‘‘ఇంతదాకా వస్తుందని అనుకోలేదు’’ | Sakshi
Sakshi News home page

‘‘ఇంతదాకా వస్తుందని అనుకోలేదు’’

Published Sun, Dec 11 2016 4:33 AM

‘‘ఇంతదాకా వస్తుందని అనుకోలేదు’’

‘‘ఇంతదాకా వస్తుందని అనుకోలేదు’’ అన్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీజీ. ఆయన కళ్లలో తొలిసారిగా నేను ఆవేదనను చూశాను! పులి కళ్లలో మనుషులకు గాంభీర్యం కనిపించాలి కానీ ఆవేదన కనిపించకూడదు. పులి ఆవేదన చెందుతూ కనిపించడం ప్రకృతి వినాశనానికి సంకేతం!
నేను, అరుణ్‌ జైట్లీ, భారత ప్రధాని నరేంద్ర మోదీజీ.. ముగ్గురమే కూర్చొని ఉన్నాం. భారత ప్రధాని నరేంద్ర మోదీజీ ఇంట్లో కూర్చొని ఉన్నాం. చాలాసేపటిగా నేను, జైట్లీజీ మాత్రమే మాట్లాడుకుంటున్నాం.
‘‘హస్ముఖ్‌ అధియాజీ.. నేను మిమ్మల్ని ప్రత్యేకంగా సంబోధించాలని మీరు గానీ కోరుకోవడం లేదు కదా’’ అన్నారు జైట్లీజీ అకస్మాత్తుగా. ‘‘జైట్లీజీ.. నేను ఏనాడైనా మీ నుంచి కనీస మానవ మర్యాదలనైనా ఆశించానా!’’ అని అడిగాను. (చదవండి: మోదీ నివాసంలో రహస్యంగా!)

‘‘ఆశించలేదు కానీ, మీరు మాటిమాటికీ భారత ప్రధాని నరేంద్ర మోదీజీ అనడం చూస్తుంటే, నేను కూడా మిమ్మల్ని మాటిమాటికీ కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్‌ అధియాజీ అని పిలవాలని మీరు ఆకాంక్షిస్తున్నారేమోనని నాకు అనుమానం కలుగుతోంది’’ అన్నారు జైట్లీజీ.
నవ్వాను. ‘‘మీకు అలాంటి అపరాధ భావన ఏమీ ఉండనక్కర్లేదు జైట్లీజీ. ఎందుకంటే నేను మిమ్మల్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి జైట్లీజీ అని పిలవడం లేదు కదా’’ అన్నాను. ఇంకో విషయం కూడా జైట్లీజీకి క్లారిఫై చేశాను. ‘‘ఇప్పుడే కాదు, మోదీజీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉండి, నేను ఆయన ప్రభుత్వ కార్యదర్శిగా ఉన్నప్పుడు కూడా నేను ఆయన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీజీ అనే çసంబోధించేవాడిని’’ అని చెప్పాను.
జైట్లీజీ విరుపుగా నవ్వారు. ‘‘నిజమే, పాత నోట్లను వెనక్కు తీసుకున్నంత తేలిక కాదు, పాత అలవాట్లను వెనక్కు తీసేసుకోవడం’’ అన్నారు. ఆయన బాధ అర్థమైంది. నోట్ల రద్దు మీటింగ్‌ ఆయన లేకుండానే జరిగింది. నోట్ల రద్దు నిర్ణయం ఆయనకు తెలియకుండానే జరిగింది.

‘‘ఇంతదాకా వస్తుందని అనుకోలేదు’’ అని మళ్లీ ఆవేదనగా అన్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీజీ.  స్వచ్ఛమైన గుజరాతీలో నాతో రెండు ముక్కలు మాట్లాడి లోపలికి వెళ్లిపోయారు.
జైట్లీజీ నా వైపు అసహనంగా చూస్తున్నారు. ‘‘మీరూ మీరూ గుజరాతీలో మాట్లాడుకుంటే నాకేం అర్థమౌతుంది?’’ అన్నారు.
‘‘నోట్ల రద్దు గురించి ‘ముందే మాకెందుకు  చెప్పలేదు’ అని భారతీయులే నన్ను ప్రశ్నించలేదు. కానీ రాహుల్‌ ప్రశ్నిస్తున్నాడు!’ అని మోదీజీ ఫీల్‌ అవుతున్నారు’’ అని చెప్పాను.
ఇందులో ఫీల్‌ అవడానికి ఏముందీ అన్నట్లు చూశారు జైట్లీజీ. నిజానికి మోదీజీ ‘భారతీయులే’ అనే మాట అనలేదు. ‘జైట్లీజీనే నన్ను ప్రశ్నించలేదు’ అని అన్నారు. ఆ సంగతి నేను జైట్లీజీకి చెప్పలేదు.

ఇది.. హస్ముఖ్‌ అధియా (ఐఏఎస్‌) రాయని డైరీ
- మాధవ్‌ శింగరాజు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement