ఎమ్మెల్యేల పనితీరుకు మార్కులు | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేల పనితీరుకు మార్కులు

Published Fri, Mar 10 2017 7:26 PM

ఎమ్మెల్యేల పనితీరుకు మార్కులు - Sakshi

► టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ చేయించిన సర్వే ఫలితాలు 
► 6 నెలల కాలంలో భారీగా పడిపోయిన ఎమ్మెల్యేల పనితీరు 
► ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోవాలని సూచించిన అధినేత 
► జిల్లాలో మెజార్టీ స్థానాలు గెలుచుకోనున్నట్లు వెల్లడి 
 
సాక్షి, మహబూబ్‌నగర్‌ : ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్వహించిన సర్వే ఒక్కసారిగా రాజకీయ వేడి రగిల్చింది. జిల్లాలోని ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా మార్కులు వేశారు. తాజాగా వెలువడిన సర్వే ఫలితాలు ఎమ్మెల్యేలలో ఒక్కసారిగా గుబులు పుట్టించాయి. 6నెలల వ్యవధిలోనే ఎమ్మెల్యేల పనితీరు భారీగా పడిపోయినట్లు సర్వేలో వెల్లడైంది. ఎమ్మెల్యేల పనితీరును కాస్త మార్చుకోవాలని సుతిమెత్తగా హెచ్చరించారు. 
 
జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై వచ్చిన మార్కులతో సీఎం కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కేవలం 6నెలల కాలంలోనే దాదాపు 20శాతం పైగా పడిపోయారని వివరించారు. అయితే ఎమ్మెల్యేలు తమ పనితీరును మార్చుకుంటే సునాయాసంగా గెలుపొందవచ్చని, వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొత్తం 119స్థానాలకుగానూ దాదాపు 106 వరకు గెలుపొందుతామని పేర్కొన్నారు. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కూడా మెజార్టీ స్థానాలు గెలుపొందుతామని స్పష్టం చేశారు.
 
ఎన్నికల వేడి రగిల్చిన సర్వే..
రానున్న రెండేళ్లలో జరగనున్న సాధారణ ఎన్నికలకు రాజకీయ పార్టీలు అప్పుడే సన్నద్ధమవుతున్నాయి. 2014 సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 14నియోజకవర్గాలకుగాను 7 స్థానాలు టీఆర్‌ఎస్‌ గెలుపొందగా.. 5 కాంగ్రెస్, 2టీడీపీ గెలుపొందాయి. రాష్ట్ర స్థాయిలో మారిన పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీల నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ బలం 9కి చేరింది. 
 
ఈ నేపథ్యంలో వచ్చే సాధారణ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు ఒక సవాలుగా తీసుకున్నాయి. అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తూ గెలుపు గుర్రాలను చూసుకుంటున్నారు. నెల రోజుల క్రితం పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సర్వే నిర్వహించగా... తాజాగా సీఎం కేసీఆర్‌ సర్వేలను బయటపెట్టడంతో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. 
 
ఫస్ట్‌క్లాస్‌ మార్కులే రాలే...
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జి ల్లాలో కేవలం ముగ్గురు మాత్ర మే ఫస్ట్‌ క్లాస్‌ మార్కులు సాధిం చినట్లు సీఎం సర్వే ద్వారా వెలుగుచూసింది. వీరిలో టీఆర్‌ఎస్‌ నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మాత్ర మే 67.40శాతం సాధించారు. మిగతా ఇద్దరు అలంపూర్‌ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ 71.10శాతం, గద్వాల ఎమ్మెల్యే 65శాతం లభించింది. 6నెలల్లో నే ఎమ్మెల్యేల పనితీరు బాగా పడిపోయింది. సరాసరిగా ప్రతీఒక్క ఎమ్మెల్యే 20శాతం మేర పడిపోయారు. 
 
ఆ  రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి డా.సి.లక్ష్మారెడ్డి   6నెలల క్రితం 73.20శాతంలో ఉంటే జనవరిలో నిర్వహించిన సర్వేలో 51.40 శాతానికి పడిపోయారు. అదే విధంగా పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు 6నెలల క్రితం 62.50శాతం ఉండగా... తాజా సర్వేలో 55.20కు తగ్గింది. కొడంగల్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి 6నెలల క్రితం 56.80శాతం ప్రజల మద్దతు లభించగా... ప్రస్తుతం 49.80శాతం ఉన్నట్లు వెల్లడైంది. 
 
సుతిమెత్తగా హెచ్చరింపు...
జిల్లాలోని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పనితీరు మార్చుకోకపోతే వేటు తప్పదని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. పనితీ రు ఆధారంగా.. సర్వేల ఆధారంగానే పార్టీ తరఫున టిక్కెట్లు ఇవ్వనున్నట్లు సంకేతాలు జారీ చేశారు. సాధారణ ఎన్నికలకు మరో రెండేళ్లు ఉ న్న నేపథ్యంలో ఎమ్మెల్యేలందరూ పద్ధతి మార్చుకోవాలని సూచించినట్లు సమాచారం. ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నారో సర్వే ద్వారా తెలియజేశారు. ఇక నుంచి జనం మధ్యలో తిరుగుతూ.. వారి సమస్యలను పరిష్కరించాలని సుతిమెత్తగా హెచ్చరించారని పార్టీ వర్గాలు తెలిపాయి. 

Advertisement
Advertisement