Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్‌ పరిస్థితి విషమం | Sakshi
Sakshi News home page

భూమా వర్సెస్‌ ఏవీ! అఖిలప్రియ బాడీ గార్డ్‌ పరిస్థితి విషమం

Published Wed, May 15 2024 8:37 AM

AV Cadre Attack Bhuma Akhila Priya Body Guard News

నంద్యాల, సాక్షి: పోలింగ్‌ ముగియడంతో జిల్లాలో పాత పగలు భగ్గుమన్నాయి!. గత అర్ధరాత్రి ఆళ్లగడ్డలో ఒక యువకుడిపై హత్యాయత్నం జరిగింది. సదరు యువకుడ్ని టీడీపీ నేత భూమా అఖిలప్రియ దగ్గర పని చేసే బాడీగార్డుగా గుర్తించగా.. ఏవీ సుబ్బారెడ్డి మనుషులే ఈ పని చేయించి ఉంటారనే అనుమానాలు తలెత్తున్నాయి.

కిందటి ఏడాది మే నెలలో జిల్లాలో నారా లోకేష్‌ పాదయాత్ర సందర్భంగా.. అఖిల ప్రియ వర్గీయులు కొత్తపల్లిరోడ్డులో ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేశారు. ఆ సమయంలో నిఖిల్‌ ఆయనపై చేయి చేసుకున్నాడు. భూమా వర్గీయుల దాడిలో ఏవీ సుబ్బారెడ్డి నోటి నుంచి రక్తం కారింది. ఆయనను కొడుతున్నప్పుడు భూమా అఖిల ప్రియా అక్కడే ఉన్నారు. 

పైగా ఆమె ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులను బెదిరించడం కనిపించింది. వారిపై ఘాటు పదాలతో విరుచుకుపడ్డారామె. ఉమ్మడి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో తన తరువాతే ఇంకెవరైనా అంటూ హెచ్చరించారు. ఈ ఘటన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇరువురిని ఎన్నికలయ్యేదాకా గొడవపడొద్దని మందలించినట్లు ప్రచారం జరిగింది. 

కట్‌ చేస్తే.. ఏడాది తర్వాత నిన్న అర్ధరాత్రి  ఆళ్లగడ్డలో అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్‌పై దాడి జరిగింది. తొలుత కారుతో నిఖిల్‌కు ఢీ కొట్టారు. ఆ తర్వాత అతనిపై రాడ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో నిఖిల్‌ తీవ్రంగా గాయపడగా.. నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

పాత పగతో సుబ్బారెడ్డి మనుషులే ఈ పని చేయించి ఉంటారని స్థానిక చర్చ నడుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై స్పందించాల్సి ఉంది. అయితే దాడికి ఉపయోగించిన వాహనం నంద్యాలకు చెందిందిగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement