంతో విరమించుకున్నారు. ఇప్పుడు జగన్‌ సర్కార్‌ అమలుచేస్తున్నందుకు అభినందిస్తున్నా. కొన్ని రంగాల్లో ఖర్చవుతున్నప్పుడు, అది ఎంతవుతుందో.. ఎక్కడ అవుతున్నదో తెలియకపోయినట్లైతే.. పొదుపు పాటించకపోతే, సాంకేతిక నష్టాన్ని దొంగతనాన్ని నివారించకపోతే ఖజానా ఖాళీ అయిపోతుంది‘.. అని జయప్రకాష్‌ నారాయణ వ్యాఖ్యానించారు. (చదవండి: మరో మాట నిలబెట్టుకున్న సీఎం వైఎస్ జగన్)

Advertisement
 
Advertisement
 
Advertisement