AP: గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల | Group 1 Notification Released In AP, Check Posts Details Inside - Sakshi
Sakshi News home page

AP: గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల

Published Fri, Dec 8 2023 3:35 PM

Group 1 Notification Released In Ap - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర స్థాయిలో అత్యున్నత సర్వీసులైన గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 81 గ్రూప్‌–1 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. గురువారం 897 గ్రూప్‌–2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చిన సర్వీస్‌ కమిషన్‌ తాజాగా గ్రూప్‌–1 పోస్టులకుసైతం నోటిఫికేషన్‌జారీ చేసింది. అభ్యర్థులు తమ వన్‌ టైమ్‌ ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీపీఆర్‌) ఆధారంగా జనవరి 1 నుంచి 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.

కొత్త అభ్యర్థులు తొలుత కమిషన్‌ వెబ్‌సైట్‌లో తమ ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకుని, ఓటీపీఆర్‌తో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్‌ తరహాలో మార్చి 17న ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నట్టు సర్వీస్‌ కమిషన్‌ పేర్కొంది. డిస్క్రిప్టివ్‌ విధానంలో జరిగే మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనుంది. కమిషన్‌ ప్రకటించిన గ్రూప్‌–1 విభాగంలో 9 డిప్యూటీ కలెక్టర్లు, 18 అసిస్టెంట్‌ ట్యాక్స్‌ కమిషనర్స్‌ పోస్టులు, 26 డిప్యూటీ పోలీస్‌ సూపరింటెండెంట్స్, ఆర్టీవో, గ్రేడ్‌–2 మున్సిపల్‌ కమిషనర్స్, జిల్లా బీసీ సంక్షేమ వంటి ఉన్నత స్థాయి పోస్టులు ఉన్నాయి. గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు సైతం ఆఫ్‌లైన్‌లో ఆబ్జెక్టివ్‌ విధానంలోనే నిర్వహించనున్నారు. మొత్తం పోస్టులు, వేతనం, అర్హతలతో కూడిన పూర్తి సమాచారం కమిషన్‌ వెబ్‌సైట్‌  https://psc.ap.gov.inలో ఉంచినట్టు కార్యదర్శి ప్రదీప్‌ కుమార్‌ తెలిపారు. కాగా, ఇప్పటికే ఆర్థికశాఖ అనుమతినిచ్చిన మరికొన్ని పోస్టులకు ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ ప్రణాళిక సిద్ధం చేసింది. 

వివాదరహితంగా పోస్టుల భర్తీ
గతంలో ఉండే అనేక న్యాయపరమైన వివాదాలను, చిక్కులను పరిష్కరించి ప్రభుత్వం సర్వీస్‌ కమిషన్‌లో సంస్కరణలు తీసుకొచ్చింది. దాంతో గతేడాది ఏపీపీఎస్సీ ఇచ్చిన గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ ద్వారా ఎలాంటి వివాదాలకు తావులేకుండా 11 నెలల కాలంలో పూర్తి పారదర్శకంగా మెయిన్స్, ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేసింది. గ్రూప్‌–1 పరీక్షలు, మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపిక సమర్థవంతంగా నిర్వహించి, హేతుబద్ధంగా అభ్యర్థుల వాస్తవిక నైపుణ్యాన్ని అంచనా వేసి ఎంపిక చేశారు. ఈ నియామకాలు అతి తక్కువ సమయంలోనే కమిషన్‌ పూర్తి చేసింది. ఇదే తరహాలో ఇప్పుడు ప్రకటించిన నోటిఫికేషన్లలో ఇచ్చిన పోస్టులు సైతం సమర్థవంతంగా, సత్వరం భర్తీ చేసేందుకు కమిషన్‌ ఏర్పాట్లు చేస్తోంది.  

Advertisement
Advertisement