పరికరం ఒకటే.. పనులు మూడు!

పరికరం ఒకటే.. పనులు మూడు!


ఆరుతడి పంటల్లో కలుపు తీతకు యంత్రాన్ని తయారు చేసిన సృజనాత్మక రైతు విశ్వనాథం

చెరకు, మిరప తదితర పంటలతోపాటు శ్రీవరి పొలాల్లో కలుపు తీతకు, గొప్పు తీయడానికీ అనుకూలం!


 

ఆరు పదులు దాటిన వయస్సు. అందరిలా కృష్ణా రామా అనుకోకుండా.. మట్టి మీద మమకారం మరింత పెంచుకున్నాడు ఈ పెద్దాయన. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం జె.తిమ్మాపురం గ్రామానికి చెందిన పాలచర్ల విశ్వనాథం వయసు మీద పడుతున్నా ప్రాణప్రదంగా వ్యవసాయం సాగిస్తున్నారు. నానాటికీ పెరిగి భారమవుతున్న వ్యవసాయ పెట్టుబడులను తగ్గించే లక్ష్యంతో ఆలోచనలకు పదును పెట్టారు. ఈ ప్రాంతంలో చెరకు సాగు ఎక్కువ. కూలీల కొరతతో పెరిగిన కూలి రేట్లు తడిసి మోపెడవుతున్నాయి. ఎలాగైనా సాగు ఖర్చులు తగ్గించి రైతుకు నాలుగు డబ్బులు మిగిలే దారి వెతకాలని ప్రయత్నించి.. చెరకు పొలాల్లో కలుపు తీత పరికరాన్ని రూపొందించారు. రాజానగరం కలవచర్ల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సలహాలు ఉపయోగించుకున్నారు.

 

తేలికపాటి నేలల్లో చెరకు సాగు చేసే రైతులను దృష్టిలో పెట్టుకుని విశ్వనాథం కోనోవీడర్‌ను పోలిన పరికరాన్ని రూపొందించారు. కోనోవీడర్‌ను శ్రీవరి సాగులో తడి నేలలో కలుపు తీతకు ఉపయోగిస్తారు. దీని పని విధానం గమనించిన విశ్వనాథం ఆరుతడి పంటలకు ఉపయోగపడే విధంగా, అందుబాటులో దొరికే వస్తువులను వినియోగించుకొని రూ. 1,200 ఖర్చుతో ఈ పరికరాన్ని తయారు చేశారు.

 

ఎకరం చెరకు తోటలో కలుపు తీయడానికి పది మంది కూలీలు అవసరమవుతారు. విశ్వనాథం తయారు చేసిన కలుపుతీత యంత్రం వినియోగిస్తే ఇద్దరితో పని పూర్తవుతుంది. దీని వలన రైతుకు ఎకరానికి రూ. 3 వేల ఖర్చు తగ్గుతుంది. ఇదే పరికరానికి అదనంగా చిన్నపాటి నాగలిని అమర్చి గొప్పు తీయవచ్చు. దీనికి రొటోవీడర్‌ను అమరిస్తే శ్రీవరి పొలంలోనూ కలుపు తీయవచ్చు. డ్రమ్‌సీడర్‌తో సాగు చేసిన వరి మాగాణిలో కూడా ఈ పరికరాన్ని వినియోగించి కలుపు తీయవచ్చు.



వరి పంట చిరుపొట్ట దశకు వచ్చే వరకు మూడుసార్లు అంతర కృషి చేస్తే.. దుబ్బు విస్తరించి మూడు నుంచి నాలుగు బస్తాల అధిక దిగుబడి సాధించవచ్చని విశ్వనాథం వివరించారు. ఒకే సాధనంతో మూడు పనులు నిర్వహించే వీలుండడంతో చుట్టుపక్కల రైతులు దీనిపై ఆసక్తిని కనబరుస్తున్నారు. వ్యవసాయంలో పలు దశాబ్దాల అనుభవం ఉన్న విశ్వనాథం సృజనాత్మక కృషిని గుర్తించిన ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈయనను సృజనాత్మక రైతుగా ఎంపిక చేసింది. జిల్లా వ్యవసాయ అధికారులు జిల్లా ఉత్తమ రైతు అవార్డుతో సత్కరించారు.

 

చెరకు ముచ్చెలకు బదులు.. మొక్కలు!

తణుకు చక్కెర కార్మాగారం పరిధిలో చెరకు సాగు ఎక్కువగా ఉండడంతో సాగు పరిస్థితిని పరిశీలించిన విశ్వనాథం సాగు ఖర్చులు తగ్గించడానికి చెరకు ముచ్చెలు నాటడానికి బదులు నర్సరీలో మొక్కలు పెంచి నాటే పద్ధతిని పరిచయం చేశారు.

 

విశ్వనాథం ఇంకా ఇలా వివరించారు.. సాధారణ పరిస్థితిలో ఎకరాలో చెరుకు నాటడానికి 40 టన్నుల చెరుకు అవసరం పడుతుంది. దీనికి రైతు రూ. పది వేలు ఖర్చు చేయాలి. దీనికి బదులుగా ఒంటికన్ను ముచ్చలను ప్రోట్రేలలో పెంచడం ద్వారా ఎదిగిన మొక్కలను నేరుగా నాటుకునే వీలుంటుంది. నర్సరీ పెంచిన తేదీని చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యం పైరు నాటిన తేదీగా గుర్తించడం వలన నెల రోజులు ముందుగానే కటింగుకు అందివస్తుంది. దీనికి తోడు సాధారణ పద్ధతిలో చెరకు నాటడానికి 25 మంది కూలీల అవసరం పడుతుంది.

 

ఎదిగిన మొక్కలు నాటడానికి కేవలం ఆరుగురు కూలీలు సరిపోతారు. కూలీల ఖర్చులో రూ. 5 వేలు ఆదా అవుతాయి. విత్తనం ఖర్చులో రూ. రెండు వేలు మిగులుతుంది. మొక్కలు నాటడం వలన.. పిలకల సంఖ్య పెరిగి ఎకరానికి సుమారు పది టన్నుల దిగుబడి పెరుగుతుంది. మొత్తంగా రైతుకు రూ. పది నుంచి పదిహేను వేలు ఆదా అవుతుంది. ఆరు పదులు దాటినా చురుకుగా వ్యవసాయ పనుల్లో పాల్గొనడమే కాక సాటి రైతులకు సహకారం అందిస్తూ, వినూత్నంగా ఆలోచించే విశ్వనాథం రైతాంగానికి ఆదర్శ ప్రాయుడుగా నిలుస్తున్నారు.

 - బూరాడ శ్రీనివాసరావు, పెద్దాపురం రూరల్, తూ. గో. జిల్లా

 

కావాలంటే తయారు చేసిస్తా..!

పలువురు రైతులకు కలుపు తీసే యంత్రాన్ని తయారు చేసి ఇచ్చా. ఆసక్తి ఉన్న వారికి దీని తయారీ విధానం తెలియజేస్తా. కావాలన్న వారికి తయారు చేసి ఇస్తా.

- పాలచర్ల విశ్వనాథం(9390479971), సృజనాత్మక రైతు, జె.తిమ్మాపురం,పెద్దాపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా

Read latest Vanta-Panta News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top