ముంపు రైతుకు ముప్పేనా? | Sakshi
Sakshi News home page

ముంపు రైతుకు ముప్పేనా?

Published Wed, Sep 24 2014 2:08 AM

Suspected of compensation received from the AP

భద్రాచలం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించిన ముంపు మండలాల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇటీవల గోదావరి వరదలతో తీవ్రంగా నష్టపోయిన ముంపు రైతులకు ఏపీ ప్రభుత్వమే పంట నష్టపరిహారం ఇస్తుందని స్పష్టత వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన అధికారులు చేస్తున్న సర్వేను ఏపీ ప్రభుత్వం ఏ మేరకు ప్రాతిపదికగా తీసుకుంటుందన్న దానిపై రైతుల్లో కొంత అనుమానం నెలకొంది.

 ముంపు మండలాల విలీనంపై ఫైనల్ గెజిట్ ఇచ్చినా..పాలనా వ్యవహారాలపై ఉభయ గోదావరి జిల్లాల అధికారులు పెద్దగా దృష్టి సారించలేదు. వరద నష్టంపై ప్రస్తుతం రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నా వీరిపై తగిన అజమాయిషీ చేసే అధికారులు లేకపోవటంతో ముంపు మండలాల్లో ఇది అస్తవ్యస్తంగా సాగుతోంది. రేపోమాపో తెలంగాణ రాష్ట్రానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న రెవెన్యూ అధికారులు పంట నష్టం అంచనాలపై కొంత అలసత్వం ప్రదర్శిస్తున్నారని రైతులు బాహటంగానే అంటున్నారు.

పంటలు నష్టపోయిన తమకు తగిన పరిహారం అందుతుందో లేదోననే ఆందోళన రైతుల్లో నెలకొంది. గోదావరి పరీవాహక ప్రాంతంలోని 14 మండలాల్లో 8,967 హెక్టార్‌లలో పంట నష్టం జరిగినట్లుగా జిల్లా అధికారులు లెక్క తేల్చారు. ఇందులో  భద్రాచలం డివిజన్‌లోని భద్రాచలం రూరల్, కూనవరం, చింతూరు, వీఆర్‌పురం, పాల్వంచ డివిజన్ బూర్గంపాడులోని ఆరు రెవెన్యూ గ్రామాలతో పాటు కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు ఏపీలో విలీనం అయ్యాయి. ఏపీలో విలీనం అయిన ఏడు మండలాల్లో 5,308 హెక్టార్‌లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనికి నష్ట పరిహారం ఏపీ అధికారులే ఇవ్వాల్సి ఉంటుంది. పంట నష్టం ఎంత చెల్లించాలనే దానిపై ప్రస్తుతం రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు.

 గతే డాది నష్ట పరిహారం ఇచ్చేదెవరు?
 గతేడాది గోదావరి వరదలతో ఇప్పటికంటే ఎక్కువే పంట నష్టం జరిగింది. కానీ నష్టపోయిన రైతులు, ఇళ్లు కూలిపోయిన బాధితులకు ఇప్పటి వరకు నయాపైసా సాయం అందలేదు. రెండు రాష్ట్రాలు విడిపోయిన నేపథ్యంలో ఏడు మండలాల్లోని బాధిత రైతులకు గతేడాది నష్ట పరిహారం ఎవరు ఇస్తారనే దానిపై స్పష్టత లేదు.  ఇరు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు పంట రుణాల మాఫీకి హామీ ఇచ్చాయి. ఇప్పటికే తెలంగాణలో రుణమాఫీ ప్రక్రియ మొదలైంది. కానీ జిల్లాలో రుణం ఆ ఏడు మండలాలకు చెందిన రైతులు, ప్రస్తుతం ఏపీలోకి వెళ్తున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం నుంచి ముంపు రైతులకు ఎటువంటి భరోసా రాలేదు.

 పోలవరం ముంపు భూములకు పరిహారం లేనట్లే
 పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పునరావాస ప్యాకేజీ చెల్లించిన భూముల్లోని పంటలకు నష్ట పరిహారం ఇచ్చేది లేదని అధికారులు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసమని ఏపీ విలీనమైన ఏడు మండలాల్లో 74,751.96 ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు ఇప్పటికే 45,756.90 ఎకరాలుకు పునరావాస ప్యాకేజీ పంపిణీ చేశారు. కానీ ఈ భూముల్లోని పంటలకే ఎక్కువ నష్టం జరిగింది. పునరావాస ప్యాకేజీ తీసుకున్నా ఇంకా భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకపోవటంతో వేలాది రూపాయలను పెట్టుబడిగా పెట్టి రైతులు పంటలు సాగుచేస్తున్నారు. కానీ ఈ భూములకు నష్ట పరిహారం ఇచ్చేది లేదని ఏపీ ప్రభుత్వం చెబుతుండటంతో రైతుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement