ప్రగతిధామం.. సంక్షేమ జపం | Sakshi
Sakshi News home page

ప్రగతిధామం.. సంక్షేమ జపం

Published Tue, May 14 2024 4:20 AM

ప్రగతిధామం.. సంక్షేమ జపం

● కందుకూరులో అభివృద్ధి కొత్త పుంతలు

పట్టణంలో నూతనంగా నిర్మించిన అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ భవనం

సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, రాళ్లవాగుపై అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటు

ఆహ్లాదకరంగా పార్కుల అభివృద్ధి

రూ. 26 కోట్ల ప్రత్యేక నిధులు, మరో రూ. 28 కోట్ల జనరల్‌ ఫండ్‌, ఆర్థిక సంఘం నిధుల ఖర్చు

నియోజకవర్గంలో 5.71.538

మందికి సంక్షేమ పథకాలు

సంక్షేమానికి డీబీటీ కింద

రూ.1,106.64 కోట్లు

నాన్‌ డీబీటీ ద్వారా 307.09 కోట్ల లబ్ధి

కందుకూరు: అభివృద్ధిలో కందుకూరు ఆదర్శ మున్సిపాలిటీగా నిలుస్తోంది. ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పట్టణంలో పెద్ద ఎత్తున మౌలిక వసతులు ఏర్పాటయ్యా యి. పట్టణంలోని ప్రతి వీధిలో డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు ఏర్పాటయ్యాయి. ఆహ్లాదం పంచుతూ పార్కులు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వం అందించే తోడ్పాటుతో పట్టణానికి కొత్త సొబగులు అద్దెందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వీటితో మున్సిపల్‌ పార్కులు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లు వంటివి ఏర్పాటయ్యాయి.

2022 జూలై 20 రామాయపట్నం పోర్టు శంకుస్థాపన సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చారు. ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు కందుకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.26 కోట్ల ప్రత్యేక గ్రాంట్‌ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటితో పట్టణంలో 174 పనులకు అధికారులు టెండర్లు పిలిచారు. ఇప్పటి వరకు దాదాపు రూ. 10 కోట్ల విలువ చేసే 61 పనులను కాంట్రాక్టర్లు పూర్తి చేశారు. ప్రధాన రోడ్లు అయిన కోవూరు, పామూరు రోడ్డు ప్రాంతాల్లో భారీ డ్రైనేజీ వ్యవస్థలను నిర్మించారు. వీటి నిర్మాణంతో వరద, మురికి నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకం లేకుండా సాఫీగా సాగే పరిస్థితి ఏర్పడింది. పైగా ప్రధాన రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థ రావడంతో ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. జనార్దనకాలనీ, ఉప్పుచెరువు, సాయినగర్‌, నాంచారమ్మ, కొస్టాలు, కోటారెడ్డినగర్‌, గుర్రంవారిపాళెం తదితర కాలనీల్లో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, డ్రైనేజీలు వంటి ఏర్పాటు చేశారు.

జరల్‌ఫండ్‌, ఆర్థిక సంఘం నిధులతో..

మున్సిపాలిటీ జనరల్‌ ఫండ్‌, 14, 15వ ఆర్థిక సంఘాల నిధులు రూ.25.83 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో రూ.10.13 కోట్లతో రోడ్లు, రూ.6.26 కోట్లతో డ్రైనేజీలు, రూ.4.80 కోట్లతో తాగునీటి సరఫరా వంటి మౌలిక వసతులు కల్పించారు. మరో రూ.3 కోట్లతో క్లబ్‌ రోడ్డు నుంచి ఆదియేంద్ర కాలనీ వరకు భారీ రోడ్డు, బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. మరో రూ. 2 కోట్లతో రాళ్లపాడుపై చేపట్టిన అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఆహ్లాదాన్ని పంచుతున్న పార్కులు

దాదాపు 70 వేల మంది ప్రజలు నివాసం ఉంటున్న కందుకూరులో వినోదానికి అధికారులు పెద్దపీట వేస్తున్నారు. రూ. 40 లక్షలతో ముత్యాలకుంట వద్ద ఉన్న చిల్డ్రన్స్‌ పార్కును సుందరంగా తీర్చిదిద్దారు. పెద్దలు, పిల్లలు కలిసి సరదాగా కాసేపు సేద తీరేందుకు, పిల్లలు ఆటలు ఆడేందుకు ఈ పార్కు ఎంతో ఉపయోగకరంగా మారింది. దివి లింగయ్యనాయుడు పార్కు అభివృద్ధి చేశారు. పట్టణంలోని మరికొన్ని పార్కుల అభివృద్ధికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.

రూ. 25 కోట్లతో అమృత్‌ పథకం పనులు

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి సరఫరాను మరింత మెరుగుపర్చేందుకు అమృత్‌ 2.0 పథకం కింద రూ. 25.7 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఏరియాల వారీగా రోజుకు ఒక గంట చొప్పున నీటి సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం అందుబాటు ఉన్న 7 ఎంఎల్‌డీ (మిలియన్స్‌ ఆఫ్‌ లీటర్స్‌ పర్‌ డే) సామర్థ్యం గల నీటి శుద్ధి ప్లాంట్‌ మాత్రమే ఉండడం నిరంతరం సరఫరా చేయడం కుదరడం లేదు. దీంతో కొత్తగా అమృత్‌ పథకం కింద మరో 5 ఎంఎల్‌డీ ప్లాంట్‌ను నిర్మించి 24 గంటలు నీటిని సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. కుంటల అభివృద్ధి చేపట్టనున్నారు.

పట్టణ వైద్యానికి దన్ను అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లు

పట్టణంలోని శివారు ప్రాంతాల్లో నివశించే పేదలకు సకాలంలో కార్పొరేట్‌ స్థాయిలో మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పట్టణానికి రెండు అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లను మంజూరు చేసింది. మొత్తం రూ. 1.77 కోట్ల ఖర్చుతో వీటిని నిర్మాణం చేశారు. వీటిలో ఒకటి కోటారెడ్డి నగర్‌లో, మరొకటి జనార్దన కాలనీలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే భవన నిర్మాణాలు పూర్తి చేసుకుని డాక్టర్‌లు, వైద్య సిబ్బందిని నియమించి పేదలకు వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతో పట్టణ పేదలకు ప్రభుత్వ వైద్యసేవలు మరింత దగ్గర అవుతున్నాయి. ఏరియా హాస్పిటల్‌ అభివృద్ధిలో భాగంగా దాదాపు రూ. 7 కోట్లతో అధునాతన భవనాలను నిర్మించారు. ఇలా పేదల వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది.

సంక్షేమానికి పెద్ద పీట

రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్ద పీట వేసింది. రాజకీయ పార్టీలు, కుల,మత, ప్రాంతీయ తారతమ్యాలు లేకుండా చేసిన సంక్షేమంతో పేద, మధ్య తరగతి ప్రజలు జీవనోపాదులు మెరుగపడ్డాయి. తద్వారా కొనుగోలు శక్తి పెరగడంతో వ్యాపారాభివృద్ధి సైతం మెరుగు పడింది. కందుకూరు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,28,913 మంది ఉండగా రాష్ట్ర ప్రభుత్వం 5.71.538 మందికి డీబీటీ, నాన్‌డీబీటి కింద సంక్షేమ పథకాల ద్వారా 1,413.75 కోట్ల మేర అందించింది.

ఉదయగిరి: నియోజకవర్గంలోని ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. ఈ మెట్ట ప్రాంతానికి గండిపాళెం రిజర్వాయరు ప్రధాన సాగునీటి వనరుగా ఉంది. రాళ్లపాడు, మోపాడు, నక్కలగండి రిజర్వాయర్ల ద్వారా కూడా కొంత సాగునీరు అందుతుంది. ఎక్కువగా వరి, పొగాకు, మినుము, జామాయిల్‌, నిమ్మ, బత్తాయి, మామిడి తోటలు కూడా అధికంగా ఉన్నాయి. నియోజకవర్గంలో యాభై వేలమంది వరకు రైతులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.

రైతన్న సంక్షేమానికి: ఉదయగిరిలో రూ.1.5 కోట్ల వ్యయంతో అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌ అందుబాటులోకి తెచ్చారు. రూ.19.62 కోట్లతో 95 రైతు భరోసా కేంద్రాలు నిర్మించారు.

ప్రజల చెంతకు పాలన : ఎనిమిది మండలాల పరిధిలో 143 గ్రామ పంచాయతీలు 400 పైగా గ్రామాలు ఉన్నాయి. గతంలో పల్లె వాసులు చిన్న పనికి సైతం వ్యయ ప్రయాసలకు ఓర్చి మండల కేంద్రాలకు వెళ్లాలి. అయితే ఈ ప్రభుత్వం తెచ్చిన సచివాలయ వ్యవస్థ ద్వారా పాలన జనం చెంతకు వచ్చింది. రూ.36.60 కోట్లు వ్యయంతో 95 సచివాలయాలు నిర్మించి అన్నీ సేవలు ఇక్కడ నుంచే అందిస్తున్నారు.

ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ : గతంలో మండలానికి ఒక ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఉండేది. దీంతో పల్లె వాసులకు వైద్య సేవలు గగనంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో వైద్య రంగంలో సమూల మార్పులు తెచ్చారు. 79 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లను రూ.13.83 కోట్లు ఖర్చు చేసి నిర్మించి గ్రామస్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో వైద్యులు ఇంటి వద్దకే వైద్యలు అందిస్తున్నారు.

రూ.760 కోట్లతో జాతీయ రహదారులు : ఉదయగిరి నియోజకవర్గ దశాబ్దాల కల జాతీయ రహదారులు. అరవై ఏళ్ల నుంచి ఎదురు చూపులకు చరమగీతం పాడుతూ వైఎస్సార్‌పీపీ ప్రభుత్వ పాలనలో రూ.760 కోట్లతో కావలి–సీతారామపురం, సింగరాయకొండ–సీతారామపురం రెండు ప్రధాన జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టింది. తద్వారా బీడు భూముల ధరలకు రెక్కలోచ్చాయి. అతి త్వరలో పూర్తయ్యే ఈ జాతీయ రహదారులు ద్వారా రాష్ట్రంలో ఎక్కడకై నా అతి వేగంగా చేరుకునే అవకాశం కలిగింది. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే ’గ్రీన్‌ ఫీల్డ్‌’ ఎక్స్‌ప్రెస్‌ హైవే సీతారామపురం మీదుగా వెళ్తొంది. రూ.53.40 కోట్లు ఖర్చు చేసి పలు గ్రామీణ రోడ్లు అభివృద్ధి చేస్తున్నారు.

నెరవేరిన సొంతింటి కల: నియోజకవర్గంలోని 194 లేఅవుట్లు ఏర్పాటు చేసి 6400 మందికి పక్కా ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో చాలా వరకు పనులు పూర్తికాక, మరికొన్ని చోట్ల పనులు చకచకగా సాగుతున్నాయి. లేఅవుట్‌ల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నా రు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ఇళ్లు నిర్మాణం చేపట్టారు. స్థలంతో కలిపి ఒక్కొక్కరికి సగటున రూ.8 లక్షలు మేర లబ్ధి చేరుకూరుతోంది. అంటే రూ.480 కోట్లు అస్తి అక్క చెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేశారు.

నాడు–నేడుతో మారిన పాఠశాలల రూపు రేఖలు : నాడు–నేడు ద్వారా శిథిలవస్థకు చేరుకున్న పాఠశాలల రూపు రేఖలు మారాయి. ఫేజ్‌–1, ఫేజ్‌–2 ద్వారా రూ.125.04 కోట్లు ఖర్చు చేసి సకల సదుపాయాలు కల్పించి విద్యార్థులు చక్కగా చదువుకునే వాతావరణం కల్పించారు. పలు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో ఇంటర్‌ తరగతులు ప్రారంభించి భవనాలు కట్టించారు.

ఉదయగిరి ట్యాంక్‌బండ్‌ : నియోజకవర్గ ముఖ చిత్రం మార్చే ఉదయగిరి ట్యాంక్‌ బండ్‌ పనులు రూ.9 కోట్ల వ్యయంతో సాగుతున్నాయి. ఇది పూర్తయితే పట్టణ ప్రజల దాహార్తి తీరడమే కాకుండా, వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు అందుబాటులోకి వస్తోంది.

నగరానికి కొత్త రూపు

పట్టణం రోజు రోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రధాన రోడ్లకు కొత్త రూపు తెచ్చేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. వీటిలో రూ. 2 కోట్ల ఖర్చుతో ఓవీ రోడ్డులోని క్లబ్‌ రోడ్డు నుంచి ఎస్‌బీఐ వరకు డివైడర్‌, సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏరియా హాస్పిటల్‌ ఎదురు పామూరు రోడ్డు జంక్షన్‌ను సుందరంగా ఆధునికీకరించేందుకు చర్యలు చేపట్టారు. ఇవి పూర్తయితే పట్టణానికి కొత్త అందాలు వచ్చి చేరుతాయని అధికారులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement