Sakshi News home page

గ్రామీణ పేదలకు ‘ఉన్నతి’

Published Sun, Sep 24 2023 4:50 AM

Employment Guarantee Training of youth from laborer families in vocational courses - Sakshi

సాక్షి, అమరావతి:గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం పనులపై ఎక్కువగా ఆధారపడే పేద కుటుంబాల్లో యువతకు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ‘ఉన్నతి’ పేరుతో వివిధ రకాల ఉపాధి, వృత్తి కోర్సుల్లో శిక్షణ ఇచ్చి శాశ్వత జీవనోపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. కంప్యూటర్‌ పరిజ్ఞానంతో పాటు ద్విచక్ర వాహనాలు, ఏసీ మెషిన్లు, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ రిపేర్‌ అండ్‌ సర్వీసింగ్, ఇంటర్నెట్‌ సేవలకు సంబంధించి టెక్నికల్‌ సర్వీస్‌ తదితర 192 రకాల ఉపాధి, వృత్తి విద్య కోర్సుల్లో పేద కుటుంబాల్లోని దాదాపు 25 వేల మంది యువతకు శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యంగా నిర్ధేశించుకుంది.

నిబంధనల ప్రకారం.. ఉపాధి హామీ పథకం కింద ఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి గరిష్టంగా వంద రోజులపాటు పనులు కల్పిస్తున్నారు. ఉదాహరణకు ఒక కుటుంబంలో ముగ్గురు పనిచేసే వ్యక్తులు ఉండి.. ఆ ముగ్గురు ఉపాధి హామీ పథకం కింద పనులు చేసుకోవాలనుకుంటే.. ఒక్కొక్కరికి గరిష్టంగా 33 పని దినాల చొప్పున కేటాయిస్తున్నారు. ఉపాధి కూలీల కుటుంబాలు గరిష్ట వంద రోజుల పరిమితి వినియోగించుకున్న అనంతరం కూడా ఆ కుటుంబం ఏ పనిలేక ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా.. ఉన్నతి పథకం కింద శిక్షణ ఇస్తారు.

ఏడాదిలో వంద రోజుల పనులు పూర్తి చేసుకున్న కుటుంబాలను గుర్తించి ఆయా కుటుంబాల్లో యువతకు శిక్షణ కార్యక్రమాలు అందజేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో గరిష్టంగా 18–45 ఏళ్ల మధ్య, ఇతర సామాజిక వర్గాల్లో 18–35 ఏళ్ల మధ్య వయసు గలవారు ఈ శిక్షణ కార్యక్రమాలకు అర్హులుగా నిర్థారించారు.

ఉచిత శిక్షణతోపాటు రోజూ కూలి జమ
శిక్షణ కార్యక్రమాలను పూర్తి ఉచితంగా అందజేయడంతో పాటు శిక్షణకు హాజరయ్యే యువతకు రోజు వారీ కూలి డబ్బులను స్టైఫండ్‌ రూపంలో ప్రభుత్వం అందజేస్తుంది. గరిష్టంగా వంద రోజులు పాటు స్టైఫండ్‌ అందజేస్తారు. సంబంధిత యువత శిక్షణ కాలంలో కనీసం 75 శాతం హాజరు ఉండాలనే నిబంధన కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.

గరిష్టంగా వంద రోజుల పాటు ఉపాధి హామీ పనులకు వెళ్లిన కుటుంబాల్లో యువత ఉన్న కుటుంబాలు 4,75,327 ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఎస్‌ఈఈడీఏపీ (సీడాప్‌), ఆర్‌ఎస్‌ఈటీఐ, కేవీకే సంస్థల ద్వారా ప్రభుత్వం శిక్షణ ఇప్పించేందుకు నిర్ణయించారు. ఆయా సంస్థలు క్షేత్రస్థాయిలో పనిచేసే ఉపాధి హామీ పథకం సిబ్బంది సాయంతో సంబంధిత కుటుంబాలను ప్రత్యక్షంగా సందర్శించి శిక్షణ పొందేందుకు ఆసక్తి  గల యువత పేర్లను నమోదు చేసుకుంటారు. ఆ తర్వాత అర్హులైన వారికి శిక్షణ 
అందజేస్తారు. 

Advertisement

What’s your opinion

Advertisement